Sunday, April 10, 2022

తనను ఏ ఒక్కరూ గమనించని వేళల్లో తప్పుడు పనులకు తెగించడం మనిషి బలహీనత! ‘నేను ఒక్కణ్నే ఉన్నాను. నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు- అంటుంది ‘మహాభారతం’.

🍀🌹ఫ్రెండ్స్
తనను ఏ ఒక్కరూ గమనించని వేళల్లో
తప్పుడు పనులకు తెగించడం మనిషి బలహీనత!
‘నేను ఒక్కణ్నే ఉన్నాను.
నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని
మనిషి అనుకోవడం చాలా పొరపాటు-
అంటుంది ‘మహాభారతం’.

మనిషి ఏ పని చేస్తున్నా,
నిశితంగా పరిశీలించేవి ఒకటీ రెండూ కాదు,
పద్దెనిమిది ఉన్నాయని ‘ ఆదిపర్వం’ హెచ్చరిస్తుంది.
వాటిని మహా పదార్థాలుఅంటారు.
నాలుగు వేదాలు,
పంచభూతాలు,
ధర్మం,
ఉభయ సంధ్యలు,
అంతరాత్మ,
యముడు,
సూర్యచంద్రులు,
పగలు, రాత్రి...
ఇలా మొత్తం పద్దెనిమిది మహాపదార్థాలు
మనిషిని అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి.
వీటి ‘గమనిక’ నుంచి అతడు తప్పించుకోవడం అసాధ్యం.

దీన్ని గుర్తించలేని కారణంగానే-
ఇవన్నీ జడపదార్థాలని,
సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని
మానవుడు పొరబడుతుంటాడు. భారతం పేర్కొన్న మహాపదార్థాలు
ఆ రహస్య యంత్రాల వంటివి.
అవి మనిషి ప్రతీ చర్యనూ నమోదు చేస్తాయి.
ఆ నివేదికల్ని ‘విధి’కి చేరవేస్తాయి.
అది వాటిని కర్మలుగా మలుస్తుంది.
మనిషి చేసే పనులు మంచివైతే సత్కర్మగా,
చెడు పనుల్ని దుష్కర్మగా విధి నిర్ణయిస్తుంది.
సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి.
ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం.

మహాపదార్థాల్ని చైతన్య స్వరూపాలుగా
గుర్తించినవారు వివేకవంతులు.
వాటికి సంబంధించిన అవగాహననే ‘జ్ఞానం’గా భావించవచ్చు.
ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్ముడు పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడంటే-
వాటి ఉనికిని ఆయన గుర్తించినట్లే,
వాటికి సంబంధించిన జ్ఞానం ఆయనకు ఉండబట్టే!

కీచకుడి మందిరానికి పయనమైన ద్రౌపది,
తనకు రక్షణగా ఉండాలని సూర్యుణ్ని ప్రార్థిస్తుంది.
ఆమె అభ్యర్థనను ఆయన మన్నించి, సహాయం చేస్తాడు.

కణ్వమహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను
దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకుంటాడు.
తీరా కొడుకుతో సహా ఆమె రాజదర్బారుకు వెళితే
‘నువ్వు గుర్తులేవు’ అంటాడు.
ఆమె మనసును చిక్కబట్టుకొంటుంది.
పద్దెనిమిది చైతన్య స్వరూపాల గురించీ వివరించి, చివరకు విజయం సాధిస్తుంది.

తక్కినవాటి మాట ఎలా ఉన్నా,
అంతరాత్మ అనేది ఒకటుందని మనిషికి తెలుసు.
అది అప్పుడప్పుడూ నిలదీయడం,
తాను సిగ్గుపడటం ప్రతి మనిషికీ అలవాటే!
అంతరాత్మ నిజమైనప్పుడు,
తక్కిన పదిహేడూ వాస్తవమేనని అతడు
గ్రహించడమే వివేకం.
గుప్తదాతలు వివేకవంతులు.
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, పూజాదికాలు నిర్వహించాలన్న ఉబలాటం అవివేకం.

మహాపదార్థాలు గమనిస్తున్నాయంటే,
ఎవరు చూడాలో వారే చూస్తున్నారని అర్థం.
ఈ ఎరుక కలిగినప్పుడు,
ఏ మనిషీ చెడ్డపనులకు తెగించడు.
ఎవరు చూసినా చూడకున్నా
ప్రతిక్షణం భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటాడు
ప్రతి పని ఆచితూచి ఆలోచించి చేద్దాం
ఆతండ్రి పరమాత్మ పాదాల చెంత చేరువరకు
మన చేయి పట్టుకునేలా
*పట్టుకున్న చేయి వదలకుండా ప్రవర్తించుదాం.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment