Friday, April 15, 2022

ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!

ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!

భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు,
పులి గోళ్లతో “అఫ్జల్ ఖాన్” గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి,
ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్దారకుడు,
కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలి పోకుండా ప్రజలను ప్రేమించి “ఛత్రపతి” గా ఎదిగిన జిజియా బాయి ముద్దు బిడ్డ…!!

నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. అతడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ 💪🚩🚩

కానీ ఈ వ్యాసం ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి కాదు ఆ శివాజీ మహరాజ్ ప్రాణాలనే కాపాడిన ఒక యోదుడి గురించి.

రాజు కోసం, దేశం కోసం, ధర్మ కోసం – చావును సైతం దిక్కరించి, దేహమంత రక్తంతో తడిసి ముద్ద అయినా కూడా, రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిశాకే ప్రాణాలను వదులతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడి గురించి. మన చరిత్ర మనం తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత…!!

అది 1660 వ సంవత్సరం.
బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న “ఆదిల్షాయులు” ఎన్నో సార్లు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చావు దెబ్బ తిని ఓడిపోయేవారు. అందుకే ఈ సారి ఆధీల్షాయులు “మొగల్ చక్రవర్తి ఔరంగజేబు” సహాయం తీసుకొని మరీ పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో ఉన్న శివాజీని, శివాజీ కుడి భుజం, సర్వ సైన్యాధిపతి అయిన “బాజీ ప్రభు థేస్పాండే” ని 10000 వేల సైన్యం తో కోటని చుట్టుముట్టి బంధీలను చేశారు. సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని “ఆధీల్షాయులు” ఎదురు చూస్తున్నారు.

కేవలం 600 మంది సైన్యం. ఆ 600 మంది సైన్యం, 10000 మందితో పోరాడి యుద్ధం గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం. కానీ 10000 మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు, పన్హాలా కోటలో ఉన్న ధాన్య శాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ ఐతే ఆధీల్షాయులలోని సైన్యం కొంతభాగం ఆహారం సేకరించుటకు వెళ్తుంది. అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు. కొన్ని నెలలు గడిచాయి పన్హాల కోటలోని ఆహారం దాన్యగారం లోని ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి.

ఇప్పడు 10000 మందికి ఆహారం కావాలి కాబట్టి ఆధీల్షాయుల సైన్యం లోని కొంతభాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు. ఛత్రపతి శివాజీ తప్పించుకొనే సమయం అస్సన్నమైనది. పన్హలా కోట నుండి “రంగీ నారాయణ్” అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న “విశాల్ఘట్ కోటకు” వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు.

13 జులై 1660 వర్షాకాలం. అమవాస్యకి దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి, ఛత్రపతి శివాజీ – బాజీ ప్రభువులతో పాటు 600 మంది సైనికులు “విశాల్ఘట్” కు అడవి మార్గం గుండా ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నారు.

సైన్యం లో శివాజీ మహారాజు పోలికలతో ఉండే “శివకాశీ” అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చుగుద్దినటట్లుగా శివాజీ మహారాజు లాగా తయారు చేసి ఆధీల్షాయి సైన్యానికి కనపడే విధంగా 10 మంది సైనికులతో పంపించారు.

ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశీ ని చూసి శివాజీ నే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్షాయిల సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు. ఇదే అదును చూసి ఆదిల్షాయిల సైన్యం మొత్తం శివకాశీ దగ్గరకు వెళ్లినప్పుడు, విశాల్ఘట్ వైపుకు అడవి మార్గం గుండా అతి వేగంగా బయలు దేరారు శివాజీ అతని సైనికులు.

వర్షాల తాకిడికి అడవిగుండా ముళ్లకంపలు చెత్తా చెదారం కొట్టుకొచ్చాయి, నడిచే మార్గం అంతా బురద ముళ్ల పొదలతో భయంకరంగా ఉంది.
కానీ అక్కడ ఉన్న 600 మందికీ ఒక్కటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశాల్ఘట్ కు చేర్చటం. ఆ 600 కి ఉన్న ధైర్యం కూడా ఒక్కడే అతడే బాజీ ప్రభు దేశ్పాండే….!!

బాజీ ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమి చేయలేరు అనే నమ్మకం తో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆదిల్షాయిల సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజు ను కాదని మారువేషంలో ఉన్న శివకాశీ అని తెలుసుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు.

శివకాశీ ని అక్కడికక్కడే నరికి చంపి 8000 మంది సైన్యాన్ని శివాజీ వెనుక తరముకుంటు వెళ్లి శివాజీ ని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. తెల్లవారే సమయానికి “గోడ్కింగ్” అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకొంటున్న శివాజీ సైన్యం, ఆదిల్షాయుల సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆదిల్షాయిల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్ఘట్ కి చేరటం అసాధ్యం …

ఎందుకంటే ఆ సమయం లో ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుఱ్ఱం కూడా లేదు, కానీ సగం ఆదిల్షాయిల సైన్యం వద్ద గుఱ్ఱలు ఉన్నాయి. అక్కడే యుద్ధం చేసి ఆదిల్షాయిల సైన్యాన్ని ఓడించటం జరగని పని.

8000 మంది సైన్యం తో 600 మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం. ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీ ప్రభువు రాజుతో వివరించాడు.

గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఈ దారిగుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు.
సైన్యం లో సగం మందిని అంటే సరిగ్గా 300 మందితో నేను గోడ్కింగ్ కు అడ్డుగా నిలబడి ఆదిల్షాయిల సైన్యం తో పోరాడుతాను. ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారిగుండా రాలేరు కాబట్టి తక్కువులో తక్కువ రెండు మూడు గంటల వరకు నేను ఆదిల్షాయిలను ఆపగలను. ఈ సమయం లో మిగిలిన 300 మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ “విశాల్ఘట్” కు చేర్చండి. శివాజీ మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను 5 సార్లు పేల్చండి.
ఫిరంగులు శబ్దం మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరారు అని నాకు సంకేతం…అని పథకాన్ని వివరించాడు. మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు.

300 మంది సైన్యం తో శివాజీ మహారాజు విశాల్ఘట్ కు బయలు దేరాడు. మిగిలిన 300 మంది సైన్యం తో బాజీ ప్రభువు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఆదిల్షాయిల సైన్యం గోడ్కింగ్ కు చేరుకుంది. యుద్ధం మొదలు అయ్యింది. అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్షాయిలను నరికేస్తున్నారు బాజీప్రభు అతని సైన్యం. ఇరుకైన కొండ ప్రాంతం అవ్వటం తో శివాజీ మహారాజుకు తప్పించుకోడానికి ఎక్కువ సమయం దొరికినా అవతలి వైపు ఉన్నది 8000 మంది సైన్యం 300 మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పటం ఆపటం లేదు. సమయం గడిచేకొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది , కానీ బాజీ ప్రభువు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్షాయిల వైపు 20 నుండి 30 మంది చనిపోతున్నారు . సుమారు 4 గంటలు గడిచే సరికి 8000 మంది ఆదిల్షాయిల సైన్యం లో 5000 మంది మరణించారు. కానీ బాజీ ప్రభు సైన్యం లో దాదాపు అందరు మరణించారు.

బాజీ ప్రభు తో పాటు ఆతికొద్ది మంది మాత్రమే మిగిలారు. కేవలం 300 మంది సైన్యం తో 5000 మందిని చంపటం చరిత్రలో అదే మొట్టమొదటి సారి ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో దేహం అంతా గాయాలతో…రక్తంతో… తడిసి ముద్ద అయ్యి ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువును చూసి “మనీషా – రాక్షసుడా” అని భయపడ్డారు ఆదిల్షాయిలు. నిజానికి బాజీ ప్రభువు కి తగిలిన గాయాలు కత్తి పోట్లలో పావు వంతు తగిలినా ఒక మనిషి మరణిస్తాడు , కానీ అగ్ని పర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయువాల నుండి రక్తం ప్రవహిస్తున్నా…. అతని చేయి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది.

తనరాజు “ఛత్రపతి శివాజీ మహరాజ్” విశాల్ఘట్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్యే లేదని ఒక చేతితో మృత్యువుని ఆపుతూ….. మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశ్పాండే. చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభువు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తరువాత ఫిరంగి పేలుడు శబ్దాలు విన్నాయి.

“నా రాజుని కాపాడుకున్నాను అనే చిరునవ్వు పెదవుల పైకి వచ్చేలోపు – దేశ ప్రజలను రక్షించాను అనే గర్వం కళ్ళలోకి చేరే లోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది”.

కాళ్లు నేలకు ఒరిగాయి. కళ్ళు ఆకాశాన్ని చూస్తూ…. ప్రాణం శరీరాన్ని వదిలింది. చరిత్ర “కనీ వినీ” ఎరగని యుద్ధం చేసి, కేవలం 300 మందితో 8000 మందిని అడ్డుకొని మృత్యువునే వాయిదా వేసిన బాజీ ప్రభువు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళి అర్పించి “గోడ్కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్” అంటే పవిత్రమైమ ప్రదేశం అని ప్రకటించాడు. ఆ తరువాత బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ…..!!

ఈ రోజు ఈ దేశం లో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే కారణం ఇటువంటి మహా వీరులు మనకోసం తమ ప్రాణాలను అర్పించటమే ….

సేకరణ

No comments:

Post a Comment