*విరాట పర్వము – 11*
🏹
*అజ్ఞాతవాసం*
*బృహన్నల నిజరూపం*
అల్లంత దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను తేరిపార చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు.
“బృహన్నలా! భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసఖ్యాకమైన శస్త్రాస్త్రాలతో కౌరవసేన భయంకరంగా ఉన్నది. నేను వీరితో యుద్ధం చేయగలనా. నాకు విలు విద్యలో అంత ప్రావీణ్యత లేదు. బాలుడను, విలువిద్యలో నిష్ణాతులైన శకుని, జయద్రధ, దుర్ముఖ, వికర్ణ, కర్ణ మొదలైన వీరులతో నేనేమి యుద్ధం చేయగలను. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుందని తెలియక వచ్చాను. నీవేమో నీపాటికి రథం నడుపుతున్నావు. నేను కౌరవసేనతో యుద్ధం చేయలేను. రధమును వెనుకకు పోనిమ్ము. ఎవరి ప్రాణములు వారికితీపి కదా. నా శరీరం వణుకుతుంది ” అన్నాడు.
అర్జునుడు “ఉత్తరకుమారా ! అసంఖ్యాకంగా ఉన్న కౌరవసేనల వైపు రథం ఎందుకు నడిపిస్తాను. కొద్దిపాటి సైన్యాల రక్షణలో ఉన్న గోసమూహాల వైపు రధాన్ని నడిపిస్తాను. వారిని ఎదిరించి మన గోవులను మళ్ళిద్దాం. అంతఃపురంలోని కాంతలతో గోవులను మళ్ళించి తీసుకువస్తాను అని చెప్పావు కదా ఇప్పుడు ఇలా బెదిరిపోవడం తగునా ” అన్నాడు.
ఉత్తరుడు “అమ్మో! గోవుల మాటలు దేవుడెరుగు. అంతఃపుర కాంతల సంతోషం తో నాకేమి పని ” అన్నాడు.
అర్జునుడు “అదికాదు ఉత్తరకుమారా! నీ బలం,వారి బలం చూసుకుని కొంచంసేపు యుద్ధం చేసి మరలవచ్చు. కౌరవసేనలు నిన్ను ఇంకా చూడకనే మనం మరలిపోవడం యుక్తము కాదు వీరులిది మెచ్చరు ” అన్నాడు అర్జునుడు.
“బృహన్నలా ! సుశర్మ మన గోవులను తరలించుకు వెళ్ళాడు కనుక మా తండ్రిగారు సైన్యాలతో అతనిని ఎదిరించడానికి వెళ్ళారు. నాకు సాయంగా సైన్యం లేరు కౌరవ సైన్యామో అసంఖ్యాకం. దీనిని నేను ఒంటరిగా ఎలా ఎదిరించను చెప్పు. వాళ్ళు మనలిని చూడక మునుపే రథం మళ్ళించుట మంచిది వెనుదిరుగుము” అన్నాడు ఉత్తరుడు.
అర్జునుడు “అదికాదు రాకుమారా ! ఇలా ఆవులను వదిలి వెళితే నగరిలో అప్రతిష్ట కాదా. పిరికివాళ్ళను లోకం మెచ్చదు. నీకు సారధి లేడని సైరంధ్రి చెపితే నీకు నేను సారధిగా వచ్చాను. ఇప్పుడు ఆవులను శత్రువులకు వదిలి మరలలేను. నీకేం భయం వద్దు మనసు చిక్కపట్టుకో. కౌరవ సైన్యాలను ఏదో ఉపాయంతో ఓడించవచ్చు ” అన్నాడు.
ఉత్తరుడు “బృహన్నలా! నలుగురు నవ్వితే నాకేమి? నీకు ధైర్యం ఉంటే నువ్వే యుద్ధం చెయ్యి ” అంటూ ధనుర్భాణాలను రథం పై వదిలి వెను తిరిగి పరుగెత్తసాగాడు. బృహన్నల కూడా ఉత్తరకుమారుని వెంబడించాడు. ఇది చూసిన కౌరవ సేనలు నవ్వుకున్నాయి. బృహన్నల ఉత్తరుని పట్టుకున్నాడు. ఉత్తర కుమారుని నోరు, ఎండిపోతూ ఉంది, కాళ్ళూ చేతులు గడగడ లాడుతున్నాయి, మొహం వెలవెలపోయింది గొంతు పూడుకుపోయి పరిస్థితి దారుణంగా ఉంది.
ఉత్తర కుమారుడు “బృహన్నలా! నీకు అనేక బహుమతులు ఇస్తాను నన్ను వదిలిపెట్టు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది ఆమెను చూడాలి” అన్నాడు.
అర్జునుడు ఉత్తర కుమారుని చూసి అనునయంగా “ఉత్తర కుమారా! భయపడకు ము, నీవు యుద్ధం చెయ్యలేకపోతే నా రధానికి సారధిగా ఉండు. నేను కౌరవ సేనను జయించి గోవులను మరలిస్తాను” అంటూ అర్జునుడు ఉత్తర కుమారుని తీసుకుని రథం వైపు వచ్చాడు. తాను కూడా రథం ఎక్కి రధాన్ని తాము ఆయుధాలను దాచిన శ్మశానం వైపు మరలించాడు. ఇది చూసిన కౌరవసేనలు కలవరపడ్డాయి. వారికి కొన్ని అపశకునాలు గోచరించాయి. ద్రోణుడు ధైర్యంగా ఉండమని వారిని హెచ్చరించాడు.
ద్రోణుడు భీష్ముని చూసి “వీడు ఎవరో మహా గర్విష్టి వలె ఉన్నాడు. వీడు ఎవరో తెలుసుకోవాలి ” అన్నాడు.
భీష్ముడు దుర్యోధనునితో “సుయోధనా ! మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము. ఇంక మనం శత్రువలకు భయపడ వలసిన పని లేదు” అని సుయోధనునికి చెప్తున్నట్లు ద్రోణుడికి అన్యాపదేశంగా బదులిచ్చాడు. ఆ మాటలను బట్టి పాండవుల అజ్ఞాతవాసం ముగిసింది ఇక వారు బయటికి రావచ్చు అన్న విషయం గ్రహించిన ద్రోణుడు ఉత్సాహభరితుడై సుయోధనుని చూసి “సుయోధనా ! ఆకలితో నకనకలాడుతున్న సింహం గుహ నుండి బయటకు వస్తున్నట్లు అర్జునుడు అరణ్య వాసం, అజ్ఞాతవాసం ముగించుకుని మన మీద యుద్ధానికి వస్తున్నాడు. అతడితో యుద్ధం చేయతగిన వీరుడు మనలో ఎవరు ఉన్నారు. అర్జునుడు గోవులను తరలించుకు వెళ్ళటం తధ్యం” అన్నాడు.
ఆ మాటలను విన్న కర్ణుడు కోపంగా “పాండవ పక్షపాతంతో మాట్లాడుతున్నావు. కౌరవ సేన లలో నీవు ఒక్కడివే వీరుడివా. అర్జునుడు అంతటి జయించలేని వీరుడా. అతడితో నేను ఒక్కడినే యుద్ధం చేసి ఓడించగలను. పెద్దలని మన్నించి ఇంతకంటే మాటాడలేక పోతున్నాను ” అన్నాడు.
సుయోధనుడు కర్ణుని చూసి “కర్ణా! నీవు తప్పు పలికావు. అతడు నిజంగా అర్జునుడైతే మరల అరణ్య, అజ్ఞాతవాసాలు చేస్తాడు. కాకుంటే వాడిని నేనే జయిస్తాను” అన్నాడు. సుయోధనుని మాటలకు అంగీకరించినట్లు తలూపుతోనే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మనసులో నవ్వుకున్నారు.
బృహన్నల రధాన్ని జమ్మి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి “ఉత్తర కుమారా ! ఇవి మామూలు ధనస్సులు ఇవి నా ప్రతాపానికి సరిపోవు. నీవు ఈ చెట్టు ఎక్కి అక్కడ ఉన్న గాండీవాన్ని నాకు అందించు. పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ దాచారు” అంటూ శవాకారంలో ఉన్న ఆయుధాల మూటను చూపాడు.
ఉత్తరకు మారుడు “బృహన్నలా ! రాజ కుమారుడైనైన నన్ను శవాన్ని తాకమని చెప్పుట తగునా ” అన్నాడు.
అర్జునుడు “ఉత్తరకుమారా ! అది శవము కాదు. పాండవుల ఆయుధములు. వారు ఇతరులు చేపట్టకుండా వాటిని శవాకారంలో శ్మశానంలో ఈ జమ్మి చెట్టు పై దాచారు” అన్నాడు. బృహన్నల మాటలతో ఉపశాంతిని పొందిన ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆయుధాల మూటను విప్పాడు. అవి అతనికి సర్పాల వలె కనపడ్డాయి. అది చూసి ఉత్తరుడు భయపడ్డాడు. అర్జునుడు ప్రార్ధించగానే అవి ఉత్తరునుకి మరలా ఆయుధముల వలె కనిపించాయి.
ఉత్తరుడు వాటిలో ఉన్న గాండీవమును చూసి “బృహన్నలా ! ఈ ధనస్సు ఇలా భయంకరంగా ఉన్నదే, దీనిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు” అన్నాడు.
అర్జునుడు ఉత్తరునితో “ఉత్తరకుమారా ! అది గాండీవము, దానిని అర్జునుడు ధరిస్తాడు. దాని ప్రభావంతో అర్జునుడు దేవదానవులను జయించాడు. దీనిని బ్రహ్మ లక్ష సంవత్సరాలు ధరించాడు. తరువాత ప్రజాపతి అరవై నాలుగు వేల సంవత్సరాలు ధరించాడు. తరువాత ఇంద్రుడు ఎనభై ఐదేండ్లు ధరించాడు. తరువాత చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు ధరించాడు. తరువాత అగ్నిదేవుడు వరుణుడి నుండి దానిని తీసుకుని అర్జునునికి ఖాండవ వన దహనం సమయంలో ఇచ్చాడు. ఈ గాడీవాన్ని అర్జునుడు అరవై ఐదేళ్ళు ధరిస్తాడు” అని చెప్పి అలాగే మిగిలిన పాండవుల ఆయుధాల వివరాలు చెప్పాడు.
ఉత్తరకుమారుడు సందేహంగా “బృహన్నలా! పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ పెట్టి ఎక్కడకు వెళ్ళారో. వారు నా బంధువులు, మిత్రులు. అయ్యో ఆ ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో. వాయుపుత్రుడు ఎన్ని అవస్థలు పడుతున్నారో. అర్జునుడు ఎక్కడ దాగాడో. కవలలు ఎన్ని తిప్పలు పడుతున్నారో. మహా సాధ్వి ద్రౌపది ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో ” అంటూ ఆవేదనపడ్డాడు.
అర్జునుడు అనునయంగా ఉత్తరునితో
“ఉత్తర కుమారా! నీవు చింతించవలదు. పాండవులు అరణ్యవాసం పూర్తి అయిన తరువాత అజ్ఞాత వాసాన్ని మన నగరంలోనే గడుపుతున్నారు. కంకుభట్టు ధర్మరాజు, వలలుడే భీమసేనుడు, దామ్రగంధి, తంత్రీ పాలుడు నకుల సహదేవులు. మరి ఇక దాచడమేల అర్జునడను నేనే. మాలిని పేరొతో సైరంధ్రిగా ఉన్నది సాధ్వి ద్రౌపది. ఆమె కారణంగానే భీముడు కీచకుని, ఉపకీచకుల ను వధించాడు ” అని అన్నాడు.
ఆ మాటలు విన్న ఉత్తరకుమారుడు వెంటనే సంభ్రమాశ్చర్యాలతో సందేహంగా “బృహన్నలా! అర్జునునికి పది పేర్లున్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతాను” అన్నాడు.
బృహన్నల చిరునవ్వుతో ఉత్తరుని చూసి కుమారా! అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభస్తుడు, జిష్ణువు, విజయుడు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి ” అన్నాడు.
అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక
“బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను” అన్నాడు.
అర్జునుడు “కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించితిని కనుక ధనుంజయుడనయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడినయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రధమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రాకాసిస్తుంటుంది కనుక కిరీటినయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి భిభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, భీభత్సమైన పనులు చెయ్యను కనుక భీభత్సుడినయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను.
అయినా ఉత్తర కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వన దహనంలో అగ్నిదేవునికి సాయ పడినందుకు బ్రహ్మ,రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయం లో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భపడవలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం ” అన్నాడు.
🪷
*సశేషం*
No comments:
Post a Comment