Wednesday, July 3, 2024

 *శ్రీరమణీయభాగవత కథలు- 19 - (2)*
( బాపు-రమణ )

జరిగిన కథ:

కశ్యపమహర్షికి, తన భార్యలైన వినత, కద్రువల ద్వారా సంతానాభివృద్ధి చేయాలని పరమేష్టి ఆదేశం వచ్చిందని తన భార్యలకు చెబుతాడు.

ఇక చదవండి
******
కశ్య:
వినతాదేవి నీకు ఎటువంటి సంతానం కావాలి?

విన:
(కొరగా సావిడివైపు చూస్తూ) పూజ్యురాలైన మా సోదరి ఏం కోరుకుంది? 

కశ్య:
వేయిమంది (చేతులు రెండూ బారగా జాచి) పొడుగైన పిల్లలు.

విన:నాకిద్దరు చాలు.

కశ్య:  అంతే?

విన:
ఐతే వాళ్ల కన్న వేయి రెట్లు బలవంతులూ తేజోవంతులూ అయివుండాలి. ఎదురు లేకుండా ముల్లోకాలలో విహరించే వారు కావాలి.

కశ్య:
విహరించే వారంటే విహంగ సంతానం కావాలంటావు!

వినత తలవంచి నమస్కరించింది.

వినతా! ప్రాణేశ్వరీ! కేవలం నీ తలవంచితే చాలదు. తలవంచాల్సినది నీలోని మదమత్సరాలు.. అది ముఖ్యం. మంచిది. ఇష్టకామ్య సిద్దిరస్తు

*పరీక్షిత్తు యాగశాల*

శుక:
పరీక్షిన్మహారాజా! మానవ జాతి దౌర్భాగ్యం ఈ దౌర్బల్యమే! ఎదురుగా వచ్చే కొండంత శత్రువుని పిండి చేసి పారేస్తారు. గాని గుండెల్లో కూర్చుని కులికే 'లో' శత్రువులను మాత్రం చాలా గారాబంగా వుంచుతారు. పెంచుతారు.

ముందుగా కద్రువకు నాగులు పుట్టారు. అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఐరావతుడు. ఇలా వెయ్యిమంది ఉజ్వల కాంతులతో ప్రభవించారు. కద్రువ తన సంతానంతో ఆనందంగా గడుపుతోంది.

*కశ్యపుని ఆశ్రమం*

సర్పాలతో కద్రువ ఆడుకుంటోంది. కొందరు ఆమెపై పడగలు విప్పి నీడవిస్తున్నారు. కొందరు పాలు తాగుతున్నారు. కొందరు చెట్టు కొమ్మల పైనించి వేలాడుతూ పాలు తాగకుండా అల్లరి చేస్తున్నారు. 

హఠాత్తుగా పెద్దకళ్లు! తీక్షణంగా అసూయతో చూస్తున్నాయి. అదే వినత. ఒక పాద చాటునుండి చూస్తోంది. కళ్లలో నిప్పులు పోసుకుంటోంది.

శుకుడు:

తనకింకా పిల్లలు పుట్టలేదన్న బాధ కన్న సవతికి వేయి మంది పుట్టారన్న బాధ వినత గుండెలో మంటలు రగిల్చింది.

వినత పాదరింటినుండి ఆవేశంతో తన కుటీరంలోకి పరిగెట్టింది.

వినత రెండు అండాలను ప్రసవించింది. వాటిని నేయి పోసిన భాండాలలో వుంచారు.

వినత కసిగా ఒక భాండంలోనించి అండం తీసి నేలమీద వుంచి పిడికిలితో బలంగా పోట్లు పొడవసాగింది.

'అమ్మా' అంటూ బాధాకరమైన పెద్ద కేక వినవచ్చింది. ఆ గుడ్డు చితికి అందులోంచి పెద్ద మంట లేచింది. కుటీరం పై కప్పు చీల్చుకుని పైకి వెళ్లి తేజోఃపుంజంగా నిలచింది. వినత భయంతో చేతులు జోడించి పైకి చూసింది.

అనూరుడి స్పష్టాస్పష్టరూపం నడుంవరకే ఆకాశంలో కనిపించింది.

అమ్మా పుట్టి పుట్టని బిడ్డను చంపినంత పనిచేసిన కన్నతల్లీ! నీకు నా వందనం! నీదయవల్ల కాదు - నీ అసూయవల్ల కాళ్లు రూపం ధరించకుండానే సగం మొండెంతో బయట పడ్డాను కాళ్లులేక నడవలేని నాకు ఈ భూమెందుకు? పైగా నీ బిడ్డలు ముల్లోకాల్లోను విహరించాలని నా తండ్రి దగ్గర వరం పొందావు సూర్యుడి రథ సారథినై అపనే చేస్తాను. సెలవు కాని తల్లీ ఏ సవతి మీద అసూయతో నువ్వీ ఘోరకృత్యం చేశావో ఆ సవితికి దాసివై బానిసవై సేవ చేస్తావు.

విన:
నాయనా! అనూరా!

అనూ:
అనుకోకుండా మంచి పేరుతోనే పిలిచావు (నవ్వి) అనూరుడు ఊరువులు తొడలు లేనివాడు. 

విన:
నాయనా! నాకీ సవతి దాస్యం యావజ్జీవం ఉంటుందా! తప్పదా!

అనూ:
తప్పుతుంది. నువ్వు ఒప్పుగా నడచుకుని రెండవ అండంలో పెరుగుతున్ననా తమ్ముడిని ఇంకో 500 ఏళ్లు అందులోనే బతకనిస్తే అతడు సూర్య అగ్నిదేవుల కన్న తేజోవంతుడై భూలోక విష్ణువై - శ్రీమహావిష్ణువు వాహనమై మనందరికీ మంచి పేరు తెస్తాడు. ఆ తమ్ముడే నీ సంకెళ్లు తెంచి నిన్ను సుఖపెడతాడు. అమ్మా! అమాయను చంపుకో నీ సవతినే కాదు.
నీ శత్రువుని కూడా ప్రేమించు అదే ఆ శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పూజ!

అనూరుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

విన:

(పైకి చూసి చేతులు జోడించింది)

*సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం*

ప్రత్యక్ష నారాయణా! తల్లిని వుండి కూడా బిడ్డను నీకు పంపుతున్నాను. తల్లి తండ్రీ నీవే -
కాపాడు. ఈ అనూరుడు కూడా నీలాగే కశ్యప పుత్రుడు- నీ తమ్ముడు.

*సముద్ర తీరం*

ఒకనాడు సాయంకాలం వినతా కద్రువలు సముద్ర తీరాన విహరిస్తున్నారు. పాలకడలిలో పుట్టిన ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రం సముద్రం అంచున పరిగెడుతోంది. తెల్లగుర్రం తోక ఎగరేస్తూ కెరటాల మీద నురుగులా వయారంగా లేస్తూ దిగుతూ పరుగెడుతోంది. వినతా కద్రువలు చూశారు.

విన : సోదరీ! ఆ గుర్రం ఎంత వెలిగి పోతోంది! పాలకడలిలో పుట్టిన ఉచ్చైశ్రవం ఇదేనేమో!

కద్రు: (కోరగా చూస్తూ) అదైతే ఉప్పు సముద్రాని కెందుకొస్తుంది? పైగా దీని తోక నల్లగా వికారంగా వుంది. ఇదేదో సాధారణాశ్వం,

విన: అదేమిటక్కా! తోక తెల్ల జెండాలా ఎగురుతూంటే నలుపంటావు!

కద్రు : (తిక్కగా) అది నలుపే
విన:
కానేకాదు తెలుపు.
కద్రు:
ఎంత పందెం

విన:
చెప్పు. నువ్వే చెప్పు

కద్రు:

దాని తోక తెలుపైతే నేను జీవితాంతం నీకు దాసిగా పడుంటాను. నలుపైతే నువ్వు నాకు దాసిగా వుండాలి.

విన:
(కదలబోతూ) సరే పదచూదాం.

కద్రు:

గుర్రం దూరంగా పోతోంది. పొద్దువాలింది. రేపీ వేళ కొచ్చిచూదాం రా. మన స్వామి వచ్చే వేళయింది. సేవలందించాలి.
(ఇంకావుంది-3)
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

No comments:

Post a Comment