[7/20, 04:19] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 31🌹
👌ఆలోచించేది ఎవరో తెలుసుకోవడమే ధ్యానం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️
🌈 *31. ఆలోచించేది ఎవరో తెలుసుకోవడమే ధ్యానం*🌹
✳️ ధ్యానం అంటే ఆలోచించడం లేదా ఆలోచనలు ఆపడం కాదు. ఆలోచించేది ఏమిటో దానిని తెలుసుకొని అదిగా ఉండటం. మనం అనుకున్న దాన్ని మాత్రమే ఆలోచించగలగడం ధ్యానం అనుకున్నాం. ఆలోచించే వస్తువుపై అవగాహన లేకుండా ఏది చేసినా అది ధ్యానం కాదు. ఆలోచించే వస్తువు ఏదో, ఏమిటో తెలుసుకున్న తరువాత ఎంత ఆలోచించినా అది ధ్యానమే అవుతుంది. ఆ ధ్యానం సద్గుణ సంపత్తితోనే సాధ్యం. అందుకే బుద్ధ భగవానుడు గుణం తరువాత ధ్యానం అని బోధించారే తప్ప ముందే ధ్యానం అని చెప్పలేదు.
✳️ మనం కేవలం ఇష్టాయిష్టాల మధ్య జీవిస్తున్నాం. అంతే తప్ప ఆ ఇష్టాయిష్టాలకు మూలం ఏమిటని ఆలోచించడంలేదు. మన మనస్సు చూడడం, వినడం వంటి లక్షణాలతో విషయాలను గ్రహిస్తుంది. అలా గ్రహించినవి నచ్చటం, నచ్చకపోవటం, నచ్చినవి కావాలనుకోవడం, నచ్చనవి వద్దనుకోవడం జరుగుతుంది. ఇదేకదా మన జీవితమంతా. అంటే మన జీవితమంతా ఇష్టం చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆ ఇష్టానికి మన అభిరుచులే కారణం. మనలోని ఇష్టాలు ఆలోచనలుగా మారుతున్నాయి. వీటి అన్నింటికీ కారణమైన మనస్సును పరిపూర్ణంగా తెలుసుకుంటేనే సుడిగుండంలాంటి ఈ జీవనాన్ని సుందరంగా చేసుకోగలుగుతాం.
✳️ ప్రతీ మనిషి దుఃఖరహిత జీవితాన్ని కోరుకుంటున్నాడు. కావాలనుకున్నవి రాకపోవటాన్ని, వద్దనుకున్నవి ఆగకపోవటాన్ని మనం దుఃఖం అంటున్నాం. మనం ప్రస్తుతం మనస్సుని, శరీరాన్ని కలిపి కదా! నేను అనేది. ఆ 'నేను’ ఎవరో తెలుసుకోవాలి. అంటే మనస్సు, శరీరాల గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. వాటి మధ్య ఉన్న భేదాన్నీ, బంధాన్ని తెలుసుకోవాలి.
✳️ మన దేహ క్రియలన్నీంటికీ మనసే కారణం. మనస్సు తాను దేహంతో చేయదలుచుకున్న పనులన్నింటినీ తనలోతానే సూక్ష్మంగా భావిస్తుంది (చేస్తుంటుంది). దాన్నే మనం ఆలోచన అంటున్నాం. అంటే మన ప్రతి ఆలోచన ఈ దేహానికి సంబంధించిందే అయి ఉంటుంది. వర్తమాన క్రియలను చేయడానికి మాత్రమే మనసు ఆలోచనలు చేస్తే సరిపోతుంది. అలా కాకుండా జరిగిపోయిన వాటిని గురించి, జరుగబోయే వాటిని గురించి చేసే ఏ ఆలోచనలు క్రియాత్మకం కాదు. కనుక అవి నిష్ఫలం అవుతాయి.
✳️ మనం ఈ దేహంతో చేసే ప్రతిపనికి జ్ఞాపకం కావాలి. ఆ జ్ఞాపకం ఆలోచనగా మారితేనే మన బాహ్యక్రియలు చేయగలుగుతాం. మన జీవనానికి అత్యావశ్యకమైన ఆలోచనలను వదలటం సాధ్యం కాదు. ఎందుకంటే మనలోని చైతన్యానికి మన మనసు భిన్నంగా లేదు. అలానే మనసుకు ఆలోచన కూడా భిన్నంగా లేదు. మన ఆధ్యాత్మిక సాధన ద్వారా మనసును ఒకే విషయంపై లగ్నం చేయడమే మనం చేస్తున్న ప్రయత్నం. కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే కాక మనసు ఏకాగ్రత నిత్యజీవితంలో కూడా అవసరమే. కానీ చంచలత్వం వల్ల అది సాధ్యపడటంలేదు. ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులోనే పాఠాలను వరుసగా చదువుతూ వెళ్ళడం చంచలత్వం కాదు కానీ పది నిమిషాలకొక సబ్జెక్టును చదవాలని చూడటం చంచలత్వం అవుతుంది. మనకు అలాంటి చంచలత్వం పోవడానికే మనసుకు ఒక మంత్రాన్ని అప్పగించి ఏదో ఒక ఆసనంలో కూర్చోబెడుతున్నాం. శరీరాన్ని, మనసుని మనలోని సత్యం వైపునకు మళ్ళించడమే మనఉద్దేశ్యం. కేవలం ఒకే ఆలోచన, ఒకే క్రియ మాత్రమే ఆధ్యాత్మికత అయితే ఇక మనిషికి జీవనం ఉండదు. మన జీవన క్రియల్లో ప్రతిపని జ్ఞాపకంతో, ఆలోచనతోనే ముడివడి ఉంది. యోగికీ జ్ఞానికీ కూడా ఆకలి వేస్తుంది. కానీ ఆ ఆకలి తనది కాదని కేవలం దేహం యొక్క అవసరమని తెలుస్తుంది. శ్రీరాముడైనా, శ్రీరమణుడైనా అలా జీవించినవారే. మరి మనకీ, వారికి తేడా ఏమిటంటే వారు ఆలోచించే వస్తువు ఏదో తెలుసుకొని దానిగానే ఉండి జీవించారు. మనం అలాకాక ఆలోచనల్లో ఏవిషయాలైతే వస్తున్నాయో వాటిగా జీవిస్తున్నాం. మహానుభావులెవరూ తమ ఆలోచనలను ఆపుకునే ధ్యానప్రక్రియలు ఏవీ చేయలేదు. ముందు బాహ్యంగా మన జీవన విధానం పరిమితంగానూ, పరిశుద్ధంగానూ మార్చుకుంటే జ్ఞాపకాలు, ఆలోచనలు అవే తగ్గుతాయి. మనసులో ఎన్ని ఆలోచనలు కదలాడినా ఆ ఆలోచనలు కొనసాగించేది మనలోని సత్యవస్తువేనన్న ధ్యాసలో ఉంటే అది నిష్క్రియే అవుతుంది అదే సహజధ్యానం. ఆధ్యాత్మిక జీవితం అంటే మనలౌకిక జీవితాన్ని వదిలేసుకోవడం కాదు. మన ఆలోచనలు, అలవాట్లు, కోర్కెలు ఇష్టాయిష్టాలను అన్నింటినీ మితం చేసుకొని సత్యవస్తువుపై ధ్యాసతో ఆనందంగా గడపగలగాలి. అది ఆధ్యాత్మిక జీవనమే అవుతుంది. ఒకే ఆలోచనతో ఎవరూ రోజంతా ఉండలేరు. కనుక ఎప్పటికప్పుడు మనసులో అప్పటి ఆలోచనమాత్రమే ఉండేలా చూసుకుంటే అదే చిత్తశుద్ధి అవుతుంది. మనకున్న జ్ఞాపకాలను, మనం చేసే క్రియలను ప్రక్కన పెట్టి ఒకే ధ్యాసతో ఉండటాన్నే మనం పూజ అంటున్నాం. ఆలోచనలు ప్రక్కన పెట్టి ఒకే ఆలోచనతో ఉండటాన్ని ధ్యానం (జపం) అంటున్నాం. అనేక జ్ఞాపకాలు, ఆలోచనలు, క్రియలు, కలిపితేనే జీవితం అయింది. ఒకే జ్ఞాపకం, ఆలోచన, క్రియతో ఉంటే అది ధ్యానం అయింది. అదికూడా పోతే సమాధిస్థితి సిద్ధిస్తుంది.
[7/20, 04:19] +91 73963 92086: ✳️ ఆధ్యాత్మికత అంటే దేహాత్మభావనను (నేను దేహాన్ని అనే భావన), దేహ స్పృహను ( పంచేద్రియాల ఎరుకను) పోగొట్టుకోవడం కాదు. అవి పోవడం మాత్రమే ధ్యానం అయితే అది రోజూ నిద్రలో జరుగుతూనే ఉందికదా! నేను దేహానికి అతీతమైన సత్యవస్తువునని తెలుసుకోవాలి. అంతే కానీ నేనే దేహాన్ని కాదని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలనుకునే సత్యవస్తువు ప్రస్తుతం ఈ దేహంగానే కదా వ్యక్తం అవుతుంది. దేహస్పృహ, దేహబుద్ధిని రోజూ నిద్రలోకూడా నువ్వు కోల్పోతూనే ఉన్నావు. ఆస్థితిలో కూడా నువ్వు ఉన్నావు. అప్పుడు ఎలా ఉన్నావో తెలుసుకోవడమే మన సత్యరూపాన్ని తెలుసుకోవడం. నిద్రలో కేవలం ఉనికిగా ఉన్న సత్యవస్తువే కదా జీవితంకోసం దేహంగా, మనసుగా మారింది. వాటిని మనం ఎందుకు తక్కువగా భావించి విస్మరించాలని అనుకుంటున్నాం. అవి ఎలానూ శాశ్వతం కాదు. కనుకనే ప్రతి రోజూ నిద్రలో మనోదేహాలు ఉన్నా లేనట్లే. మెళకువలో కూడా మనో దేహాలను మన శాంతికి భంగం కలగని రీతిలో ఉంచుకుంటే అది నిరంతర ధ్యానం అవుతుంది. నేను దేహంకాదు, నేను ఆత్మని అనటంలో రెండింటి లోనూ భావన చేస్తున్న 'నేను' ఎవరో ఆలోచించమని శ్రీ రమణ భగవాన్ చెప్తున్నారు.
✳️ శాంతి అయినా, ముక్తి అయినా ఉన్న వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడమేతప్ప అవి కొత్తగా వచ్చేవి కావు. కోర్కెలేని జీవితం ముక్తి. బాధించని జ్ఞాపకాలతో ఉన్న మనసే శాంతి. మనని శాంతినుండి దూరంచేసేది భేదభావమే. ఆత్మ స్వరూపులమైన మనం దేహంగా భావించడమే తొలి బేధభావన. కాగా జీవన విధానంలో అసమానతలను చూసి అది మరింత ఎక్కువ అవుతుంది. భగవంతుని సృష్టిలోని పంచభూతాలు అందరికీ సమానంగా అందుతున్నాయి. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశాలు ఎటువంటి వివక్షతలేకుండా ప్రాణి కోటికి లభిస్తున్నాయి. మనిషి సృష్టించుకున్న ఏ వస్తువు వనరులు, సౌకర్యాలు అందరికీ సమంగా అందటంలేదు. అదే నేటి మానవు అసమానతకు, అశాంతికి కారణంగా మారింది. భగవంతుడు మనతో పాటు సృష్టించిన ఇతర ప్రాణులను కూడా స్వార్థం కోసం సంహరించే కర్కశత్వం మనిషి శాంతికి మరో అవరోధంగా ఉంది. దైవం ప్రకృతి పరంగా చేసిన వేసవి కాలపు మామిడి మనకు ఏకీడు చేయడంలేదు. కానీ మనిషి వాటిని అన్ని కాలాల్లో పండించాలని అనుకోవడంచేత అవి విషతుల్యం అవుతున్నాయి. అకాలంగా పండించిన ఆహారమే అకాల మృత్యువుగా పరిణమిస్తుంది. ప్రకృతిని మన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించడం వల్ల అది మన జీవన్మరణాలను తన చేతిలోకి తీసుకుంటుంది. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాల్లో 99 శాతం మనం సృష్టించుకున్నవే.
✳️ కర్మ రీత్యా వచ్చే పెద్ద వ్యాధులు మినహా విధిలో వచ్చే కష్టాలు ఏవీలేవు. మనకి లేనివాటిని, రానివాటిని కావాలని కోరుకోవడమే కష్టాలకు మూలం. దైవం విషయంలో నైనాసరే అతికోర్కె పనికిరాదు. అందుకే అప్పుచేసి యాత్రకూడా చేయకూడదని పెద్దలమాట భార్యాపిల్లల్ని పోషించడం, సౌకర్యవంతమైన జీవితాన్ని వారికి ఇవ్వడం మాత్రమే మనబాధ్యత. ప్రక్కవాడిని చూసి అనుకరించడం సరికాదు. కాళ్లకు పట్టీలు పెట్టుకోవాలనిపించవచ్చు కానీ బంగారు పట్టీలు కోరడమే అశాంతికి కారణం. అసమానత లేనిదే ఈ సృష్టిలేదు. నీ కన్నా తక్కువ సుఖం పొందేవాడు, నీ కన్నా ఎక్కువ సుఖం పొందేవాడు ఎప్పుడూ ఉంటారు. అసమానతలో ఉన్న సమానత్వాన్ని గుర్తిస్తే శాంతి వస్తుంది. కానీ మనం సమానత్వంలో కూడా అసమానతను వెతుకుతున్నాం. కరెన్సీ నోట్లను సృష్టించింది మనమే. దొంగనోట్లని సృష్టించింది మనమే. కోర్టులు, చట్టాలు కూడా మనవే. శిక్షలుకూడా మనవే. వీటిలో భగవంతుని ప్రమేయం ఏముంటుంది. నీకు జీవితాన్ని, కర్మలను అందించడం మినహా నీ కష్టసుఖాల్లో భగవంతుని జోక్యంలేదు. జీవితాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకుంటే ఏవి అవసరాలో, ఏవి కోర్కెలో మనకి తెలుస్తాయి. అప్పుడే మనం కోరుకునే ఆధ్యాత్మిక జీవితం సాఫీగా సాగుతుంది.
✳️ మనసుకు ఉన్న జంజాటాలు వదిలించుకోకుండా జపం చేస్తే మాత్రం శాంతి వస్తుందా? కేవలం పుణ్యం మాత్రం వస్తుంది. సంఘర్షణలను తగ్గించి జీవన విధానంలో మార్పుతెచ్చుకోవడం మన ముందున్న సాధన. ఆలోచనలు వద్దనుకోవడం కాదు అన్ని ఆలోచనల్లో కూడా నువ్వు చలించని వస్తువుగా ఉండటం సాధన. ఆలోచనలు ఆపే ప్రయత్నం కూడా ఒక ఆలోచనే కదా! అలా కాక వచ్చే ఆలోచనలను సాక్షిగా గమనించుకోగలిగితే వాటిని తగ్గించుకోగలుగుతాం. ప్రతి పనికీ ఆలోచన అవసరం ఆ పనిని శ్రద్ధగా చేయనివ్వని ఆలోచనలే ధ్యానానికి ఆటంకం. నిత్య జీవితంలోనే మన ఆలోచనల ఉధృతి తగ్గాలి. అప్పుడే ధ్యాన సమయంలో మనసు సహకరిస్తుంది. రోజంతా వెంపర్లాడే మనసు అరగంట ధ్యాన ప్రయత్నంలో ఎలా నిలుస్తుంది. కేవలం అరగంట కూర్చుని చేసేది ధ్యానం కాదు. జీవితమంతా ధ్యానంగా సాగాలంటే మన ప్రతి పనిలోనూ శ్రద్ధ ఉండాలి. మన మనసు ఏ అనుభూతిని పొందినా లోపల చైతన్యం మాత్రం మార్పులేని వస్తువుగానే ఉంది. మనసు వికారాలతో ఊగినా, తురీయానుభూతిని పొందినా సత్యరూపమైన చైతన్యంలో మార్పులేదు. ఆలోచనలను ఆపటంకన్నా మనసుని గమనించడం, లేదా ఒకేఆలోచనతో ఉండటం సాధన చేస్తే ప్రతి ఆలోచన ధ్యానంతో సమానం అవుతుంది. ఆలోచించే వస్తువు తెలిశాక అదే చైతన్యమనీ... మనోదేహాలు ఎన్నిమార్పులు చెందినా అది మారటం లేదని తెలుస్తుంది.
No comments:
Post a Comment