Monday, July 22, 2024

****శ్రీ రమణీయం - 32🌹 👌పని స్ఫురించని మనసే ధ్యానము👌

 [7/21, 16:36] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 32🌹
👌పని స్ఫురించని మనసే ధ్యానము👌
 ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

🌈 32. పని స్పురించని మనసే ధ్యానం. 🌹

✳️ సృష్టిలోని ఏ ప్రాణికైనా కేవలం ప్రాపంచిక విషయాలను అనుభవించే శక్తి మాత్రమే ఉంది. కానీ మనిషికి మాత్రమే శరీరానికి సంబంధించిన భౌతిక విషయాలతోపాటు సృష్టికి ఆధారమైన ప్రాణాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మన ముందు రెండు దారులున్నాయి. ఒకటి కేవలం శరీర అవసరాలు తీర్చుకుంటూ భౌతిక జీవనం సాగించడం. రెండవది ఈ జీవితానికి మూలమైన ప్రాణాన్ని కూడా తెలుసుకుని శాంతిగా జీవించడం. దాన్నే మనం ఆధ్యాత్మిక సాధన అంటున్నాం. 

✳️  మనిషి దైవస్వరూపుడైతే ఈ దు:ఖాలు ఎందుకు?* అని ఓ భక్తుడు ప్రశ్నించారు.

✳️ మన నిజస్వరూపమైన దివ్యత్వానికి ఏ దు:ఖంలేదని, ఈ తాపాలన్ని ప్రకృతివేనని శ్రీరమణ భగవాన్ సెలవిచ్చారు. ప్రకృతి అంటే ఏర్పడినది అని అర్థం. ఈ దుఃఖాలన్నీ ఏర్పడిన దేహానివేనని వారి భావం. మనతోపాటు జీవించే పశుపక్ష్యాది వృక్షాలకు భౌతిక జీవనం తెలుసుగానీ దివ్యజీవనం తెలియదు. మనకు కనిపించే దేహం ఉన్నట్లే మనలో కనిపించని ప్రాణం ఉంది. ఈ రెండింటికి మధ్య మనసు ఉంది. నిజానికి ప్రాణానికి మరో రూపమే మనసు. ఆ మనసుకు స్వస్వరూపంలో ఉండటం కన్నా మరొక శాంతిలేదు. ఇప్పుడు మన మనసు దేహంతో కలిసి తానుకూడా దేహం అనుకుంటుంది. దేహ అవసరాలు తీరుస్తూ ఉంది. మన మనసు చేసే ప్రతి ఆలోచన దేహం కోసమే. క్రియాత్మకం కాని ఆలోచన ఏదీ మనకు తెలియదు. మనం చేసే క్రియాత్మక ఆలోచనలన్నీ దేహానికి సంబంధించినవే. మనసు కంటూ ఉన్న అవసరం ఒక్కటే. అదే శాంతి.

✳️ *మనం దైవాన్ని ఎందుకు స్మరించాలి?* మనం దైవాన్ని మినహా ఏది తలుచు కున్నా దానికి ఒక అర్థం, దాని తాలూకు ఒక క్రియ(పని) ఉంటాయి. ఏ పనితో సంబంధంలేని ఆలోచనే దైవనామం. అభిషేకం నిమిత్తం లేదు. దేనిని గురించి ఆలోచిస్తే దాన్ని సూచించే ఒక పని ఉంది. కానీ *రామ* అన్న నామం ఏ పనినీ సూచించదు కదా! మనని నిష్క్రియాత్మకం చేసేది ఒక్క దైవనామం మాత్రమే. స్థూలసూక్ష్మాలను అంటే దేహాన్ని, ప్రాణాన్ని విడదీయలేము. కానీ విడివిడిగా వాటిని అవగాహన చేసుకోవచ్చు. మనం చేసే ప్రతి ఆలోచనకి ఆలోచనకి మధ్య కొంత విరామంఉంది. అది మనం గుర్తించలేనంత సూక్ష్మంగా ఉంది. మనసు వేగం, ఉధృతి వల్ల ఆ సూక్ష్మ విరామంలో ఉన్న ధ్యానాన్ని గుర్తించలేక పోతున్నాం. దైవనామస్మరణలో మనసు ఉధృతి తగ్గి నిదానం అవుతుంది. అప్పుడు మనసు ఆ విరామాన్ని గుర్తించి ధ్యానస్థితిలో ఉంటుంది. మన ప్రతి ఆలోచన ఏదో ఒక రూపంతో ముడిపడి ఉంటుంది. కానీ ఈ విరామంలో ఏ రూపం ఉండదు. రూపభావన లేని ఆలోచనే ధ్యానం. రూపధ్యానంతో మొదలయ్యే నామజపం కూడా చివరికి రూపరహిత ధ్యానస్థితికే చేరుతుంది.

✳️ మనం మంచి పనులు చేస్తూ ఉంటే మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలు ఉంటేనే దాన్ని మంచి మనసు అని అంటాం. మనం చేసే వృత్తులను బట్టే మానసిక ప్రవృత్తులు ఏర్పడుతాయి. మనసుని వెతకడం అంటే ఏ ప్రవృత్తీ లేని మనసు స్వరూపాన్ని తెలుసుకోవడమే. అంటే ప్రవృత్తికి మూలాన్ని పట్టుకోవాలి. మనకి చెడు ఆలోచనలు వస్తున్నాయని బాధపడతాం. కానీ ఆ ఆలోచనలకు మూలమైనది మన గత వృత్తులేనని మర్చిపోతాం. మనం వైరాగ్యాన్ని మూటకట్టుకొని వెంట తెచ్చుకొని ఉంటే శ్రీరమణ భగవాన్‌లా ఉండేవారం. కానీ మనం అనేక బలహీనతలను వెంటతెచ్చుకున్నాం. అదుపు చేసుకోలేనంత బలమైనకోర్కెలే మనకు బలహీనతలుగా ఉన్నాయి. మన జీవన విధానమే ఆ బలహీనతలను ఏర్పరిచింది. మితమైన కోర్కెలతో కూడిన మంచి జీవనం ద్వారానే వాటిని అధిగమించాలి. పూజలో కూర్చున్నప్పుడు మనకి ఇతర ఆలోచనలు వస్తున్నాయని చిరాకు పడతాం. మనం ఏర్పరుచుకున్న జ్ఞాపకాలే కదా మనకు ఆలోచనలుగా వస్తాయి. ఒక విషయం జ్ఞాపకంగా మారేంతగా మమైకత చెందకుండానే జాగ్రత్తపడాలి. అంతేకానీ ఆ జ్ఞాపకాలు ఆలోచనగా వచ్చినప్పుడు బాధ పడితే ప్రయోజనం ఏమిటి? విత్తనాలు నాటేటప్పుడే తాలు గింజల్ని ఏరివేస్తే మొలిచేవన్నీ మంచి మొక్కలే అవుతాయి. అందుకే మన బాహ్యవృత్తుల్ని నియంత్రించుకుంటే తప్ప ప్రవృత్తులను నియంత్రించలేము. లేదంటే ఆలోచనలను అదుపులో ఉంచుకోవటం కష్టం అవుతుంది.

✳️ మనం ఆలోచనలను పరిశుద్ధం చేసుకోవాలి కానీ అసలు ఆలోచనలే రాకుండా చేస్తానంటే అది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే మన జీవనం అంతా ఆలోచనలతోనే ముడిపడి ఉంది. మనకి మల్లెపూల వాసన వచ్చిందంటే అప్పటికే అక్కడి గాలి మల్లెపూలతో మమేకత చెందిందని అర్థం. అంటే, గాలే మల్లె వాసనగా మారింది. ఆ గాలిని, వాసననూ ఎలా విడదీస్తాం? కాకపోతే ఆ మల్లె వాసన గాలియొక్క  సహజగుణం కాదని తెలుసుకోగలుగుతాం. అలానే శరీరంలో మమేకత చెంది దేహ అవసరాలన్నీ తానుగా వ్యక్తం చేసే మనసుని దేహం నుండి వేరు చేయలేము. మనసు దేహంగా మారింది. కనుకనే ఆకలి వేస్తుందన్న విషయం గుర్తించగలుగుతుంది. జ్ఞాని అయినా తన ఆకలిని మనసుతో గ్రహించాల్సిందే. కాకపోతే ఆ అవసరం మనసుది (తనది) కాదనీ, దేహానికి చెందినదనీ తెలుసుకొని జీవిస్తాడు. అంతేతప్ప మనసుని, ఆలోచనలను కాదని జీవించలేడు. భగవంతుని సృష్టిలోనే దేహంతో పాటు ఆలోచన కూడా ఒక భాగంగా ఉంది.
[7/21, 16:37] +91 73963 92086: దాన్ని వదిలించుకుందామని అనుకుంటే ఇక జీవనం ఉండదు. ప్రజ్ఞగా ఉన్న మనసు ఆలోచించకుండా ఎలా ఉంటుంది. మనం జన్మించినదే కర్మ పూర్తిచేసుకోవటం కోసం. అది ఆలోచన లేకుండా సాధ్యంకాదు.

✳️ జ్ఞానులు కోర్కెలేని స్థితిలో ఉంటారు. కనుక నిశ్చలంగా ఉండగలుగుతారు. మనం కూడా వారిలాగా నిశ్చలంగా ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు అవరోధంగా ఉన్న మన కోర్కెలను మాత్రం వదులుకోము. మనం ఆ స్థితిని పొందేవరకూ మన నిత్య కర్మలను శ్రద్ధగా నిర్వర్తించడమే మన కర్తవ్యం. కృష్ణభగవానుడు కూడా మన ముందున్న కర్మనే 'యోగం' లా శ్రద్ధగా చేయమని చెప్పారు. కర్తవ్యాన్ని మరిచి ధ్యానం చేస్తూ కూర్చోమని ఎవరూ చెప్పలేదు. మన జీవితం ఎలా ఉండాలో మనమే నిర్దేశించుకొని పుట్టాం. అందుకే 'పెట్టి పుట్టారనే' నానుడి వచ్చింది. మనం ఈ దేహంతో ఎంత తినాలో కూడా ముందే లెక్క రాసి ఉంటుంది. కనుకనే చనిపోతే "నూకలు చెల్లినట్లే" అనే మాటను వాడతారు. మనం ఏకర్మ చేయాలో ముందే నిర్దేశించే ఉంది. అదే మన ముందుకు వస్తుంది. దానిని శ్రద్ధగా నిర్వర్తిస్తూ (చేస్తూ) వెళ్తే చాలు. ఏ పనికోసం వచ్చామో ఆపని పూర్తి చేయాల్సిందే. అందుకు మనసు, ఆలోచన కావాల్సిందే. మన కర్మలో లేనిదే కల కూడా రాదు. అందుకే మనం ముఖ్యమంత్రి అయినట్లు ఎవరికీ కలలోనైనా రాదు. మనం అనుకున్నదే జరిగేటట్లయితే అందరం కోరుకున్న రీతిలో దర్జాగా ఉండేవారం. మన ఊహలతో, భావాలతో మన కర్మలకు మరి వాటి గురించి వెంపర్లాడాల్సిన పనికూడా లేదు.

✳️ మనం యోగిలా జీవించాలో, భోగిలా జీవించాలో గత కర్మలే నిర్దేశిస్తాయి. వర్తమానంలో మనముందుకు వచ్చే ఏ కర్మ అయినా గతంపైనే ఆధారపడి ఉంది. దాన్ని మార్చుకోలేం. కర్తృత్వం లేకుండా ఆ కర్మలను చేయటం ద్వారా భవిష్యత్ జీవితాన్ని మార్చుకోవచ్చు. అంతః ప్రయాణానికి ఒక ప్రత్యేక లక్ష్యం అక్కర్లేదు. ఎందుకంటే ఏ సాధనా మార్గంలో వెళ్ళినా చేరేది ఆ గమ్యానికే. కాని బాహ్య జీవితానికి లక్ష్యం చాలా అవసరం. బాహ్య జీవన వృత్తులే మానసిక ప్రవృత్తులకు కారణం. నేరుగా మనసుని నియంత్రించలేం. కనుక ఆలోచనలకు కారణమైన మన బాహ్యవృత్తులనే అదుపు చేసుకోవాలి. 

✳️ మనం ఎలాంటి ఆలోచనలు చేసినా మనసు పరమాత్మగానే ఉంది. ఈ దేహంలో ఏ పనులు చేసినా ప్రాణంగా ఉన్న పరమాత్మే చేయిస్తాడన్న సత్యం స్మరణలో ఉండాలి. మనసు నిశ్చలంగా లేకపోవడం అనాదిగా ఉన్నదే. దైనందిన జీవితం దైవ ధ్యానానికి దూరం కాదని భగవాన్ అంటున్నారు. రోజంతా విచ్చలవిడిగా జీవించి ఓ గంట కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం తెలియదు. జీవన విధానాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే జీవితం అంతా ధ్యానమే అవుతుంది. అదే మన పూర్వీకులు సూచించిన ధార్మిక జీవనం.

✳️ మనం తన కడుపులో ఉన్నప్పుడూ, మనం తన ఒడిలో ఉన్నప్పుడు అమ్మ మనపై ఒకే ప్రేమను చూపుతుంది. అందుకే మనం అశుద్ధంతో ఉన్నా అమ్మ మనని అసహ్యించుకోకుండా సపర్యలు చేస్తుంది. జ్ఞానికూడా ఈ లోకానికి అలానే సేవలు చేస్తాడు. ఆయనకు ఈ సృష్టిలో ఏదీ తనకు ఇతరమైనదిగా కనిపించదు. అన్నాన్ని, అశుద్ధాన్ని ఒకేలా చూడగలిగే శక్తి వారిది. అదివచ్చే వరకు ఎవరైనా సరే పూజలు, జప, తపాలు విస్మరించడం కర్మ భ్రష్టత్వమే అవుతుంది. మంచికైనా, చెడుకైనా ఇవే మనోదేహాలు ఉపయోగించాలి. అన్నంతిన్నా, అకృత్యాలు చేసినా ఈ చేతులు చేయాల్సిందే. అలాగే మంచి, చెడు ఆలోచనలు ఏవైనా ఈ మనసు చేయాల్సిందే. ఆ శుద్ధమనసే మన ప్రాణ స్వరూపం. మనసు దేహంతో కలిసి ఉండటం లౌకికం. మనసు మనలోని ప్రాణంతో కలిసి ఉండటం సమాధి. తాను దర్శించిన ఆత్మభావనతో లౌకిక జీవితాన్ని గడపడం సహజ సమాధి. బాహ్యంలో నామమాత్రంగా జీవిస్తూ అంతరంలో నిరంతరం నామజపంతో సాగటమే మన ముందున్న సాధన.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ: 
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment