Wednesday, July 3, 2024

 “జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ముండకోపనిషత్తు* - 4వ భాగము.
ఋషులు వేదమంత్రాలలో ఏయే యజ్ఞకర్మలను దర్శించారో అవి అన్నీ కూడా సత్యమే. మూడు వేదాలు వీటిని చాలా వివరంగా వర్ణిస్తాయి. సత్యప్రియులారా! వాటిని మీరు విధిగా నిరంతరం అనుష్ఠించండి. పుణ్యకర్మల ఫలితాలైన లోకాలకు మార్గం అదే.
హోమాగ్ని చక్కగా మండుతూ జ్వాలలు లేస్తూ ఉన్నపుడు అగ్నికి రెండుభాగాల మధ్య శ్రద్ధతో ఆహుతులు సమర్పించాలి. జీవుడు ఆచరించే కర్మలకు అగ్నికి అవినాభావ సంబంధము వుందని ఈ ఉపనిషత్తు చెబుతుంది.
అగ్నిహోత్ర యజ్ఞం ఏడు రకాలుగా చెప్పబడ్డాయి. అమావాస్య మరియు పున్నమినాడు చేసే చిన్న యాగాలు, చాతుర్మాస్యంలో అవలంభించే విధులు, పంట వచ్చిన సమయంలో చేయాల్సిన కర్మలు, యజ్ఞసమయంలో ఆహుతులు, యజ్ఞసమయంలో అతిధి సత్కారం, విశ్వేదేవతలకు సమర్పించే ఆహుతులు, పశుపక్ష్యాదులకు ఆహారదానము మొదలైనవి. విధులు లేకుండా శాస్త్రానికి విరుద్ధమైన యజ్ఞం చేస్తే యజ్ఞకర్త యొక్క ఉత్తరగతులను నాశనం చేస్తుంది. ఉత్తమలోకాలు పొందకుండా చేస్తుంది.
యజమాని శాస్త్రవిధిగా యజ్ఞం ఆచరిస్తే అతనికి ఇంద్రలోక ప్రవేశం సిద్ధిస్తుంది. అంటే యజ్ఞయాగాల ఫలితం స్వర్గలోకప్రాప్తి అని చెప్పబడింది. అంటే వీటివలన యజ్ఞకర్తకి ఉత్తమగతులు లభిస్తాయి గాని మోక్షము సిద్దించదు. మోక్షానికి జ్ఞానమే ప్రధానమని గ్రహించాలి.
కర్మలు చిల్లుపడిన పడవ లాంటివి. జ్ఞానంతో పోలిస్తే కర్మలు ఎంతో తక్కువుగా పరిగణింపబడతాయి. కర్మలనే శ్రేయస్సు అనుకోని చాలామంది భ్రమపడతారు. ఈ కర్మమార్గాన్నే అవిద్య అని అంటారు. ఈ మార్గమందే ప్రవర్తించువారు సుఖదుఃఖాలను, జననమరణాలను పొందుతూనే వుంటారు.
రాగముతో యజమానులు ఆచరించే ఇష్టాపూర్తములు(ఇష్టా అంటే యజ్ఞము, పూర్తములు అంటే దానధర్మములు) వలన కొంతకాలము ఉత్తమగతులను పొంది, మిగతా కర్మఫలితం అనుసరించి భూలోకంలో గాని అంతకన్నా తక్కువ లోకాలలో గాని తిరిగి జన్మిస్తుంటారు.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
ఇక జ్ఞానుల విషయం వచ్చే భాగంలో పరిశీలిద్దాము... 🙏🏻

No comments:

Post a Comment