Thursday, July 18, 2024

 కాఫీ కబుర్లు సంఖ్య 652 (జూలై 15 - 2024) --  త్రీ చీర్స్ టు చీపురు.. ---- ఇంటి ఇల్లాలు ఉదయం నిద్ర లేవగానే చేసే ముఖ్యమైన పనుల్లో చీపురు తో గదులు ఊడవటం ఒకటి.  చీపురు అంటే చెత్త తుడిచే వస్తువు గనుక మనం నిర్లక్ష్యం చేస్తాం.. పట్టించుకోం.‌. ఎలా పడితే అలా పడేస్తుంటాం.  ఇది చాలా తప్పు.  మనం ఏ పనిచేసినా దైవచింతన, ఆధ్యాత్మిక దృష్టితో చేయాలని శాస్త్ర నిపుణులు అంటారు.  చాలామందికి తెలియని విషయం..  చీపురుకి సంబంధించి మన శాస్త్రాలలో చాలా విషయాలు ఉన్నాయని.  లక్ష్మీదేవికి ప్రతీకగా భావించదగ్గ చీపురు శనీశ్వరుని ఆయుధం.  గనుక చీపురు విషయంలో కొన్ని నియమాలు పాటించాలి మనకి మంచి జరిగి దరిద్రం పోవాలంటే.  చీపురు ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపే ఉంచాలి.  చాలామంది హేండిల్ కింద తుడిచే కుచ్చు భాగం మీద ఉండేలా నిలబెట్టి ఉంచుతారు.  ఇది చాలా తప్పు.  కుచ్చు భాగం కింద హాండిల్ పైన ఉండేలా నిలబెట్టి ఉంచాలి.  పశ్చిమ రాష్ట్రాలలో చాలా మంది ఈశాన్యం వైపు గోడకి హుక్ ఏర్పాటు చేసి కుచ్చు కింద ఉండేలా చీపురును హేంగ్ చేసి ఉంచుతారు.  ఇది చాలా మంచి పద్ధతి.  కొంతమంది తుడవడం అయ్యాక పాదాలకి ఏమైనా అంటుకుంటే చీపురు కుచ్చు మీద పాదాల్ని పెట్టి శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తారు.  ఇలా చేయకూడదు.  ఎప్పుడూ కూడా చీపురు మీద కాలు పెట్టకూడదు.. కారణం చీపురు లక్ష్మీదేవి ప్రతీకగా భావించాలని ముందే చెప్పుకున్నాం.  చీపురు కనపడే చోటు కాకుండా కనబడకుండా ఉండేలా ఈశాన్యం వైపు ఓ మూల ఉంచాలి.  మనం బయటకెళుతు న్నప్పడు చీపురు ఎదురుగా కనపడకూడదు.. కారణం శనీశ్వరుని ఆయుధం గనుక.  పండుగ రోజుల్లో కొత్త చీపురు కొనడం తేవడం వంటివి చేయకూడదు.  అలాగే పర్వదినాల్లో పాత చీపురు పారేయకూడదు.  పిల్లలు అల్లరి పెడితే , చెప్పిన మాట వినకపోతే చీపురు కట్ట తిరగేస్తా  అనే మాట వాడకూడదు.  మన ఇంట్లో, పరిసరాల్లో చెత్తని తుడిచి శుభ్రం చేసే సాధనం చీపురు కదా అని చీప్ గా చూడకుండా గౌరవించాలి.  కొండ చీపురు, కొబ్బరి చీపురు, పుల్లల చీపురు ఇలా పలురకాల చీపుళ్ళు దొరుకుతాయి.  మా విజయనగరం సమీపంలో చీపురుపల్లి పేరుతో ఓ ఊరుంది.  మన ఇంటినీ పరిసరాల్ని శుభ్రపరిచే చీపురు కూడా మనకి విలువైనదే.  చీపురు అంటే తేలిక భావం అందరికీ ఉంటుంది.  ఇది కరెక్ట్ కాదు.  మురికి చెత్తలను శుభ్రపరిచే ఆరోగ్య ప్రదాయిని చీపురు అని మనం గుర్తిద్దాం గౌరవిద్దాం.  ఈనాటి మన కాఫీ కబుర్లుకి యీ అంశం సూచించి మంచి సమాచారాన్ని అందించిన శ్రీమతి అనంతలక్ష్మి (హైదరాబాద్) గారికి కృతజ్ఞతలు..  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment