[7/23, 04:35] +91 73963 92086: *"నాది" అనేది ఏదీ "నేను" కాదు*
27-8-2021 * శ్రావణ శుక్రవారం
ఈ ఉదయం 5.45 కు సద్గురు సన్నిధికెళ్లాం...
వంటగదిలో పట్టెయ్య అల్లంటీ పెడుతున్నాడు...
నేనూ కాస్త సహాయంగా ఉండి...అందరికీ టీ కప్పులు అందించాను...
* * *
తీటగల భాగ్యశాలికి
నీటుగలుగు గోళ్ళు - వేడినీళ్ళు లభింపన్
తాటించి బఱుకసాగిన
తీటయె దేవేంద్ర పదవి తిరముగ జగతిన్!
దురద ఉన్నవాడు, ఎవరున్నా సరే జంకకుండా
గోళ్ళతో గీకి రక్తం వస్తున్నా సరే వదలకుండా
బరుకుతాడు.
దురద ఉన్న చోట వేడినీళ్లు పోస్తే
అదొక సుఖంగా ఉంటుంది.
అందుకే ఓ కవి ఈ దురదను దేవేంద్ర పదవి అంతటిదిగా
హాస్యపూరితంగా చమత్కరించాడు.
* * *
నిన్న గురువుగారికి వీపు దురద పుడితే
పట్టెయ్యగారు గోకారట...
ఈ సందర్భంలో గురువుగారు పై పద్యం చెప్పి నవ్వించారట...
గురువుగారికి కాళ్లు నొప్పులు పుడితే
సంతోష్ భార్య మసాజ్ చేశారట...
గురువుగారు అన్నారట-
గురువుకు కలిగిన దురదలే, నొప్పులే
శిష్యులకు సేవచేయడానికి అవకాశమైంది...అని.
అంతేగా...అంతేగా...
శివా...!
నేను పసువునైతేనే కదా
నీవు పసుపతి అయ్యేది...
నాకు ఆపద కలిగితే కదా
నీకు ఆపద్బాంధవుడనే పేరొచ్చేది...
నాకు దయనీయమైన పరిస్థితి వస్తేనే కదా
నీకు దయామయుడు అని బిరుదొచ్చేది...
* * *
అన్నీ సుఖాలే ఉంటే నాటకం రక్తి కట్టదు.
సుఖదుఃఖాలు రెండు కలగోపుగా ఉంటేనే
ఈ జగన్నాటకం రసవత్తరంగా ఉండేది.
భగవంతుడు సుఖాల్ని అందరికీ ఇస్తాడు...
కష్టాల్ని మాత్రం భరించగలిగే శక్తి ఉన్నవానికే ఇస్తాడు.
సుఖాల్ని అనుభవించేవాని కంటే
కష్టాల్ని అనుభవించేవాడే
భగవంతుని బాధ్యతల్ని యెక్కువ మోస్తున్నట్టు లెక్క.
ఇంటి బాధ్యతను ఇంటి యజమాని తీసుకొని భరించినట్టు.
అమృతానికి అందరూ ఎగబడ్డారు.
హాలాహలాన్ని శివుడొక్కడే భరించాడు.
కష్టాలను దిగమ్రింగి జీవించేవాడు
శివస్వరూపుడు.
భగవంతునికి ఏకైక ఆత్మీయుడు - దుఃఖితుడు.
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు...
పరలోకరాజ్యం వారిదే...అంటారు క్రీస్తు.
* * *
బ్రహ్మానందం, విషయానందం అని రెండు లేవు.
విషయానందంగా ఉండేది కూడా బ్రహ్మానందమే.
ఏనుగు తినే ఆహారం, చీమ తినే ఆహారం వేఱువేఱుగా కనబడ్డా
"తృప్తి" ఒక్కటే.
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
అంటారు అన్నమయ్య.
తల్పం మీద రాజు పడుకోవచ్చు
తన చేయినే తలగడగా బంటు పడుకోవచ్చు
ఆదమరచి నిద్రించే "నిద్ర" ఒక్కటే.
* * *
బ్రహ్మానందం అనేది విషయానందానికి వేఱే అని,
ఆ బ్రహ్మానందాన్ని పొందటానికి గురుసేవ, సాధనలు చేయాలని కపటగురువులు తమ పబ్బం గడుపుకోవడానికి చేసే ప్రబోధాలవి...
ఈ కపట వ్యవస్థను "గురుదుకాణం" అన్నారు UG.
అదొక అంగడి అన్నమాట...
ఆధ్యాత్మిక వ్యవస్థ అంతా
పైకి తాజాగా చూపించి, పాత సరుకు అమ్ముకునే వ్యాపారసంస్థ.
ఆ పాతమాటల్నే, ఆ ఎంగిలి మాటల్నే
ఈ గురువులందరూ గొప్పగా బోధిస్తారు...
ప్రవచనకర్తలందరూ అబ్బా అనిపిస్తారు...
వాటి వల్ల -
మరో బుద్ధుడు రాలేదు.
మరో కృష్ణుడు రాలేదు.
మరో శంకరుడు రాలేదు.
మరో రమణుడు రాలేదు.
తీగలో పూవు పుట్టినట్టు పుడతాడు జ్ఞాని.
ప్రబోధాలతో, ప్రయత్నాలతో జ్ఞానిని తయారు చేయలేం.
* * *
గురుభక్తుడు సంతోష్ అన్నాడు -
మీరేమో ఆత్మస్థితిలో ఉండి మాట్లాడుతున్నారు...
మేమేమో దేహస్థితిలో ఉండి వింటున్నాము...
మన మధ్య దూరం చాలా ఉంది... అని.
గురువుగారు చిరునవ్వుతో -
నేను ఏ స్థితిలోనూ లేను.
అన్ని స్థితులూ "నాలో" ఉన్నాయి.
* * *
కలకు, కలకనేవాడికి మధ్య యెంతదూరం ఉంది?
అంతే దూరం నీకూ నాకు మధ్య ఉండే దూరం కూడా...అని అన్నారు.
* * *
ఒకరు అడిగారు -
రహస్యం అంటారు కదా!
రహస్యం అంటే ఏమిటి స్వామీ...? అని.
"రహస్యం ఏమీ లేదు...
రహస్యం ఏమీ లేకపోవడమే రహస్యం."
అని బహు చమత్కారంగా సెలవిచ్చారు సత్యాన్ని గురువుగారు.
చిదంబరంలో తెర వెనుక ఉండే రహస్యం అదే.
తెర తీస్తే ఏమీ ఉండదు.
ఆ "ఏమీలేనితనాన్ని"(అంబరాన్ని) గుర్తించే తానే
చిదంబరేశ్వరుడు.
"ఏమీలేదు" అని ఉండడమే పరమార్థం.
"ఏదో ఉంది" అనుకోవడమే అవివేకం.
* * *
మాకు తెలిసిన ఓ బౌద్ధభిక్షువు అన్నాడు -
కరోనా వైరస్ ద్వారా చనిపోయినవారు
మహా పుణ్యం చేసుకున్న వారు...
ఉన్నత లోకంలో ఉంటారు....అని.
"అసలు బ్రతికున్నవాడే లేడు అంటుంటే
ఇంక చనిపోయినవాడు ఎక్కడ ఉంటాడు?
అన్నారు గురువుగారు.
వీడు అసలు పుట్టనేలేదంటారా...!
ఆశ్చర్యపోతూ అడిగాడు పట్టెయ్య.
యెందుకంటే తత్త్వం మరీ కూసు అయిపోయి,
తానే లేకుండా ఐపోతానేమోనని తోస్తోంది పట్టెయ్యకు.
ఆ "అంతిమదశ"కు చేరుకునేశామని పట్టెయ్యకు అవగతం అవుతోంది...
గురువుగారు ఇలా కొనసాగించారు-
"నేను ఉన్నాను" అన్న తరువాతే పట్టెయ్య ఉన్నాడు.
"నేను ఉన్నాను" అన్న తరువాత సుబ్రహ్మణ్యం ఉన్నాడు.
"నేను ఉన్నాను" అని అనకపోతే...
పట్టెయ్యా లేడు....
సుబ్రహ్మణ్యమూ లేడు...
* * *
గురువుగారు ఇలా ముగింపు పలికారు -
"దానికి ఇంత వేదాంతం కూడా తెలియవలసిన అవసరం లేదు...
కొండ గుర్తు ఏమంటే-
"నాది" అని చెప్పబడే ఏదీ "నేను" కాదు.
అని తెలిస్తే సరిపోతుంది.
అన్నారు.
[7/23, 04:36] +91 73963 92086: దాన్నే అజాతమంటారా? అని కొన ఊపిరితో ఉన్న ప్రాణిలా గొణిగాడు పట్టెయ్య ...
"అదికూడా కాదు..." అంటూ తులసితీర్థం లాంటి మాట అన్నారు గురువుగారు.
నిశ్శబ్దం....
ఆ తర్వాత మౌనం...
"తెలిసింది" అనడానికి అక్కడ పట్టెయ్య ఉంటేగా...?
అక్కడ గురు-శిష్యులు లేని "ఖాళీ" మిగిలింది.
అదే నిర్వాణం...
అదే పరమపదం..!!
No comments:
Post a Comment