Monday, July 22, 2024

***ధన్య జీవితం

 🔱 అంతర్యామి 🔱

# ధన్య జీవితం #

🍁భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు
జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం
అనివార్యం. బతికినంత కాలం ధీరోదాత్తంగా బతకాలని అనాయాస మరణాన్ని కోరుకోవాలని ద్రోణ స్తుతి చెబుతోంది. కష్టాలు లేని జీవితం ప్రశాంతమైన ముగింపు... దైవం పట్ల భక్తితో నిండిన జీవన యానం కోసం సాధన చేయాలని ఆ స్తుతి తెలియజేస్తోంది. అచంచలమైన భక్తితో దైవప్రార్ధన చేస్తూ శారీరక ఇబ్బందులు లేకుండా కన్నుమూయాలని మనిషి ఆశించాలి. 

🍁మలి సంధ్యలో మనిషి ముగింపు ఎవరికీ భారం కాకూడదు. మంచానపడి చికిత్సలు సేవలు చేయించుకుంటూ ఇతరులను శరీరపరంగా ఆర్థికంగా బాధలకు గురిచేయడం వల్ల ఆత్మీయుల మనసులో ఈసడింపు నెలకొని ప్రేమ, దయ కోల్పోయే ప్రమాదం ఉంటుం మనిషికి అలాంటి ముగింపు బాధాకరం. అందుకే అనాయాసేన మరణం అంటోంది. ద్రోణ స్తుతి. 

🍁దుర్ఘటన, ప్రమాదాలకు గురై జీవితం అంతం కాకూడదు. కర్తవ్యనిష్ఠలో మరణం సంభవిస్తే అదే పుణ్యం. అందుకే శ్రీకృష్ణపరమాత్మ యుద్ధం చేయి... ఓడిపోయావా స్వర్గలోక ప్రాప్తి.... గెలిచావా రాజ్యభోగాలు లభిస్తాయని పార్థుడికి బోధించాడు. కర్తవ్యనిష్ఠలో మనిషి అంతం సైతం ఆనందదాయకమే. మనిషి అభ్యున్నతి కోసం సదా పరితపిస్తూ అందుకోసమే జీవితాన్ని అంకితం చేస్తూ గడిపిన ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మరణాన్ని సైతం ఆస్వాదించాడు. అంతంలో తన సన్నిహితుడితో మాట్లాడుతూ మరణం ఇంత ఆనందకరమా అన్నాడట. కారణ జన్ముల ముగింపు కూడా అనాయాసమే. పేదరికం మనిషికి సంభవించేదే అయినా నేనున్నానంటుంది. అందలం నుంచి కిందికి వస్తే అది బాధాకరం.

🍁దీనంగా దైన్యంగా జీవించకూడదంటారు జిడ్డు కృష్ణమూర్తి 'ఎట్ ది ఫీట్ అఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో. ఎవరినో ఆశించి ఎవరిముందో చేతులు చాపి పరాన్నజీవిగా జీవించకూడదు అంటారాయన.

🍁 కష్టేఫలే అన్నది జీవితాశయం కావాలి. 
🍁అప్పుడు భాగ్యవంతుడికి పేదవాడికీ తేడా ఉండదు. లక్షాధికారైనా లవణమన్నమె కదా! అందుకే. పేదరికాన్ని అనుభవిస్తున్నా దైన్యంగా బతుకును ఈడ్చకూడదు (వినా దైన్యేన జీవితం) అంటోంది ద్రోణ స్తుతి. పేదలు శ్రమించి ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఆ యత్నం ఫలిస్తే వారికీ సంపదలు వచ్చి చేరతాయి. పేదరికం నుంచి శ్రీమంతుడిగా న్యాయబద్ధంగా ఎదిగితే ఆ ఆనందానికి అవధులుండవు. ఇలాంటి స్థితిలో మనిషికి తనమీద తనకు ఎనలేని నమ్మకం కలుగుతుంది. పేదల బాధలు తెలిసినవాడ కనుక కారుణ్యవంతుడిగా ఉంటాడు. ఇదే ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కానీ శ్రీమంతుడు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తే పేదరికంనేనున్నానంటుంది. అందలం నుంచి కిందికి వస్తే అది బాధాకరం.

🍁నిజానికి శ్రీమంతులే అదృష్టవంతులని అనుకోరాదు. పేదరికంలో జీవిస్తూ కూడా ఇతరులను ఆశించకుండా ఉన్నదాంట్లో తృప్తికరంగా బతకడం గౌరవం... 

🍁అదృష్టం ఇలాంటివారు సంపద్వంతులకన్నా గొప్పవారు. పేదవాడవైతేనేం వివేకవంతుడై జీవిస్తే చాలు అన్నాడు గౌతమ బుద్ధుడు. 'దైవమా నా ప్రాథమిక అవసరాలకు కొరతలేని జీవితం (నేను జీవించి ఉన్నంతవరకు ఎవరినీ ప్రాథేయపడాల్సిన అవసరం లేని జీవితాన్ని) ప్రసాదించమని వేడుకోవాలి. 
🍁ఇచ్చేవాడున్నాడు కదా అని ఎక్కువ ఏదీ అడగరాదు. మనిషి, ఆర్ధిక స్థితిని గమనించి దైవం దీవించడు.  వివేకవంతుడికే భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. అనివార్యమైన మరణాన్ని గురించి ఆలోచించడం వృథా.

🍁 మరణాన్ని జయించాలనే ప్రయత్నించి అందరూ ఓడిపోయారు. 
🍁కారే రాజులు రాజ్యముల్ గల్గరే... వారేరీ అంటూ భాగవతంలో బలిచక్రవర్తి శుక్రాచార్యుణ్ని తెలుపమంటాడు. 
🍁దైన్యంగా జీవించకుండా బాధ లేని ముగింపును కోరేవాడే ధన్యుడు. 
🍁 *అతడే గొప్పవాడు...*  *పుణ్యాత్ముడు🕉️🚩🕉️

No comments:

Post a Comment