Saturday, July 13, 2024

 *_భర్త ఆఖరి ఉత్తరం_*...

*_(వృద్ధాప్యం దరి చేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ...)_*

*పది రోజుల నుండి బంధువుల,పిల్లల తోటి కర్మకాండలతో  హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది*.

*ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకరరావు మాస్టారు సడన్ గా కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరి అయిపోయింది.*

 *పిల్లలందరూ శంకరరావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.ఇక మిగిలింది పార్వతమ్మ మనసులా మారిన ఆ ఇంటిలో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది. పిలిస్తే  పలికే నాధుడే లేడు.ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి  చూస్తూ ఉండిపోయింది.*

*కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికి లేదు.వెళ్లి వస్తాo... "ఆరోగ్యం జాగ్రత్త,"*
 *"సమయానికి మందులు వేసుకో",*
*"ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్" .....అంటూ పిల్లలు మాట వరసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. మొట్ట మొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది.*
*కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి.*

*ఇంతలో..... పోస్ట్ అని కేక వినబడింది.*
*ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. దానిమీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త శంకరరావు గారిదే. చనిపోయిన వ్యక్తి ఎలాఉత్తరం రాశారనుకొంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది.*

*" ప్రియమైన పార్వతికి...*
*నువ్వు ఆశ్చర్య పడతావని నాకు తెలుసు. నేను బతికున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో ఏపీ భవన్ లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యం కిచ్చి....నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను.* 

*నా మనసులోని మాట  నేను  బతికిన్నన్నాళ్ళు చెప్పలేకపోయా.ఎవరికి చావు ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది.భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బతకడం చాలా కష్టం.ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు.*

*ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి.ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్లినా ఈ ఆధునిక కాలంలో కొడుకు, కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ల కుటుంబ వ్యవహారాల బాధ్యతలను నీ నెత్తి మీద రుద్దబడుతాయి.వయసు మీరిన నీకు వంట వార్పు  చేయడం చాలా కష్టం.తప్పని పరిస్థితిల్లో తెలియకుండానే కుటుంబ బరువులు మరింత పెరుగుతాయి.*

*ఒంటరిగా ఉంటే.... ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది. మంచి వాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు. ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ల మీద నమ్మకం లేదు.కాలం అలా ఉంది మరి.ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూసాను*

*రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలైపోయింది.నా ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీద ఉంది.వీలునామా కాగితం దేవుడు గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను. ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్ లో ఉంచాను. ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు ఏపీ భవన్ సుబ్రహ్మణ్యం కు ఫోన్ చెయ్. వాడికి చాలా వివరాలు అన్నీ చెప్పాను.*

*ఆర్థిక స్వాతంత్రం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువుగా చూడదు. పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా...ఏదైనా పరిస్థితులు బాగా లేనప్పుడు నువ్వు ఎవ్వరిని అడగక్కర్లేదు.బ్యాంకు బాలన్స్ అంతా జాయింట్ అకౌంట్ లోనే ఉంది .* *ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసే పెట్టే నా శిష్యుడు రామరావు బ్యాంకు మేనేజర్ గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు. వాడు సహాయం చేస్తాడు*.

*ఏ పిల్లల ఇంటికెళ్ళిన నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు. సున్నితమైన నీ మనసు బాధపడు తుంది.నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో శేష జీవితాన్ని చక్కగా గడుపు. దేవుడిచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు.*

*వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఇన్నాళ్ళు నీతోటి  చాకిరీ చేయించుకుని  నిన్ను దిక్కులేని దానిగా, జీతం లేని పనిమనిషి లాగా చేయడం జరిగే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను.*

*మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము. మంచి మంచి చదువులు చెప్పించాం. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లిళ్ల తర్వాత వాళ్లకున్న బాధ్యతల వల్లో, మరే కారణము తెలియదు కానీ వాళ్లకు ఉన్న ప్రాధాన్య అంశాల్లో మనం లేము.నేనది గుర్తించాను.*
*మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్నా కోడలు ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్ళతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేదు.కూతురు పరిస్థితి సరే సరే.*
*ఇవన్నీ నేను గమనించాను.ఎంతోమంది తల్లిదండ్రులు అనాధ శరణాలయాల్లో దిక్కుమొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు.*
*తమ సొంత కొడుకులు కూతుర్ల ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లాగా జీవిస్తున్నారు.*

*కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి.కానీ అధైర్య పడకూడదు. ఒకరు ముందు ఒకరు వెనక. ఓపిక ఉన్నన్నాళ్ళు ధైర్యంగా, ఇష్టమైన పనులు చేస్తూ బతుకు.ఇన్నాళ్లు ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే...పడే బాధ్యతలు నిన్ను ఊక్కిరిబిక్కిరి చేస్తాయని తెలుసు.దీనికి భయపడకు.అన్నీ సర్దుకుంటాయి.*

*మన చేతల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని.జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. కష్టమైనా, సుఖమైనా నింపాదిగా ఎదుర్కో.బాధ్యతలన్నీ ఒంటిచేతి మీద నెట్టుకుంటూ వచ్చి  బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని  ముందుకు తో సుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయం. నేను బతికున్న రోజుల్లో  ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునే వాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత*.

*ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను.*

*- ఇట్లు... ప్రేమతో నీ భర్త శంకర రావు "*

*ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ....*
*కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ....* *ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకు హృదయపూర్వకంగా నమస్కరిస్తోంది శంకర్రావు భార్యపార్వతమ్మ....*

*పదవీ విరమణ చేసిన,చేయబోతున్న ఉద్యోగులకు అంకితం....*

No comments:

Post a Comment