🔱 అంతర్యామి 🔱
# కష్టం సుఖం #
🍁తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. సాంఘిక జీవనంలో పరుల కష్టాల గురించి కూడా కొంత పట్టించుకోవాలి అందరూ ఒకరికోసం ఒకరు ఎంతో కొంత కష్టపడుతూ ఆరోగ్యంగా ఉండటం అందరికీ సుఖప్రదమే. పరులను సైతం వారి చిక్కులలో నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం అందరికీ ఆనందకరం అవుతుంది. పలువురి బాగుకై పడే శ్రమ సఫలమయ్యేందుకు భగవంతుడి అండదండలు కూడా ఉంటాయి.
🍁ఏ కష్టం లేనప్పుడు తమో గుణ ప్రాధాన్యమైన ఉన్నతికి ప్రతిబంధకాలైన, నిద్ర, బద్ధకం, అజాగ్రత్త వంటివి ఆవహిస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక కార్యంలో నిమగ్నమైతే అనేక రోగాలకు మూలమైన భయాందోళనలు, అనుమానాలు చోటు చేసుకోలేవు. అనుమానం పెను భూతం అంటారు పెద్దలు. ఏదో రోగముందనే భయం, అనుమానం శరీరంలో మార్పులకు మూలమై వృథా వ్యయ, ప్రయాసలకు దారి తీస్తుంది. ఖాళీగా కూర్చోకుండా వయసుకు, సామర్థ్యానికి తగిన సమస్యలను ఎంచుకుని సాధించడం అందరికి మంచిదే.
🍁ఏ సమస్యా లేదనిపిస్తే ఏదో ఒక చిక్కుముడిని ఎన్నుకొని విప్పడంతో, మెదడుకు పదును పెట్టి ఉత్తేజపరచుకోవచ్చు. ఏదైనా క్రీడల్లో గెలవాలని పట్టుదలతో పడే కష్టం వల్ల కండరాల పటిష్టత కలిగి శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైన కష్టం లేకుండా జీవించాలి అనుకునేవారిని సమాజం హర్షించదు. రోజంతా కదలకుండా కూర్చుని. ఏది తిన్నా జీర్ణం చేసి శక్తినిచ్చే వ్యవస్థ పాడవుతుంది. మేలుకుని ఉన్నంతసేపు చురుకుగా ఏదో ఒక కార్యంలో నిమగ్నమయ్యేవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. శారీరకంగా శ్రమించేవారికి అదే వ్యాయామంగా ఉపకరిస్తుంది. ఆ రోజు ఏదో సాధించామన్న తృప్తి కూడా కలుగుతుంది.
🍁చిన్నతనంలో పేదరికంతో జీవించినవారికి
రకరకాల సమస్యలు వాటి పరిష్కారాల గురించి అవగాహన కలుగుతుంది. అలా పెరిగినవారు పరుల శారీరక, మానసిక కష్టాలను సైతం అర్థం చేసుకోగలరు. తమ శక్తికి తగ్గట్టు సహకరించగలరు. 1970 దశాబ్ద ద్వితీయోన్నత పాఠశాల విద్యార్థులకు పేదరికం ధనికుల జీవితం కన్నా మేలైనది' అని సరోజినీనాయుడి ఆంగ్ల పాఠం ఒకటి ఉండేది. ముఖ్యంగా చిన్న వయసులోనే పేదరికం, కష్టం, సుఖం గురించి అవగాహన కలగడం, వారి భావి జీవితం ఉన్నతమైన
స్థితికి చేరడానికి మంచి పునాది అవుతుంది.
🍁ఎవరైనా ఎప్పుడైనా కావాలని పేదరికాన్ని కోరుకోరు. అయినా తమ సంతానానికి చిన్నప్పుడే పేదరికం ఎలా ఉంటుందనే జ్ఞానాన్ని కలిగించడం వారి శ్రేయస్సు కోరే పెద్దల కర్తవ్యం. పెంపకంలో అడిగినదల్లా ఇవ్వడం వల్ల వారికే నష్టం చేసినట్లు అవుతుంది. జీవితంలో కావాలి అనుకున్నది ఏది కాకపోయినా, కోరినది ఏది దొరకకపోయినా ఆత్మన్యూనతకు లోనై తమ జీవితాలకే తామే నష్టం చేసుకోవచ్చు. అది ఆ కుటుంబంలో అందరికీ నష్టదాయకం అవుతుంది.
🍁ఏ కష్టం పడకుండా సుఖంగా జీవించాలని ఆశించడం ధర్మం కాదు. బాల్యాన్ని పేదరికంలో గడిపి నిరాడంబరంగా బతికి ఉన్నత స్థితికి చేరిన ఆదర్శనీయుల్లో మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఒకరు. ఏ కుటుంబమైనా, సమాజమైనా, దేశమైనా కష్టపడి పైకి వచ్చినవారి ఉనికితో, నాయకత్వంతో సాగినప్పుడు లోకంలో ఉన్నతమైనదిగా గౌరవం పొందుతుంది.🙏
✍️దువ్వూరి రామకృష్ణ వరప్రసాదు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment