రామాయణానుభవం....366
శ్రీరాముడు రావణుని వైపు చూస్తుండగానే చిటికెలో సుగ్రీవుడు మాయమయ్యాడు.
శ్రీరామునికి అయోమయం కలిగింది.
ఇంతలో సుగ్రీవ రావణ ద్వంద్వ యుద్ధము, గాయాలతో, నెత్తురు ధారలతో సుగ్రీవుడు తిరిగి రావడం జరిగి పోయాయి.
శ్రీరాముని మనస్సు "సుగ్రీవునికి ఏమవుతుందో ఏమో అనే బాధతో నిండి పోయింది."
అందువలన సుగ్రీవుడు తిరిగి రాగానే వానర వీరులందరు ఆయనను ప్రశంసిస్తే శ్రీరాముడు మాత్రము ఆయనను మందలించాడు.
"మిత్రమా! ఎంత పని జరిగింది! ఎంత పని జరిగింది! ఎంత సాహసం చేశావు?
నీవు వెళ్లేప్పుడు నాకు చెప్పి వెళ్లాలనిపించలేదా? ఒంటరిగా నీకు నీవు ఇంత సాహసం
చేయడం తగునా?
రాజు ఎప్పుడు స్వతంత్రించి సమరంలో ముందు దిగకూడదు. ఆయన పరివారాన్ని ముందు దింపి, సమయాన్ని చూచి తాను సమరంలో కాలు పెట్టాలి.
అందువలన ఒక రాజువై ఉండి నీవు ఈ విధంగా సాహసించడం మంచి పద్దతికాదు
అంతేకాదు మేమందరము ఎవ్వరి బలాన్ని చూసుకొని ఇంతదాకా వచ్చాము ? నీ బలాన్ని చూసుకొనే కదా? ఆ విధంగా అందరికి రక్షణనిచ్చే నీవే అరక్షణలో పడితే
"త్వయకించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ?"
నీకేదైనా అయితే నేను
జీవింపజాలను. అప్పుడు సీత మాత్రము నాకెందుకు? అంతే కాదు నన్ను ఆశ్రయించిన వాడివి. నీకేదైన ప్రమాదం కలిగితే నా ఆశ్రిత రక్షా దీక్ష" ఏమయిపోతుంది? "తనను ఆశ్రయించిన సుగ్రీవుడి కొరకు వాలిని వధించి, ఆయన రాజ్యాన్ని,
భార్యను ఆయనకు రాముడు ఇప్పించాడు.
కాని తన ఆశ్రితులు ఆపదల పాలు కానీయకుండా రక్షించవలసిన తానే సుగ్రీవునికి కలిగే ప్రమాదాన్ని కూడా చూడకుండా ఆయనను రావణుని పైకి దాడి చేయడానికి రాముడు అనుమతించాడు." అని నాగురించి ఎంత నీచంగా జనం చెప్పుకుంటారు ?
అంతే కాదు నీవు నాకు ముఖ్య మిత్రుడివి. నీతో సమానం నాకెవ్వరు కాదు. సుగ్రీవా! నీకేదైనా ప్రమాదము జరిగితే దానికి కారణమైన రావణాసురుని సపరివారంగా చంపి, విభీషణునికి నేనిచ్చిన మాట ప్రకారం లంకా పట్టాభిషేకము చేసి, అయోధ్యకు వెళ్లి భరతునినే శాశ్వతంగా పాలించుమని నిర్బంధించి, నాప్రాణాలను విడువాలనుకొన్నాను" అని రాముడు వివరించాడు.....
..........సశేషం.......
చక్కెర.తులసీ కృష్ణ
No comments:
Post a Comment