బ్రహ్మపదార్థం అంటారు కదా? అంటే ఏమిటి?
పదస్య అర్థః పదార్థః - ఒక పదము చేత ఏ వస్తువు నిర్దేశించబడుతుందో అది ఆ పదార్థము.
కుండ అనగానే వృత్తాకారంలో ఒక మూతితో ఉండే ఒక వస్తువు మనకు తెలుస్తుంది. ఆ వస్తువు కుండ పదార్థము.
అలాగే బ్రహ్మ పదార్థము అంటే బ్రహ్మ అనే శబ్దముచేత నిర్దేశింపబడేటువంటి తత్త్వము ఏది కలదో అది బ్రహ్మపదార్థము. కాబట్టి బ్రహ్మ శబ్దముయొక్క అర్థము తెలుసుకుంటే తత్పదార్థము కూడా తెలుస్తుంది.
బ్రహ్మ శబ్దము బృహ్ ధాతువు నుండి ఏర్పడినది. బృహ్ ధాతువుకు వృద్ధి చెందుట, పెరుగుట అని అర్థం. మన చుట్టూ చూస్తే ఉండే ఏ వస్తువు , వ్యక్తి , జీవి అయినా దేశ పరిచ్ఛిన్నంగా (limited in space) ఉందా లేదా? చిన్న దోమ, పిట్ట, పులి, ఏనుగు, మనిషి, కుక్క, పరిచ్ఛినంగానే ఉన్నాయి. ఇటుక, రాయి, పెద్ద బండరాయి, కొండ, హిమవత్పర్వతము, నదులు పరిచ్ఛిన్నముగానే ఉన్నవి. సముద్రం, భూమి, గ్రహం, నక్షత్రం అన్నీ కూడా దేశ పరిచ్ఛిన్నములే.
దేశ పరిచ్ఛిన్నము కానిదంటూ ఒకటుంటే అదెలా ఉండి ఉండాలి? మొత్తము దేశమునంతటినీ వ్యాపించి ఉండాలి, ఎందుకంటే దేశమునంతటినీ వ్యాపించి లేనిది దేశ పరిచ్ఛిన్నమే అవుతుంది కనుక. అంటే, అది పృథివి-జలము-వాయు-తేజస్సు-ఆకాశాములన్నిటినీ వ్యాపించినదై ఉండాలి. అలా ఏదైతే ఉందో అది బ్రహ్మ.
ఆ బ్రహ్మ ఎక్కడుంది? అసలా ప్రశ్నే తప్పు. ఎక్కడెక్కడ ఆకాశము (space) కలదో అక్కడ ఆ ఆకాశమునంతటినీ వ్యాపించి బ్రహ్మయే కలదు. అంతటా ఆ పరబ్రహ్మయే వ్యాపించి ఉన్నది. మరి మనకు చెట్టు-పుట్ట, కుక్క-నక్క, మనిషి-పశువు, కొండ-కోన, శత్రువు-మిత్రుడు, ఆడ-మగ, అన్నీ ఇలా కనిపిస్తున్నాయే? బ్రహ్మ ఎందుకు కనిపించట్లేదు? చూడటం చేత కాదు కనుక. అంతటా నిండి బ్రహ్మయే ఉంటే, మరి నేనో? అంతటా బ్రహ్మయే ఉంటే, నేను కూడా బ్రహ్మయే. అందుకే బ్రహ్మను తెలియుట, పొందుట అంటే నన్ను నేను తెలియుటయే. కాబట్టి బ్రహ్మ పదార్థమంటే మీ అసలు సిసలు స్వరూపము.
సాధారణంగా "నేను" అనడిగితే ఈ దేహేంద్రియ మనస్సంఘాతాన్ని చూపిస్తాం, అలానే అనుకుంటాం కూడా. ఈ దేహమే నేనని అనుకుంటే అది అసలైన నేను కాదు. వెనక్కి వెళ్ళు - చేతులు, కాళ్ళు, వాగింద్రియము, పాయు-ఉపస్థములు అనబడే కర్మేంద్రియములు, ఇంకా వెనక్కి వెళితే ఉన్న కన్ను, చెవి, నాలుక, చర్మము, ముక్కు అనబడే జ్ఞానేంద్రియములు, ఇవేవీ అసలైన నేను కాదు. ఇంకా వెనక్కి వెళితే ఉండే ఆలోచనలు, భావావేశాలు (emotions) ఇవేవీ కూడా అసలైన నేను కాదు. ఇంకాస్త వెనక్కి వెళితే కల బుద్ధిలో పాండిత్యము, ఫిజిక్స్, వ్యాకరణం, తర్కం ఇత్యాదులు ఉంటాయి, ఇవేవీ అసలైన నేను కాదు. ఇంకా వెనకన ఈ దేహమే నేను, ఈ పని లేదా కర్మ చేస్తున్నవాడిని నేను, దాని ఫలాన్ని కోరేవాడిని నేను, పుట్టాను నేను, పోతాను నేను అని ఇన్ని రకాలుగా అనుకునే ఈ నేనుకి అహంకారము అని పేరు. అది కూడా అసలైన నేను కాదు.
మరి అసలైన నేను ఏది?
ఏదైతే దేహము కాదో, దేహానికి సాక్షియో, ఏది కర్మేంద్రియములు కాదో, కర్మేంద్రియములకు సాక్షియో, ఏది జ్ఞానేంద్రియములు కాదో, జ్ఞానేంద్రియములకు సాక్షియో, ఏది మనస్సు కాదో, మనస్సుకు సాక్షియో, ఏది బుద్ధికాదో, బుద్ధికి సాక్షియో, ఏది అహంకారము కాదో, అహంకారమునకు సాక్షిగా నిలచియున్న ఏ చైతన్యము కలదో, ఆ ఎరుక, అదే అసలు సిసలైన నేను, అదే ఆత్మ, అదే బ్రహ్మ (లేదా బ్రహ్మపదార్థము)
No comments:
Post a Comment