Monday, July 22, 2024

గురు(వ్యాస) పూర్ణిమ - ప్రత్యేకత

 ఆషాఢ మాసం - ప్రత్యేకత 

        గురుపూర్ణిమ శుభాకాంక్షలు

       గురు(వ్యాస) పూర్ణిమ - ప్రత్యేకత  

    ఆషాఢ పూర్ణిమని మనం గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఇదేరోజును  వ్యాస మహర్షి జయంతిగా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం. వాస్తవానికి రెంటినీ కలిపి ఆలోచించాలి. 
    గురుః అంటే - అంధకారాన్ని పోగొట్టువాడు. గురువు  అజ్ఞానాంధకారాన్ని తొలగిపోయేలాగు జ్ఞానాన్ని ప్రవేశపెడతాడు కదా! 

1.గురువు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అనే పదాలని ఒకే విధంగా వాడుతున్నా, ఆ మూడు వేర్వేరు. 

గురువు-ఉపాధ్యాయుడు-ఆచార్యుడు 
      
                నిర్వచనాలు. 
                      
(i) గురువు

గురుర్బన్ధురబన్ధూనాం 
గురుశ్చక్షు రచక్షుషామ్ I 
గురుః పితాచ మాతాచ 
సర్వేషాం న్యాయవర్తినామ్ II 

----బంధువులెవరూ లేనివారికి గురువే బంధువు.కళ్ళు లేని వారికి గురువే కంటి చూపు.గురువే తల్లి, గురువే తండ్రి. యదార్థజ్ఞాన ప్రదర్శకుడు.న్యాయమార్గంలో ప్రవర్తింపచేయువాడు "గురువు" 

(ii) ఉపాధ్యాయుడు

ఏకదేశం తు వేదస్య 
వేదాఙ్గాన్యపి వా పునః I     
యో2ధ్యాపయతి వృత్యర్థమ్ 
ఉపాధ్యాయస్య ఉచ్యతే  II

----వృత్యర్థం వేదాన్నీ వేదాంగాలనీ ఎవరైతే అధ్యాపనం  (బోధన) చేస్తారో వారు "ఉపాధ్యాయులు"

(iii) ఆచార్యుడు

ఆచినోతి హి శాస్త్రార్థాన్ 
ఆచారే స్థాపయత్యపి I
స్వయమాచరతే యస్మాత్ 
తస్మాదాచార్య ఉచ్యతే II

----కేవలం శాస్తార్థాలను బోధించడమే కాక, తాను వాటిని ఆచరిస్తూ, సమాజ హితం కోసం ఆదర్శంగా ఆచరింప చేసేవాడు "ఆచార్యుడు" 

2.వేదాలు జ్ఞానరాశి. అవి సార్వకాలీనం. 

వేదవ్యాసుడు 

    ఇది ఒకరి పేరుగాదు. వేదములను ప్రసరింపజేసిన మునిని వేదవ్యాసుడు అంటారు. 
    నారాయణుని నాభి కమలమున పుట్టిన బ్రహ్మ ముఖములనుండి ఉద్భవించిన వేదములను ప్రసరింపజేయుటకు, నారాయణుడు "అపాంతరతముడ"ను మానస పుత్త్రుని పుట్టించాడు. 
    నారాయణుడు వానిని బిలిచి "నీవు వేదములను దృఢావధానుడవై విని వాని నంచితన్యాస మొందింపుమ"ని చెప్పాడు. అపాంతరతముడు వేదభేదన మొనరించాడు. 
    ప్రతి ద్వాపర యుగాంతమున ఆర్షవిద్యలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిచే విస్తరింపబడుతూ ఉంటాయి. 
    ప్రథమ ద్వాపరమున స్వయంభువు వేదములను విభాగించాడు. 
    ద్వితీయ ద్వాపరమున ప్రజాపతి వేదవిభజన చేసి వ్యాసుడయ్యాడు, 
    తృతీయ ద్వాపరమున శుక్రుడు వ్యాసుడయ్యాడు. 
    అనంతర కాలాలలో బృహస్పతి, వసిష్ఠుడు, త్రివర్షుడు, సనద్వాజుడు మొదలగువారు వ్యాసులయ్యారు. 
    ఇప్పటి 28వ ద్వాపర యుగాంతంలో పరాశరాత్మజుడైన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన జయంతినే మనం వ్యాసపూర్ణిమ పేరుతో గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాం. 

3.సందేశం    

    ఈ విషయాలని విశ్లేషించుకుని, 
    మన సనాతన శాస్త్ర సంప్రదాయాలనే వేదాలని, 
    పాశ్చాత్య వ్యామోహం అనే సోమకాసురుడు, 
    పూర్తిగా దాచివేస్తున్న సముద్రం నుంచీ వెలికి తీసి కాపాడుకుందాం. 
    ఇదే గురు (వ్యాస) పూర్ణిమ మనకి అందిచ్చే సందేశం.

No comments:

Post a Comment