*చింతాక్రాంతుడు*
```
మనిషి జీవితంలోని ఒడుదొడుకుల వల్ల ఎప్పుడూ ఏదో ఒకచింత మనసును కాల్చేస్తూ ఉంటుంది.
చింతలేనివాళ్లు చాలా అరుదుగా ఉంటారు.
చితి, చింత ఈ రెండూ మనిషిని కాల్చివేస్తాయి. చితి కేవలం నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది. చింత సజీవంగా ఉన్న దేహాన్నీ దహించి వేస్తుందని, అందుకే చింతారహితంగా జీవించడానికి ప్రయత్నించాలని నీతిశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
పురాణేతిహాస యుగాల్లోనూ సామాన్యులను, మాన్యులను చింత ఎంతగా కష్టపెట్టిందో తెలుసుకోవచ్చు. మహాభారతంలో ఎక్కువగా చింతాక్రాంతుడైనవాడు కుఱురాజు ధృతరాష్ట్రుడు!
పుత్రప్రేమ అతిశయించిన ఈ కురువృద్ధుడు తన జీవితమంతా పాండవుల చింతతోనే గడిపాడు. పాండవులకు న్యాయంగా ఇవ్వవలసిన రాజ్యభాగాన్ని ఇవ్వకుండా, కపటి అయిన శకుని మాయాపాచికలతో పాండవులను జూదంలో ఓడించి, వారి సంపదలను హరించి, వారిని అడవులపాలు చేస్తేనేగాని ధృతరాష్ట్రుడి కోరిక నెరవేరలేదు.
జూదంలో సర్వస్వం కోల్పోయి, ద్రౌపదికి నిండుసభలో జరిగిన అవమానాన్ని దిగమింగి పాండవులు అడవుల దారి పట్టారు. అప్పుడైనా ధృతరాష్ట్రుడు నిశ్చింతగా ఉన్నాడా అంటే లేదన్నదే సమాధానం.
పాండవులు అడవికి వెళ్లిన తరవాత ధృతరాష్ట్రుడు సంజయుడితో తన మనసులో రగులుతున్న చింతను బయటపెట్టాడు.
అప్పుడు సంజయుడు- ‘రాజా! పాండవులను అడవికి పంపి, సమస్త భూమండలాన్నీ నీ కొడుకులకు ధారాదత్తం చేశావు. అయినా నీవు ఇంకా చింతిస్తున్నావు. కారణం ఏమిటి?’ అని ప్రశ్నించాడు.
అందుకు ధృతరాష్ట్రుడు సమాధానం చెబుతూ- ‘పాండవులు మహావీరులు. యుద్ధతంత్రంలో ఆరితేరినవారు. మహాబలవంతులు. అలాంటివాళ్లతో నా కొడుకులు వైరం పెట్టుకున్నారు. నేను చింతించకుండా ఎలా ఉంటాను?’ అని అన్నాడు.
ఆ మాటకు సంజయుడు- ‘మహారాజా! ఇంతటి మహావైరం సంభవించడానికి కారణం నీవే.
భీష్మ, ద్రోణ, విదురాది నీతివేత్తలు నచ్చజెబుతున్నా వినకుండా నీ కొడుకు దుర్యోధనుడు ద్రౌపదిని నిండుసభలో అవమానించాడు. దానిని నీవు చూస్తూ ఊరకున్నావు. నీ కొడుకులకు వినాశకాలం దాపురించింది కనుక ఇలాంటి విపరీతబుద్ధులు కలిగాయి. ఇలాంటి దుష్టపుత్రుల వల్ల నీకు చింతగాక మరేమి ఉంటుంది?’ అని నిష్కర్షగా ముఖం మీదే చెప్పాడు.
ధృతరాష్ట్రుడి వంటి మనుషులు లోకంలో ఇంకా ఉన్నారు. వారు తమ బలహీనతలతో అధర్మాన్ని చూస్తూ ఊరుకొంటారు. అధర్మవర్తనులను ఎంతమాత్రం నిలువరించరు. ఆ కారణంగా నిత్యం చింతాక్రాంతులై కాలం గడుపుతుంటారు.
ఒకరి నాశనాన్ని కోరేవారికి మనశ్శాంతి లభించదు.
పుత్రులపై మితిమీరిన పక్షపాత దృష్టితో ధృతరాష్ట్రుడు తన కళ్లముందే తన పుత్రులు పాండుకుమారులను అగచాట్లకు గురిచేస్తుంటే చూసీ చూడనట్లు ఊరకున్నందుకు పాప ఫలాన్ని యావజ్జీవితం అనుభవించాడు.చివరికి అధర్మవర్తనులైన తన పుత్రులు యుద్ధరంగంలో పిట్టల్లా రాలిపోతుంటే దుఃఖిస్తూ బరువుగా బతుకునీడ్చాడు.
ధృతరాష్ట్రుడి చింత సామాన్యమైంది కాదు. అది నిలువెల్లా దహించే భీకరాగ్నితో సమానం.
అందుకే అధర్మాన్ని ఆచరిస్తే పుత్రులనైనా క్షమించరాదని, ధర్మాన్ని ఆచరిస్తే శత్రువును అయినా చేరదీయాలని నీతికారులు చెబుతారు.
ధర్మాన్ని నమ్ముకుంటే చింత దూరమవుతుంది.
ధృతరాష్ట్రుడి జీవితం లోకంలోని ధర్మవిరోధులకు గుణపాఠం వంటిది!✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment