Tuesday, July 2, 2024

*****జీవితం లో కోరుకున్నది ప్రతీదీ లభించదు. మీకు ఏది దక్కాలో అదే దక్కుతుంది.

 జీవితం లో కోరుకున్నది ప్రతీదీ లభించదు. మీకు ఏది దక్కాలో అదే దక్కుతుంది.  
  సాధారణమైన వ్యక్తి కీర్తి ప్రతిష్టల గురించి ఆరాటపడతాడు, అవి లభించిన తర్వాత, వాటి ప్రచారం కోసం వెంపర్లాడతాడు. పేదవాడు డబ్బుంటే చాలుననుకుంటాడు! డబ్బున్నోడు సంతోషం కరువైందని బాధపడతాడు. ఒంటరిగా ఉన్నోడు తోడు కోసం తాపత్రయ పడతాడు. తోడు లభించాక, తనకంటూ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటాడు.     జీవితం లో ఏది పరిపూర్ణం అనిపించదు. ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. వెలుగు ఉందంటే కారణం  చీకటి. జీవితం లో ఎదురయ్యే వాటిని స్వీకరించడమే పరిష్కారం. ప్రతీ రోజు ఎలా ఎదగాలి అని పాజిటివ్ దృక్పథం తో ఆలోచిస్తూ ముందుకు సాగాలి.... ఉన్నతంగా జీవించడం అంటే ఉన్నదానితో తృప్తిగా, ధైర్యంగా జీవించడమే. దాపరికం లేనప్పుడు, తప్పించుకోవలసిన అవసరం ఉండదు, అప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది, అదే పారదర్శకమైన జీవనం. "నా జీవితం  తెరిచిన పుస్తకం" అని చెప్పుకోగలగడం, మనిషి తనకు తాను ఇచ్చుకునే గొప్ప అభినందన మందారమాల. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూస్తూ, తలకిందులు అయిపోతున్నట్లు భావిస్తే,  గొప్ప అవకాశాలు ఎదురొచ్చినా, అందుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఎదురయ్యే ఏ సమస్య కానీ, సంఘటన కానీ, మనిషికి ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది...ఆనందమయ జీవితం కోసం మనిషి తెలుసుకో వలసిన రహస్యం ఏమిటంటే - ఎప్పుడూ పాతవిషయాలను కొంగ్రొత్త దృక్పథం తో చూడగలగాలి. ఇష్టమైన వాటినే చేయాలని భావించకుండా, చేసేవాటినే ఇష్టంతో చేయాలి... సమాజం లో కొందరు తాము మేధావులమని భావిస్తూ, తమ చుట్టూ ఒక పరిధి ఏర్పరుచుకుని ఇతరులతో కలవరు. ఒకవిధంగా ఇదో మానసిక దౌర్భాగ్యం క్రింద లెక్క. భౌతిక జీవిగా మీకు ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, సమాజజీవిగా అందరితో అనుసంధానంగా ఉండడం కూడా, మనుగడ కోసం అంతే ముఖ్యం, అప్పుడే జీవనగమనంలో పరిపూర్ణత్వం చేకూరుతుంది........ పోలిన రామకృష్ణ భగవాన్.... రాజమండ్రి.

No comments:

Post a Comment