Monday, July 8, 2024

****ప్రియమైన మాస్టారూ..

 ప్రియమైన మాస్టారూ..

నా కుమారుడు ఈ రోజు పాఠశాల జీవితం ప్రారంభిస్తున్నాడు. ఇదంతా వాడికి కొత్త ప్రపంచం. కాస్తంత మృదువుగా వాడితో వ్యవహరించండి. మీ చేత్తో ఆప్యాయంగా వాడిని దగ్గరకు తీసుకోండి. వాడికి అర్థం అయ్యేలా విషయ బోధన చేయండి. ప్రతి శత్రువుకు ఒక స్నేహితుడు ఉంటాడని చెప్పండి. మనుషులందరూ ఒకే విధంగా ఉండరని వాడికి తెలియాలి. అందరూ నిజాయితీగా ఉండరని కూడా వాడు తెలుసుకోవాలి. ప్రతి ఆకతాయిలోనూ ఒక కథానాయకుడు దాగి ఉంటాడని, ప్రతి వంకర ఆలోచనలు ఉన్న రాజకీయ వాదిలోనూ అంకితభావం గల నాయకుడు ఉంటాడని బోధించండి.

ఒక డాలర్‌ దొరకడంలో లభించే ఆనందం కన్నా నిజాయితీగా 10 సెంట్‌లు సంపాదించడమే ఉత్తమమని చెప్పండి. పాఠశాలలో మోసం చేసి పాస్‌ అవ్వడం కన్నా పరీక్షలు తప్పడమే హుందాతనమని బోధించండి. హుందాగా ఓటమిని ఒప్పుకోవడం విజయాన్ని ఆనందంగా ఆస్వాదించడంలోని గొప్పదనాన్ని నేర్పండి.

ప్రజలతో మృదువుగా మెలగాలని.. కఠినాత్ములతో కఠినంగానే వ్యవహరించడం నేర్పండి. సంతోషంగా ఉండటం ద్వారా పొందే ఆనందపు మాధుర్యాన్ని ఈర్ష్యవల్ల కలిగే నష్టాన్ని వాడికి తెలియచేయండి. విషాదంలో ఉన్నప్పుడు ఎలా నవ్వాలో చెప్పండి. కన్నీరు చిందించడం సిగ్గుపడే విషయం కాదని విడమరచండి. అపజయంతో కుంగిపోవడం.. విజయంతో విర్రవీగే లక్షణాలకు దూరంగా ఉంచేలా బోధించండి. పుస్తకాలలోని అద్బుతాలను వివరించండి.

ఆకాశంలో ఎగిరే పక్షులు, సూర్యకాంతిలో పూలపై వాలే తుమ్మెదలు గురించి వాడికి తెలియాలి. వాడి అభిప్రాయాలు ఆలోచనలు వాడిలో నమ్మకం పెంచాలి. ఎందరు తప్పని చెప్పినా తను అనుభవం ద్వారా నేర్చుకున్న విషయమే వాస్తమని గ్రహించేలా బోధించండి. అందరూ చెప్పే విషయాలను ఓపిగ్గా వినమనండి. అందులో వాస్తవాలను మాత్రం వాడు బేరీజు వేసుకుని మంచిని మాత్రమే స్వీకరించేలా బోధించండి. ఇతరులు చేస్తున్నట్టుగా వాడు గుంపును గుడ్డిగా అనుసరించకుండా ఉండేలా బలోపేతుడ్ని చేయండి.

తన ఆత్మను అమ్ముకోకుండా మేథోసంపదను అత్యుత్తమ ప్రయోజనాలకు వినియోగంచేలా తీర్చిదిద్దండి. ధైర్యంగా ఉండేందుకు కావల్సిన సహనాన్ని అలవడేలా చేయండి. మానవాళి ప్రయోజనాలకు వినియోగించేలా వాడిలో గుండెల నిండుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి. ఇలా నా కుమారుడు ఎదగాలనుకుంటున్నా మాస్టారూ. నాకు తోచింది నేను చెప్పాను... మీరు ఎలా మంచిదనుకుంటారో దాన్ని అనుసరించండి. ఏమైనా వాడు చిన్న పిల్లవాడు.. అన్నింటికి మించి వాడు నా కుమారుడు.

థాంక్యూ...

అబ్రహం లింకన్

No comments:

Post a Comment