Tuesday, July 23, 2024

*****మనిషి శాంతి లేకుండా బతకలేడు. శాంతి లేకుండా సుఖం లేదు. మీకు ఇంట్లో ఎంత డబ్బున్నా

 *శ్రీ గురుభ్యోనమః*

        గురువు  దయ  వల్లనే  అజ్ఞానం  అనే  నిద్రలోంచి  నిజమైన  జ్ఞానంలోకి  వస్తావు.  అసత్యం  లోంచి  సత్యంలోకి  వస్తావు.  మృత్యువు  లోంచి  అమృతత్వాన్ని  పొందుతావు.  మన  దేహం  చనిపోయినప్పుడు  అది  నిజం  కాదు,  అది  స్వప్న  సమానమే !  మనం  దేహం  నేను  అనుకుంటున్నాం  కాబట్టి,  దేహం  చనిపోయినప్పుడు  నేను  చనిపోతున్నాను  అని  అనిపిస్తుంది.  *ఆ దేహభావన,  దేహబుద్ధి  తగ్గించుకుంటూ  రావాలి.  అది  నీ సాధన  యొక్క  లక్ష్యం !*  

*పరమాత్మ  భావనలో  శాంతిని  పొందు  అర్జునా ..  అంటాడు  కృష్ణుడు !*  ఎంత  గొప్ప  టీచింగో  చూడండి.  లోక  విషయాల్లో  నువ్వు  ఎక్కడ  శాంతిని  పొందటానికి  ప్రయత్నం  చేసినా,  భవిష్యత్తులో  అది  దుఃఖం  కింద  మారిపోతుంది.  శాంతి  లేకుండా  ఎంతకాలం  ఉండగలం ?  నువ్వు  శాంతిని  పొందు  కానీ ..  పరమాత్మ  భావనలో,  బ్రహ్మ  భావనలో  శాంతిని  పొందు.  అలాకాకుండా  ఏదో  విషయాలలోనో,  వస్తువులలోనో,  చుట్టాలతోనో,  స్నేహితులతోనో ..  శాంతిని  పొందుతామనుకోండి,  వాళ్ళు  మనకు  విరోధులయితే  మన  శాంతి  అంతా  పోతుంది.  స్నేహాలు  ఎలాగూ  నిలబడేవి  కావు.  కుటుంబ  సభ్యులతో  కొంతకాలం  ఇష్టంగా  ఉన్నా,  పేచీలు  వచ్చినప్పుడు  ఆశాంతిగా  మారిపోతుంది.   ఇవన్నీ  నిజాలు  కావు.  అలాగని  అన్నదమ్ములతోనూ,  స్నేహితులతోనూ  ఇష్టంగా  ఉండద్దని  కాదు.  నీ శాంతికోసం  వారిమీద  ఆధారపడవద్దు.

సంసారంలో  ఏ రకమైన  సుఖాలు  అనుభవించినా,  భవిష్యత్తులో ఈ సుఖాలన్నీ  నూటికి  నూరు  పాళ్ళూ  వడ్డీతో  సహా  దుఃఖాలకింద  మారిపోతాయి.  *మనిషి  శాంతి  లేకుండా  బతకలేడు.  శాంతి  లేకుండా  సుఖం  లేదు.  మీకు  ఇంట్లో  ఎంత  డబ్బున్నా  డబ్బుని  బట్టి  సుఖం  రాదు,  శాంతిని  బట్టి  సుఖం  వస్తుంది.*

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09 

   🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment