Thursday, July 11, 2024

 చలాచల బోధ:--
సులభ సాధనల నుండి కష్టతర సాధనల క్రమంలో మొదటిది అహంకారము.
ఈ అజ్ఞాన 'నేను'కు కర్తృత్వ, భోక్తృత్వ,అభిమానిత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాము.ఈ నేను తనను తాను ఇతరుల కంటే ఎక్కువగానో లేక తక్కువగానో అనుకుంటూ ఉంటుంది.దీనిని ఇగో (Ego) అంటారు.అనగా superiority complex & inferiority complex అన్నమాట.ఈ నేను మరీ గొప్పదని అనుకుంటే అది మదముగా మారుతుంది.ఈ మదం ధనం కలిగి యుండటములో గొప్ప అని అనుకొంటే దానిని ధనమదం అంటారు.నాది అగ్ర కులం అని అనుకొంటే కులమదం అంటారు.ఇదే విధంగా రూపమదం,యౌవనమదం,రాజ్యమదం,విద్యామదం తపోమదం వగైరా చాలా ఉంటాయి.తరతమ బేధంతో ఈ మదమును అహంభావమని,దంభం,దర్పం,గర్వం అని అనేక దుర్గుణాలుగా చెప్పవచ్చును.'నేను నేనైన నేను 'కు ఇదంతా అజ్ఞానం వలన తెచ్చి పెట్టుకున్నవే.వీటిని సాధనచే తగ్గించుకొనుచూ, చివరికి తొలగించుకోవాలి.ఈ విధంగా తెచ్చిపెట్టుకున్న వాటిని ఆగంతుకము అని అంటారు.
కర్తృత్వము అహం బ్రహ్మ అనే అనుభవం కలిగేదాకా ఉంటుంది.కాని భోక్తృత్వాన్ని తగ్గించుకోవచ్చును.చేసిన కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పించటము ద్వారా పోగొట్టుకొన వచ్చును.నిష్కామ కర్మ యోగ సాధనతోను, వైరాగ్యంతోను,లేక ఈ జగత్తును మిథ్యగా భావించుట చేతను భోక్తృత్వాన్ని పోగొట్టుకొన వచ్చును.

No comments:

Post a Comment