Wednesday, July 3, 2024

******🌻ధ్రువ చరిత్ర🌻*

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*
*శ్రీహరి లీలామృతం 31వ భాగము*
*(సంక్షిప్త భాగవత గాథలు)*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸
*చతుర్థ స్కంధం*
*3వ భాగము*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸

*🌻ధ్రువ చరిత్ర🌻*

🍃🌺బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాదులు, నారదుడు, ఋభువు, హంస, అరుణి, యతి మొదలగువారు బ్రహ్మచారులుగానే మిగిలి పోయారు. కాని వేరొక కుమారుడైన అధర్ముడు అసత్యం అను ఆమెయందు, దంభుడు అనే కుమారుని, మాయ అనే కుమార్తెను పొందాడు. వీరిద్దరి ద్వారా లోభుడు అనే కుమారుడు, హింస అనే కుమార్తె జన్మించారు. వీరిద్దరికి భయము అనే కుమారుడు, మృత్యువు అనే కుమార్తె పుట్టారు. వీరిద్దరికి యాతన అనే కుమారుడు, నరకం అనే కుమార్తె జన్మించారు. ఇదే అధర్ముని వంశవృక్షం. దీనినే సంసారవృక్షం అనవచ్చు. బుద్ధియుక్తులు వీరితో ఎలాంటి సంపర్కం పెట్టుకోరు.

🍃🌺ఇపుడు అతని పుత్రుల వంశవృక్షం చెప్పబడుతోంది.స్వాయంభువమనువు రెండవ కుమారుడు ఉత్తానపాదుడు. ఇతనికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు. సురుచిపై అతనికి ప్రేమ ఎక్కువ.

🍃🌺సునీతికి ధ్రువుడు అనే కుమారుడు, సురుచికి ఉత్తముడనే కుమారుడు కలిగారు. ఉత్తానపాదునకు ఉత్తముడే ప్రీతిపాత్రుడు. ఒకరోజు తండ్రి ఉ త్తముని తన ఒడిలో కూర్చుండబెట్టుకోగా, ధ్రువుడు సమీపించినా, తండ్రి దగ్గరకు తీసుకోలేదు. ఇది చూచిన సురుచి ధ్రువునితో "నాయనా! నా గర్భంలో జన్మించినవారికే తండ్రి తొడపై కూర్చుండే అర్హత ఉంటుంది. నీ కా భాగ్యం కలగాలంటే నా కడుపున పుట్టించమని ప్రార్థించు. అపుడు నీ కోరిక తీరుతుంది.” అని ఈసడించుకొంది. ఐదేళ్ళ ఆ చిన్నారిబాలుడు దుఃఖంతో, రోషంతో వెళ్ళి జరిగిందంతా తల్లికి చెప్పాడు. 

🍃🌺సునీతి బిడ్డను బుజ్జగిస్తూ ఇలా చెప్పింది “నాయనా! నీ పినతల్లి మాటలు నిజమే. నావల్లనే నీకు ఈ అనాదరణ లభించింది. శ్రీహరియే అందరికీ దిక్కు. ఆ భక్తవత్సలుని ఆరాధించు. ఆ పరమపురుషుడు కరుణామయుడు. అనుగ్రహిస్తాడు.” అని చెప్పిన తల్లి మాటలు వినిన ధ్రువుడు అగమ్యంగా వెళుతుంటే నారదుడు ఎదురు పడ్డాడు. సకల ఐశ్వర్యాలు కలిగిన ఈ కుమారుడు అన్ని వదలివేసి, శ్రీమహావిష్ణువు శరణార్థియై ఇలా ఇల్లు విడిచి రావడం, నారదునకు ఆశ్చర్యం కలిగించింది. ఆ బాలునితో నారదుడు ఇలా అన్నాడు. “కుమారా! నీవు పనివాడవు. 

🍃🌺ఈ వయసులో మానావమానాలను లెక్క చేయనవసరం లేదు. కర్మఫలాల్ని అనుభవించాల్సిందే. తప్పించుకోలేరు. మహాయోగులే ఆ శ్రీహరి స్వరూపాన్ని జన్మజన్మల సాధనల ద్వారా కూడా తెలుసుకోలేక పోయారు. నీవు ఇంటికి వెళ్ళడం మంచిది. నీకు అంతగా మోక్షా పేక్ష వుంటే, పెద్దవాడవైన తర్వాత ప్రయత్నింతువు గాని, లే” అని చెప్పిన నారదునితో ఆ బాలుడు ఇలాగన్నాడు. “మహాత్మా! మీ ఉపదేశము శిరోధార్యమే. మనశ్శాంతి లభిస్తుంది. కాని నా అశాంతికి కారణం నా పినతల్లి. క్షత్రియవంశంలో జన్మించిన నాకు ఆమె మాటలు బాణాల్లా నా హృదయాన్ని గాయపరచాయి. నా తమ్మునికంటే ఉన్నత స్థాయిని పొందాలనే స్థిరసంకల్పం నాకు కలిగింది. మీరు బ్రహ్మదేవుని పుత్రులు. నా ఆశయ సిద్ధికి మార్గం చూపమని ప్రార్థిస్తున్నాను.” 

🍃🌺అని చెప్పిన ఆ చిన్నారి బాలుని మాటలకు ముగ్ధుడై అతనితో ఇలా అన్నాడు. “వత్సా! నీవు నిర్మల హృదయుడవు. శ్రీమన్నారాయణుడే నిన్నిలా ప్రేరేపించాడు. అన్నిటికి ఆ శ్రీహరి పాదపద్మములే శరణ్యం నాయనా! నీవు యమునా తీరాన వున్న మధువనానికి వెళ్ళి స్థిరచిత్తంతో ధ్యానం చేయి. అఖండ తేజోవిరాజ మానుడును, సర్వాలంకార శోభితుడును అయిన ఆ శ్రీమన్నారాయణుని దివ్యసుందరమూర్తిని నిరంతరం ధ్యానిస్తుండాలి. “ఓం నమో భగవతే వాసు దేవాయ' అనే మంత్రాన్ని నిత్యం జపిస్తుండాలి. ఇలా వారం రోజులు చేస్తే నీకు దేవతలను దర్శించే శక్తి లభిస్తుంది. శాంతచిత్తంతో శ్రీహరి కళ్యాణగుణాలను స్మరిస్తూ ధ్యానించాలి. త్రికరణ శుద్ధితో ఇలా చేస్తే, మాయ నీదరి చేరదు. భగవంతుడు పురుషార్థాలలో కోరినదాన్ని ప్రసాదిస్తాడు. భక్తి, వైరాగ్యాలతో ధ్యానం చేస్తే మోక్షాన్నే అనుగ్రహిస్తాడు.” అని నారదుడు చెప్పి, నిష్క్రమించాడు.

🍃🌺ధ్రువుడు ఇల్లు విడిచి వెళ్ళడంతో ఉత్తానపాదుడు క్రుంగి కృశించి పోయాడు. బిడ్డను గురించి పరితపిస్తున్న వేళ, నారదుడు వచ్చి ఇలా ఓదార్చాడు. “రాజా! ధ్రువుని గురించి బెంగ పెట్టుకోపనిలేదు. ఇపుడు అతడు నారాయణుని రక్షణలో వున్నాడు. అతని ప్రభావం నీకు తెలియక నీవు ఆ అసామాన్య బాలుని లెక్కపెట్టలేదు. త్వరలోనే అతడు తిరిగివచ్చి మీ వంశ ప్రతిష్ఠను చిరస్థాయిగా ప్రకాశింజేస్తాడు.” అని చెప్పి నారదుడు అక్కడినుంచి నిష్క్రమించాడు.

🍃🌺ధ్రువుడు మధువనం చేరుకున్నాడు. శ్రీహరిని చిత్తంలో స్థిరం చేసుకుని, తపస్సు ప్రారంభించాడు. నాలుగవ నెల ఒంటికాలిపై నిలిచి, ఐదవ నెల మ్రోడువలె నిలిచి భగవంతుని తన హృదయంలో ఏకదీక్షగా ధ్యానించాడు. ఆ బాలుడి తేజస్సును ముల్లోకాలు భరించలేక పోయాయి. భూమి అటూ ఇటా కదలసాగింది. విశ్వమంతా కంపించ సాగింది. దేవతలు శ్రీహరి వద్దకు వెళ్ళి తమను రక్షించమని ప్రార్థించారు. శ్రీహరి గరుడవాహనుడై మధువనం చేరి, ధ్రువుని ఎదుట ప్రత్యక్షం అయినాడు.

తన హృదయంలో ప్రకాశిస్తున్న శ్రీహరినే ధ్రువుడు దర్శిస్తూ తన్మయుడౌతున్నాడే తప్ప ఎదుట నిలిచిన శ్రీహరిని చూడలేదు. అపుడు శ్రీహరి అతని హృదయంలో అదృశు ్యడైనాడు. ఆ బాలుడు కనులు తెరచి ఆ కరుణామూర్తి తిలకించాడు, పులకించాడు, సాష్టాంగ ప్రణామం చేశాడు.

🍃🌺ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఆ బాలుని నోట మాటరాలేదు. స్తుతించడానికి విద్య, సంస్కారం, భాష లేవు. నమస్కరిస్తూ నిలుచుండిపోయాడు. ఆ శ్రీహరి వేదమయమూ, నాదబ్రహ్మమూ అయిన తన శంఖంతో ఆ బాలుని స్పృశిస్తూ, చెక్కిళ్ళను నిమిరాడు. దానితో ఆ బాలునికి ఆత్మతత్త్వం, పరతత్త్వం కూడా తెలిపే వేదాంత జ్ఞానం అతని నోటినుండి వెలువడింది. ధ్రువుడు పరమేశ్వరుని ఇలా స్తుతించాడు. “ఓ దేవాదిదేవా! నీవు సకల శక్తిమంతుడవు. స్తంభించిపోయిన నాకు నీవు చలనం కలిగించినందుకు నీకు నా వందనములు. పరమాత్మా! నీనుండి విడదీయబడని జగత్తును, నీ సంకల్పంతో మహత్తూ, అహంకారం మొదలైన రూపాలలో వ్యక్తపరచావు. వాటియందు జీవునిగా ప్రవేశించి ప్రవర్తించే ఆత్మస్వరూపుడవైన నీకు నమస్కారములు.”

🍃🌺“ప్రభూ! కల్పాదిలో బ్రహ్మ సృష్టి క్రియను మరచిపోయి, నిన్ను శరణు వేడగా, నీవనుగ్రహించిన జ్ఞానంతోనే కదా సృష్టిరచన చేశాడు. ఈశ్వరా! మాయచేత మతిలేనివారు నిన్ను ఆశ్రయించి మోక్షాన్ని సాధించుకోకుండా క్షుద్రమైన అర్థకామాల్నే కోరుకుంటారు. పద్మనాభా! వారు కోరుకున్నవన్నీ లభించే పరమానందం మోక్షం వల్ల కూడ కోరుకోలేరు గదా! ముకుందా! నీ భక్తులతో నాకు స్నేహాన్ని అనుగ్రహించు. వారి సాంగత్యంలో నీ దివ్యకథాసుధారసాన్ని గ్రోలి సంసార సాగరాన్ని తరించగలను. మాధవా! విశ్వతోముఖా! నీ పాదపద్మ సుగంధాన్ని అనుభవించినవారు, తమ శరీరాన్ని, బంధుపరివారాన్ని మరిచి పోతారు. 

🍃🌺ఓ పరమేశ్వరా! దేవదానవజంతు జీవాదులతో నిండిన, స్త్రీ పురుషులతో కూడి ఉన్న నీ స్థూలరూపాన్నే నేను ఎరుగుదును. గాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు కదా! కల్పాంతంలో సకల సృష్టిని నీలోనే విలీనం చేసుకొని, యోగనిద్రలో ఆదిశేషతల్పంపై శయనిస్తావు. నీ నాభినుండి జనించిన హిరణ్మయ పద్మమునుండి బ్రహ్మను పుట్టిస్తావు. దేవదేవా! నీవు ఆది పురుషుడవు. సర్వజ్ఞుడవు. భగవంతుడవు. సాక్షిభూతుడవు. సర్వేశ్వరా! పరస్పర విరుద్ధ శక్తులతో కూడిన ఈ జగత్తునకు నీవే కారణభూతుడవు. ఆనందమయము, అవికారమూ అయిన పరబ్రహ్మవు నీవే. నీకు వందనములు.”

🍃🌺పరమేశ్వరా! నిష్కామ భక్తులు నిన్ను సర్వతోముఖ ఫలముగా భావిస్తారు. వారికి నీ పాదపద్మాలే శరణ్యం, సర్వస్వం. సకామభక్తుల బంధాలను నివారించే కరుణాసాగరుడవు నీవు. నీకు అనేక నమస్కారములు.” అని స్తుతించిన ధ్రువుని మాటలకు సంతసించిన శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు. 'రాజకుమారా! నీ తపోఫలంగా నేను దర్శనమిచ్చాను. నీ కోరికను తీరుస్తాను. నక్షత్రాలు, గ్రహాలు, ధర్ముడు, అగ్ని, శుక్రుడు, కశ్యపుడు, సప్తఋషులు ప్రదక్షిణం చేస్తుంటే ధ్రువక్షితి అనే మహౌన్నత స్థానాన్ని నీవు పొందుతావు. 

🍃🌺ముల్లోకాలు నశించినా అది నశించదు. నీవు నీ తండ్రి రాజ్యాన్ని ఇరవై ఆరువేల సంవత్సరాలు పాలించిన తరువాత ధ్రువక్షితిని అధిష్టిస్తావు. నీ తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. నీ తమ్ముడు ఉత్తముడు నీ వేటకు వెళ్ళి అడవిలో మరణిస్తాడు. అతని తల్లి వెదుకుతూపోయి అడవి చిచ్చులో కాలిపోతుంది. నీవు అసంఖ్యాక యాగాలు చేసి నన్ను ఆరాధిస్తావు. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ సప్తర్షి మండలంపై నున్న ఉన్నత స్థానాన్ని పొంది, తుదకు నన్ను చేరుతావు.” అని చెప్పి గరుడారూఢుడై స్వామి వెళ్ళిపోయాడు. మహావిష్ణువు వెళ్ళిన తర్వాత ధ్రువుడు చింతాక్రాంతుడై ఇలా తలంచాడు. “జితేంద్రియులు, మహాత్ములు, మునీంద్రులు పెక్కు జన్మల సమాధి యోగశక్తితో సాధించగలిగే ఆ పరమేశ్వరుని, ఆ శ్రీహరిని నేను ఆరు నెలలు సేవించి, సాక్షాత్కారాన్ని పొందికూడ, అనిత్యమైన దానినే ఆశించాను. అత్యున్నత పదమునే కోరుకొన్నాను గాని మోక్షాన్ని కోరనైతిని. నా పూర్వకర్మమే నన్ను పెడమార్గంలో నడిపించింది. విషయవాసనలను విడిచి పెట్టవు.” అని గ్రహించిన ధ్రువుడు ఊరట చెంది నిజనగరికి బయలుదేరాడు.

🍃🌺ధ్రువుడు ఇంటికి తిరిగి వస్తున్నాడన్న వార్తను తెలిసికొని ఉత్తానపాదుడు భార్యలను, ఉత్తముని తీసుకొని, మంత్రులతో, బ్రాహ్మణులతో ఎదురేగి స్వాగతం పలికాడు. తండ్రి ధ్రువుని కౌగలించుకొని ముద్దాడాడు. ఆనందంతో పొంగి పోయాడు. ధ్రువుడు తల్లులకు నమస్కరించగా, అన్నదమ్ములు కౌగిలించుకొన్నారు. సురుచి “చిరంజీవ” అని దీవించింది. తల్లి సునీతి ఆనందంతో పరవశించి పోయింది. పురప్రజలు ప్రేమతో స్వాగతించారు. ధ్రువుని యుక్తవయస్సు రాగానే పట్టాభిషిక్తుని చేసి, ఉత్తానపాదుడు తపోవనానికి వెళ్ళాడు. ధ్రువుడు భ్రమిని వివాహమాడి, కల్పుడు, వత్సరుడు అనే ఇద్దరు కుమారులను కన్నాడు. వాయు పుత్రిక అయిన ఇలను పెండ్లాడి, ఉత్కలుడు అనే కుమారుని, సౌందర్యవతి అనే కుమార్తెను పొందాడు. ఆ త్తముడు పెండ్లికాక ముందే, అడవికి వెళ్ళి ఒక యక్షునిచే చంపబడ్డాడు. సురుచి పుత్రశోకంతో అడవికి వెళ్ళి, అక్కడ కార్చిచ్చులో మరణించింది.

🍃🌺యక్షుడు తన తమ్ముని చంపాడన్న కోపంతో, ధ్రువుడు యక్షరాజధాని అయిన అలకాపురి పై దండెత్తాడు. యుద్ధంలో చాలమంది యక్షులు మరణించారు. రాక్షసులు ప్రవేశించి మాయలు ప్రయోగించారు. పులులు, సింహాలు చుట్టుముట్టాయి. పైనుండి చూస్తున్న మహామునులు ధ్రువునితో శ్రీహరిని స్మరించు అని కేకలు వేసి చెప్పారు. ఒక్క నారాయణాస్త్రంతో రాక్షస మాయలు తొలగిపోయాయి. ధ్రువుని కోపం చల్లారలేదు. ఆ సమయంలో తాతగారైన స్వాయంభువ మనువు ఋషులతో కూడి అక్కడికి వచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు. “నాయనా! శాంతించు. నీ తమ్ముని ఎవరో నీ ఒక యక్షుడు చంపగా, నీవు యింతమందిని ఇక్కడ చంపడం తగదు. ఘోరపాపం అవుతుంది. 

🍃🌺మనువుల వంశానికే ఇది తీరని కళంకం అవుతుంది. నీవు ఐదేళ్ళ వయస్సులోనే శ్రీహరిని దర్శించిన పరమ భాగవతోత్తముడవని ప్రసిద్ధి చెందావు. అలాంటి శ్రీహరి భక్తులకు రాగద్వేషాలు పనికిరాదు. జనన మరణాలు మన అధీనం కావు కదా! ఆ యక్షుడు కేవలం నిమిత్తమాత్రుడే. నీవు ఈ మోహాన్ని విడిచిపెట్టాలి. నీ ఈ దుష్కార్యంతో కుబేరుని పట్ల అపరాధం చేసినవాడివయ్యావు. వైరాన్ని విడిచి కుబేరుని చెలిమిని అర్థించు” అని మందలించి, మనువు నిష్క్రమించాడు.

🍃🌺ధ్రువుడు పోరాటం విడిచి శాంతచిత్తుడైనాడు. కుబేరుడు యక్ష, చారణ, విద్యాధరాదులతో వచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు. “రాకుమారా! నీవు మీ తాతగారి ఆజ్ఞను శిరసావహించి, విరోధాన్ని విడిచినందుకు సంతోషం, వరమిస్తాను కోరుకో” అనగా ధ్రువుడు శ్రీహరి స్మరణం, తన మనస్సులో నిత్యమూ, స్థిరంగా ఉండేటట్లు వరమివ్వ”మని కోరాడు. “తథాస్తు” అని కుబేరుడు నిష్క్రమించాడు.

🍃🌺ధ్రువుడు అనేక యజ్ఞాలు చేశాడు. పరమేశ్వరుని అంతటా దర్శించాడు. దీనులను సంరక్షిస్తూ, ప్రజలను తన కన్నబిడ్డలుగా చూచుకొంటూ, ఇరవై ఆరువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. తరువాత తన కుమారునికి రాజ్యం ఇచ్చి, తాను సర్వసంగ పరిత్యాగియై బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ పరమానందభరితుడై పద్మనాభుని పాదపద్మాలయందు మనసు లగ్నం చేసి, ధ్యానించసాగాడు. అపుడు ఆకాశంనుండి ఒక విమానం దిగివచ్చింది. దిగివచ్చిన దివ్యపురుషులిద్దరిని విష్ణు సేవకులుగా ధ్రువుడు గ్రహించాడు. వారు కుమార వయస్కులు. కిరీటకుండలగదాధారులై ఉ న్నారు. ధ్రువుడు వారికి నమస్కరించాడు.

🍃🌺" నందసునందులనబడే ఆ విష్ణు సేవకులు ఈ విధంగా చెప్పారు. “రాజా! నీకు మంగళమగు గాక! మేము విష్ణు సేవకులం. ఆయన ఆజ్ఞ ప్రకారం నిన్ను ఆయన ధామానికి తీసికొని వెళ్ళడానికి వచ్చాం. ఈ విష్ణుపదమును ఎవరూ పొంది ఉండలేదు. సప్తఋషులు కూడ దూరంగా ఉండియే చూడగలరు.” అని చెప్పి, ధ్రువుని విమానం ఎక్కించుకొని వెళు చుండగా, దారిలో వేరొక విమానంలో తన తల్లి సునీత ఊర్ధ్వలోకాలకు వెళ్ళుతుండడం చూడగా, ధ్రువుడు ఆనందభరితు డయ్యాడు. ధ్రువుడు మూడు లోకాల్ని, గ్రహమండలాల్ని, సప్తర్షి మండలాల్ని దాటి, ఆ పైనున్న విష్ణుపదాన్ని చేరుకొన్నాడు. ఆ పదం చాల గొప్ప జ్యోతిశ్చక్రం. నిరంతరం తిరుగుతూ వుంటుంది. ధ్రువుడు విష్ణుదాసుని ఆకారాన్ని పొంది, దివ్యతేజోమయరూపంతో అక్కడనే ఉండిపోయాడు.

🍃🌺ఐదేండ్ల బాలుడు శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఎలా పొందాడో, శాశ్వతమైన విష్ణుపదాన్ని ఎలా చేరుకున్నాడో అన్ని విషయాలను నారదుడు ప్రచేతసులు చేస్తుండే సత్రయాగంలో గానంచేసి వినిపించాడు. ఈ ధ్రువచరిత్ర వినేవారికి భగవానుని యందు భక్తి కలిగి, సంసార దుఃఖం దూరమై పోతుందని, మైత్రేయ మహాముని విదురునకు చెప్పినట్లు, శ్రీ శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు.


🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
         *🙏ఓం నమో వేంకటేశాయ🙏*
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹

No comments:

Post a Comment