Tuesday, July 23, 2024

 🙏శివపంచాక్షరీ స్తోత్రమ్‌* 🙏


*నాగేంద్రహారాయ త్రిలోచనాయ*
*భస్మాంగరాగాయ మహేశ్వరాయ !*
*నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ*
*తస్మై 'న' కారాయ నమశ్శివాయ!!*

🙏 కంఠమున సర్పములను హారములుగా ధరించినవాడు, మూడు నేత్రములు కలవాడు (సూర్యుడు, చంద్రుడు, అగ్ని) భస్మమును తన శరీరముపై పూసుకొన్నవాడు, నిత్యస్వరూపుడు, పరమ శుద్ధస్వరూపుడు, సర్వశక్తి సంపన్నుడు, దిగంతముల వరకు వ్యాపించినవాడు, *'న' కార స్వరూపుడు* అయిన ఆ పరమేశ్వరునకు నమస్కారము. 🙏

*మందాకినీ సలిల చందన చర్చితాయ*
*నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ*
*మందార ముఖ్య బహుపుష్పసుపూజితాయ*
*తస్మై “మ” కారాయ నమశ్శివాయ॥*

🙏 మందాకిని అనగా దేవగంగ. అట్టి గంగాజలముతో అభిషేకింపబడి, మంచి గంధము యొక్క పూతచేత అలంకరించబడినవాడు, నందీశ్వరుడు మొదలగు ప్రమథ గణములన్నిటికీ అధినాథుడు, మహేశ్వరుడు, మందారములు మున్నగు పుష్పములతో చక్కగా విధివిధానంగా అర్చింపబడువాడు, *“మ” కార స్వరూపుడు* అయిన ఆ పరమశివునకు నమస్కారము. 🙏

*శివాయ గౌరీ వదనారవింద*
*సూర్యాయ దక్షాధ్వరనాశనాయ!*
*శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ*
*తస్మై 'శి' కారాయ నమశ్శివాయ!!*

🙏 శివుడు మంగళ స్వరూపుడు, పార్వతీ ముఖమనెడు అరవిందము (పద్మం) నకు సూర్యుడు. (ఈ పంచాక్షర మంత్రము శివపార్వతులకు పంజరము, వారి నివాసము. *“పంచాక్షరీ పంజర రంజితాభ్యాం”* అని ఉమామహేశ్వరస్తవం. సూర్యోదయానికి సంతసించి పద్మము వికసించినట్లు పరమేశ్వర సందర్శనం వల్ల పార్వతీముఖ పద్మం వికసిస్తుంది) దక్షయజ్ఞ విధ్వంసి, నీలకంఠుడు, ఎద్దు తన ధ్వజమున చిహ్నముగా కలవాడు, *'శి' కార స్వరూపుడు* అయిన ఆ పరమేశ్వరునకు నమస్కారము. 🙏

*వసిష్ఠ కుంభోద్భవ గౌతమార్య*
*మునీంద్రదేవార్చిత శేఖరాయ!*
*చంద్రార్క వైశ్వానరలోచనాయ*
*తస్మై 'వ' కారాయ నమశ్శివాయ!!*


🙏 వసిష్టుడు, అగస్త్యుడు, గౌతముడు మున్నగు శ్రేష్ఠులైన మునీంద్రుల చేతను, దేవతల చేతను నిత్యము అభిషేకాదులచే పూజింపబడుచున్న మస్తకము కలవాడు, చంద్రసూర్యాగ్నులు ముగ్గురు మూడు
నేత్రములయిన వాడు, *“వ' కార స్వరూపుడు* అయిన ఆ పరమేశ్వరునకు నమస్కారము. 🙏

*యక్షస్వరూపాయ జటాధరాయ*
*పినాకహస్తాయ సనాతనాయ!*
*దివ్యాయ దేవాయ దిగంబరాయ*
*తస్మై 'య' కారాయ నమశ్శివాయ!!*

🙏 యక్షుని రూపాన్ని ధరించినవాడు, జటాధారి, 'పినాకము' అను వింటిని చేబూనినవాడు, సనాతనుడు (శాశ్వతుడు) దివ్యస్వరూపుడు, దేవుడు, దిగంబరుడు (అంటే దిక్కుల చివరల వరకు వ్యాపించినవాడు) *'య' కార స్వరూపుడు* అయిన ఆ పరమేశ్వరునకు నమస్కారము.🙏

No comments:

Post a Comment