Tuesday, October 21, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-179.
206d3;1910e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣9️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                  *భగవద్గీత*
                  ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*44. వ శ్లోకము:*

*”పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః ।*
*జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే” ॥44 ॥*

“పై రెండు శ్లోకములలో చెప్పబడినట్టు అంతకు ముందు జన్మలో యోగాభ్యాసము చేసి పూర్తి కాకముందే మధ్యలో మరణించిన యోగి, తాను పూర్వజన్మలో అభ్యసించిన యోగము యొక్క బలము చేత, మరుజన్మలో కూడా, అతని ప్రమేయం ఏమీ లేకుండానే యోగాభ్యాసము వైపుకు లాగబడుతున్నాడు. ఇది అంతా అతని పూర్వజన్మ సంస్కారము వలన జరుగుతూ ఉంది.”
```
ఇక్కడ మరొక సందేహమునకు కూడా సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. అదేమిటంటే శ్రీమంతుల ఇంట్లోపుడితే, అతనికి ఉన్న ధన బలము, అతని స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అతనిని చెడు అలవాట్లు వైపు లాగుతుంది కదా! మరి, అతనికి యోగాభ్యాసం చేయడానికి ఎలా వీలు కుదురుతుంది అని ప్రతి వాడికీ సందేహము కలుగుతుంది. దానికి పరమాత్మ ఇచ్చిన సమాధానమే ఈ శ్లోకము…

పూర్వజన్మలో యోగాభ్యాసము చేసి, అది పూర్తి కాకుండానే మరణించిన యోగి, మరుజన్మలో శ్రీమంతులు, ఆచారవంతులు అయిన వారి గృహములో జన్మిస్తాడు అని చెప్పాను కదా! అతనికి ఉన్న ధనము, పరిసరాలు అతడిని చెడు అలవాట్లవైపు లాగినా, ఈ యోగభ్రష్టుడు వాటి వంక చూడడు. ఆధ్యాత్మికతే వైపే మొగ్గు చూపుతాడు. అతడి పూర్వజన్మ సంస్కార బలం అటువంటిది. కాబట్టి మనం ఏచిన్న పుణ్యకార్యము చేసినా అది మనకు తరువాతి జన్మలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా పాపం చేసినా అది మరుజన్మలో పాపకార్యముల వంక లాగుతూనే ఉంటుంది. పుణ్యకార్యములు, ధ్యానము, మంచి బుద్ధిని కలిగిస్తే, పాపపు పనులు పాపబుద్ధిని కలిగిస్తాయి.

ఇప్పటికీ మనం అక్కడక్కడా చూస్తుంటాము. ముమ్మిడి వరం బాలయోగి, రమణ మహర్షి, కంచి పరమాచార్య, త్యాగరాజు మొదలగు వారు, ఇంకా మనకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ముందు జన్మలో ఆధ్యాత్మికతలో మునిగి తేలిన వారు కాబట్టి, మరుజన్మలో కూడా వారు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక బుద్ధి కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత వైపుకే లాగబడతారు. వారిని ప్రాపంచిక విషయాలు ప్రలోభపెట్టలేవు. అంటే, ముందు జన్మలో యోగాభ్యానము ఆధ్యాత్మికత పెంపొందించుకున్నవాడు, మరు జన్మలోకూడా ఆ వైపుకు బలవంతంగానైనా లాగబడతాడు.

రెండవ పాదంలో, అటువంటి యోగి ఎటువంటి గతులు పొందుతాడో వివరిస్తున్నాడు. పరమాత్మ. అటువంటి జిజ్ఞాసువు, తిరిగి వేదములు, శాస్త్రములు, వాటిలో ఉన్న కర్మకాండల వంక చూడకుండా, కేవలము పరమాత్మను తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతడు పూర్వజన్మలో ఈ కర్మకాండల స్థితిని దాటి, నిర్గుణపరబ్రహ్మను ఉపాసించే స్థితికి చేరుకున్నాడు. కాని కాలం తీరడం వలన మరణించాడు. మరుజన్మలో అతడు చెడు అలవాట్ల వైపు లాగబడకుండా, మరలా కర్మకాండల వంక, ప్రాపంచిక సుఖముల వంక పరుగెత్తకుండా, ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాడు. పరమ సుఖమును, శాంతిని పొందుతాడు. తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు. అటువంటి వాడికి మరుజన్మ ఉండదు.```


*45. వ శ్లోకము:*

*ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।*
*అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ॥45 ॥*

“ఈ ప్రకారంగా ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించే వాడు, తన పాపములను పోగొట్టుకుంటాడు. పరిశుద్దుడు అవుతాడు. తన పూర్వజన్మలలో చేసిన యోగాభ్యాసము వలన కలిగిన సంస్కారములతో అతడి యోగము సిద్ధిస్తుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు.”
```
తన పూర్వజన్మలలో పట్టుదలతో, ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించి, సిద్ధిపొందకుండానే దేహమును విడిచిపెట్టిన యోగి, మరుజన్మలో సకల పాపముల నుండి విముక్తి పొంది, పరిశుద్ధమనస్కుడై, శుద్ధసత్వగుణ సంపన్నుడై, నిరంతర అభ్యాసముతో యోగసిద్ధిని పొందుతాడు. తరువాత మోక్షమును పొందుతాడు.

కాబట్టి యోగ సిద్ధిని పొందడానికి మూడు ముఖ్యలక్షణములు కలిగి ఉండాలి. 
1. ప్రయత్నము, పట్టుదల, 
2. ⁠ అనేక జన్మలలో చేసిన అభ్యాసము, 
3. చేసిన పాపములు పోగొట్టుకోవడం, కొత్త పాపాలు చేయకపోవడం. 
కాబట్టి ఏకార్యము తలపెట్టినా దానికి పట్టుదల, ధృఢ సంకల్పము, అత్యవసరము. ఈ రెండు ఉంటే సాధారణమైన పనులే కాదు ఆధ్యాత్మిక కార్యములు కూడా చక్కగా సిద్ధిస్తాయి. పట్టుదల, ప్రయత్నం లేని వాడు ఏ కార్యము చేయలేడు. ఈ పట్టుదల ప్రయత్నము పూర్వ జన్మలలో చేసిన అభ్యాసం వలన కలుగుతుంది. మోక్షము పొందాలనే కోరిక, దాని మీద ఇష్టము కలుగుతాయి. అటువంటి యోగి మరుజన్మలో తన ప్రమేయం ఏమీ లేకుండానే ఆధ్యాత్మికత వైపుకు మళ్లుతాడు. నేరుగా యోగాభ్యాసము చేస్తాడు.

ఇదంతా విన్న తరువాత, మోక్షం కావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలో అని సందేహం రావచ్చు. పట్టుదల, ప్రయత్నము, అభ్యాసము ఇవి చక్కగా ఉంటే ఒకటి రెండు జన్మలలోనే మోక్షస్థితిని పొందవచ్చు. దీని కన్నా ముందు ఇంతవరకు మనం తెలిసో తెలియకో చేసిన పాపములను పోగొట్టుకోవాలి. ఇది ధ్యానము, నిష్కామకర్మలు, భక్తి వీటి వలన సాధ్యం అవుతుంది. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. ధ్యానం కుదురుతుంది. ఇదంతా చేస్తే వచ్చే ఫలితము ‘పరాంగతిమ్’ అని అన్నాడు పరమాత్మ, అంటే పరమ గతి. అంటే తిరిగి రాని స్థితి-పునర్జన్మ లేని స్థితి. జీవాత్మ పరమాత్మలో కలిసే స్థితి. బ్రహ్మానుభూతి. ఇవి అన్నీ పరమగతులే. వాటి కోసం మనం నిరంతరం ప్రయత్నించాలి.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment