Tuesday, October 21, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-180.
216d3;2010e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣0️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                    *భగవద్గీత*
                  ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*46. వ శ్లోకము:*

*”తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।*
*కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున” ॥46 ॥*

“ఓ అర్జునా! యోగాభ్యాసము చక్కగా చేసి సిద్ధి పొందిన వాడు, తపస్సు చేసేవారి కంటే, శాస్త్రములను అధ్యయనం చేసిన వారి కంటే, కర్మయోగమును అవలంబించిన వారి కంటే, అధికుడు అని చెప్పబడుతున్నాడు.
```
ఈ శ్లోకంలో యోగులు ఎన్ని విధాలుగా ఉంటారో చెప్పాడు పరమాత్మ. 

మొదటి తరగతి వారు తపస్సు చేసే వాళ్లు. అంటే దైవాన్ని సగుణోపాసన చేసే వాళ్లు. వీరు భక్తులు అని కూడా అనవచ్చు. 
రెండవ తరగతి వారు శాస్త్రములను చదవడం, వినడం, మననం చేయడం, మననం చేసిన దానిని చక్కగా అర్థం చేసుకోవడం, దాని ద్వారా జ్ఞానం సంపాదించడం. వీరిని జ్ఞానులు అని అంటారు. 
మూడవ తరగతి వారు కర్మిభ్యః అంటే యజ్ఞములు, యాగములు, క్రతువులు, వ్రతములు, పూజలు మొదలగు కర్మలు చేసేవాళ్లు. తరువాతి తరగతి వారు యోగులు. ఈ యోగులు ఎవరంటే, పైన చెప్పిన తరగతులు అన్నీ దాటి, వాటిలో చెప్పినవి అన్నీ చేసి, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము పాటించి, ధ్యానములో కూర్చుని, మనసును ఆత్మయందు నిలిపిన వాడు యోగి.      ఈ యోగి 
పైన చెప్పబడిన యోగులందరికంటే అధికుడు.

మనకు తపోధనులు, పండితులు, వేదములు, శాస్త్రములు అధ్యయనం చేసిన వారు, అగ్నిహోత్రము, యజ్ఞములు, యాగములు మొదలగు కర్మలు చేసినవారు, సాధారణంగా కనపడుతుంటారు. వీరందరి కంటే యోగి గొప్పవాడు. యోగి అంటే యోగమును అభ్యసించిన వాడు, యోగము అంటే ధ్యానయోగము, మనసును ఆత్మలో నిలపడం, ఆత్మదర్శనం చేయడం. ఆత్మానందాన్ని పొందడం. దీనినే యోగం అని తెలుసుకున్నాము. 
ఈ యోగము అవలంబించిన వాడే ఉత్తముడు, సర్వశ్రేష్టుడు. శ్రద్ధ, భక్తితో ధ్యానం చేసి, మనసును నిగ్రహించి ఆ మనసును ఆత్మలో లయం చేసే వాడే యోగి. వాడే అందరి కంటే గొప్పవాడు. అంటే తపస్సు చేసే తాపసులు, శాస్త్రములను అధ్యయనం చేసే జ్ఞానయోగులు, కర్మలను చేసే కర్మయోగులు తక్కువ వారు అని అర్థం కాదు. వీరిలో ఒకరికంటే ఒకరు గొప్పవారు. కర్మ, జ్ఞానము, తపస్సు, వీటి కంటే ధ్యానము, ఆత్మదర్శనము చేసినయోగి మోక్షానికి దగ్గరగా ఉంటాడు అని భావము. అంతే కానీ అవేమీ తక్కువ కాదు. చేయకూడనివి కాదు.

ఇదంతా చెప్పిన తరువాత కృష్ణుడు అర్జునుడికి ఒక ఉచిత సలహా ఇచ్చాడు…
‘తస్మాత్ యోగీ భవ అర్జున’ అంటే "ఓ అర్జునా! నువ్వు కూడా యోగం చెయ్యి యోగివి కా! బాగుపడతావు" అని అర్జునుడికి చెప్పాడు. 
దీని అర్ధం యుద్ధం మానేసి యోగం చేయమని కాదు. ఆత్మజ్ఞానమును సంపాదించు. నీవు వేరు ఈ శరీరము వేరు. ఈ శరీరం కొరకు చింతించకు. ఆత్మదర్శనం చెయ్యి. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. దాని ఫలం గురించి ఆలోచించకు అని బోధించాడు.

ఈవిషయం కృష్ణుడు మనందరికీ చెప్పినట్టు భావించాలి. యోగి అంటే ఎవరో యోగము అంటే ఏమిటో దానిని ఆచరిస్తే ఏమవుతుందో, ఆచరించకపోతే ఏమవుతుందో, ప్రాపంచిక విషయముల నుండి ముక్తి పొందడానికి ధ్యానయోగము ఎలా ఉపయోగపడుతుందో అనే విషయాలను కృష్ణుడు మనకు వివరంగా చెప్పి మనల నందరినీ యోగాభ్యాసము అంటే ధ్యానయోగము అవలంబించమని సూచించాడు. 

యోగులు అంటే కాషాయాలు ధరించి, జడలు కట్టుకొని దండం పట్టుకొని ఊళ్లమ్మట తిరగడమో లేక మఠాలు స్థాపించడమో కాదు. ఎవరైనా ఎక్కడైనా, ఇంట్లో నైనా ఎక్కడైనా యోగము చేయవచ్చును. ఆత్మదర్శనం పొందవచ్చు అని నిరూపించాడు కృష్ణుడు. 
మనస్సును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మలో స్థిరంగా ఉంచడమే యోగము అని వివరంగా చెప్పాడు. నిరతంరము భగవంతుని మననం చేయువాడే యోగి అని చెప్పాడు. కాబట్టి ఆ యోగమును ఆచరించడం మన ధర్మం.```


*47. వ శ్లోకము:*

*”యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా ।*
*శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః” ॥ 47 ॥*


“తపస్సు చేసే వారు, జ్ఞానము సంపాదించిన వారు, కర్మలు చేసే వారి కంటే యోగి ఉత్తముడు అని చెప్పిన తరువాత, ఆ యోగులందరిలో పరమాత్మ యందు మనస్సు నిలిపి నిరంతరం పరమాత్మను శ్రద్ధతో ధ్యానించేవాడు ఆ యోగులందరి కంటే యుక్తులందరి కంటే ఉత్తముడు.”
```
ఇది ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. ఈ అధ్యాయం సారం ఇందులో ఇమిడ్చాడు. సకల యోగులలో కల్లా నా యందు మనసు నిలిపినవాడు, ఎల్లప్పుడూ నన్ను తలంచుకొనే వాడు, నన్ను మననం చేసేవాడు, శ్రద్ధతో, భక్తితో భజించేవాడు, అట్టివాడు యుక్తులలో ఉత్తముడు అని నా అభిప్రాయము. అంటే ఎవరంటే తనకు ఇష్టమో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేసాడు పరమాత్మ.

కృష్ణుడు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాడు. ఏ యోగము చేసినా ఏ కర్మ చేసినా శ్రద్ధ, భక్తి   ఈ రెండు ముఖ్యము.

కాబట్టి ఎవరైతే ధ్యానయోగమును శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో, వారే నాకు ఇష్టులు, యుక్తతములు అని పరమాత్మ చెప్పాడు. ఇంకా పరమాత్మ ‘మద్గతేనాన్తరాత్మనా’ అని స్పష్టంగా చెప్పాడు. ‘మద్గతేన’ అంటే నీ మనసును నాలో నిలుపు, నా యందు నిలుపు. అంటే ముందు నన్ను అంటే కృష్ణుడిని సగుణోపాసన చేసి అంటే విగ్రహ రూపంలో పూజించి తరువాత నిర్గుణోపాసనలోకి వెళ్లాలి. ధ్యానయోగం ద్వారా మనసును ఆత్మయందు నిలుపాలి. అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. అంతర్లీనంగా నిరంతరం నా యందు భక్తి కలిగి ఉండు అని చెబుతున్నాడు కృష్ణుడు.

చేసేది పూజ అయినా, తపస్సు అయినా, ధ్యానం అయినా, యజ్ఞయాగములు, వ్రతాలు క్రతువులు అయినా, ఏది చేసినా నాయందు భక్తితో శ్రద్ధతో చెయ్యి. వాటి ఫలితములు నాకు అర్పించు. మనసును నిర్మలంగా ఉంచుకో. నిశ్చింతగాఉండు. ఇదే పరమాత్మ బోధ, (మానవులు అన్నీ చేస్తారు కానీ మైనస్ భక్తి, శ్రద్ధ. ఈ రెండూ తప్ప అన్నీ ఉంటాయి).

ఈ బోధలో చెప్పిన విషయములను మరొక సారి స్మరించుకుందాము, శ్రద్ధ, భక్తి, పట్టుదల, ఏకాగ్రత, మనసును నిర్మలంగా ఉంచుకోవడం, ఆ నిర్మల మనస్సును కృష్ణుని యందు లగ్నం చేయడం, కృష్ణుని నిరంతరం ధ్యానించడం. ఇలా చేస్తే కృష్ణుడు ఇష్టపడతాడు. వాడే యోగులలో ఉత్తముడు. ఇది నా మతము. నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పినపుడు, మనం వాటిని పాటించక తప్పదు. కాబట్టి, మనందరం పైన చెప్పిన లక్షణములను పాటించి భగవంతుని కృపకు పాత్రులు అవుదాము. దీనితో ఆత్మ సంయమ యోగము అను ఆరవ అధ్యాయము సంపూర్ణము.

ఉపనిషత్తులయొక్క, బ్రహ్మవిద్యయొక్క,
యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో,
ఆత్మసంయమ యోగము అను ఆరవ అధ్యాయము సంపూర్ణము. ✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment