256వ భాగం
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకము 44
ముముక్షోబుద్ధిరాలంభం అంతరేణ న విద్యతే|
నిరాలంబైవ నిష్కామా బుద్ధుర్ముక్తస్య సర్వదా||
ముక్తిని కాంక్షించే సాధకుని బుద్ధి ఏదో ఒక ఆధారాన్ని ఆశ్రయించే పని చేస్తూ ఉంటుంది .కోరికలే లేని జీవన్ముక్తిని బుద్ధికి ఆధారం అవసరమూ లేదు. అక్కడ నిత్యముక్త భావరూపమైన ఆనందం సర్వదా ఉంటుంది.
సాధన ప్రథమ దశలో మముక్షత్వము అత్యవసరము. ఇది మహాశక్తివంతమైనది కూడా. ముముక్షుత్వం ఎంత తీవ్రంగా ఉంటే అంతగా సాధకుడు ధ్యానాది నియమాలతో మనసును ఏకాగ్రం చేస్తూ అట్టి మనసుతో శాస్త్ర అధ్యయనము చేస్తూ అర్థము చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈ సాధన ఒక ప్రత్యేక దశకు చేరిన తర్వాత ఈ ముముక్షత్వము కూడా బంధమై మనోబుద్దులను బంధిస్తుందని మహర్షి ఎక్కడ హెచ్చరిస్తున్నారు. ముక్తిని కోరుతున్నాడు అంటే ఇంకా ఆత్మానుభవము లేనట్లే. అంటే ఇంకా అహంకారంగా మిగిలి ఉన్నట్టే. అహంకారం ఉన్నంతసేపే విషయీ విషయ సంబంధంగా పరస్పర ఆధారంగా ద్వైతమైన సర్వ జగత్తు ఉండనే ఉంటుంది. అహంకారముతో ముక్తిని కోరేవాడు అహంకార స్వభావానుగుణంగా ఆత్మను కూడా విషయంగా దర్శించాలి అనుకుంటాడు. ఆత్మ తన కంటే భిన్నంగా ఉందని తనకు తెలియకుండానే భ్రమ పడుతూ ఉంటాడు.
జీవన్ముక్తుని బుద్ధిలో ఈ కోరిక కూడా (ముముక్షత్వం)అంతరించటంతో అహంకారానికి ఆధారం ఏమీ ఉండదు. అతడు కేవలం ఆత్మగా తనను తాను సర్వదా తెలుసుకుంటూ ఉంటాడు.
ఆత్మ గురించి మనం ధ్యానించవచ్చు .కానీ ధ్యాన ఫలము మాత్రం ఆత్మానుభవమే. ఆ అనుభవములో అనుభవించే వ్యక్తి అనుభవింపబడే ప్రపంచము అని వేరుగా ఉండవు. ఆత్మా అనుభవం రావటము అంటే తాను ఆత్మగా ఉండటమే . స్వప్నాన్ని చూసేవాడు జాగ్రత్తలోనికి రాగానే జాగృతుడే అవుతాడు.🙏🙏🙏
No comments:
Post a Comment