Friday, October 24, 2025

 257 వ బాగం 
🕉️ అష్టావక్ర గీత🕉️ 
అధ్యాయము 18 
శ్లోకము 45

విషయ ద్వీపినో వీక్ష్య 
చకితాశ్శరణార్థినః|
విశంతి ఝటితి క్రోడన్ 
నిరోధకైగ్రసిద్ధయే||

విషయ భోగాలు అనబడే పులుల దాటికి తాళలేక భయభ్రాంతులైన వారు బుద్ధి గుహలోనికి చొరబడి మనసుని ఏకాగ్రం చేసి నిరోధించాలని ప్రయత్నిస్తారు.

అహంకారం ఆధారంగా గల వ్యక్తి విషయాలను చూడకుండా ఉండలేడు .విషయాలను గుర్తించగల ఉపకరణమే మనస్సు, మనసుకు విషయాలే ఆహారం, విషయాలతోనే మనసు పెరుగుతూ జీవిస్తూ ఉంటుంది. విషయాలు మనసులోనికి ప్రవేశించి కోరికలు అనబడే జంఝూమారుతాలను లేవదేసి మనసును అశాంతి పాలు చేస్తాయి. అందుకే సాధకులు ప్రథమ దశలో విషయ భోగాల నుండి మనసును మళ్లించవలసి ఉంటుంది. ఇందుకు భగవద్భక్తి ఎంతగానో సహాయపడుతుంది. భగవంతుని స్మరిస్తూ బుద్ధి గుహలో తలదాచుకుంటారు .అంటే వివేకముతో విషయాల నుండి దూరంగా ఉంటారు. బాహ్య విషయాలు కలిగించే ఉద్రేఖాలకు అశాంతికి దూరంగా ఉండాలంటే మనసును విషయాల సంబంధం నుండి విముక్తము చేసి ఉన్నత లక్ష్యం వైపు మళ్ళించాలి. సాధన ప్రథమ దశలో సాధకులకు ఇంతకంటే వేరు మార్గం లేదనడంలో ఎంత మాత్రము సందేహం లేదు. 

మనస్సంయమనము సాధించిన సాధకులకే ఇక్కడ మహర్షి సలహా ఇస్తున్నారు. జీవన్ముక్తులు విషయాలను చూచి ఎంత మాత్రం భయపడరు. బుద్ధి గుహలో తలదాచుకోవాల్సిన అవసరం వారికి లేదు. ఆత్మవినా రెండవదేదీ వారికి కనపడకపోవడమే ఇందుకు కారణము. బృహదారణ్య కోపనిషత్తు ఈ విషయాన్ని ఇలా ఘౌషిస్తుంది.."ద్వితీయాత్ వై భయం భవతి"... రెండవది కనిపిస్తే భయం ఉండి తీరుతుంది. 

సాధన ప్రథమ దశలో ఈ సూచన పరస్పర విరుద్ధంగా కనిపించక తప్పదు .అర్థహితంగా అనిపించనూవచ్చు. ప్రాపంచిక విషయాలను చూసేది ,చూపించేది మనసే ,మరలా ఈ మనసే వాటి వెంబడి పిచ్చి పరుగులు తీస్తూ ఉంటుంది. అందుకే మనసును శరణు వేడి శాంతిని సాధించాలి అనుకోవడం మన అంతట మనమే విషయ భోగాలు అనబడే పులుల నోట్లో తలపెట్టటం వంటిది. క్లుప్తంగా చెప్పాలంటే మనసుతో ఎంత ప్రయత్నించినా శాంతి గగన కుసుమమే. ఎండమావిలోని జలము వంటిదే .అందుకే మనసులో మనసుతో ఎంత దూరము ప్రయత్నించినా అది వ్యర్థమే. మనసుతో ప్రయత్నించకుండా మనసు నదిగమించటమే సరైన మార్గం. అప్పుడు మాత్రమే మనః కల్పిత బంధాల నుండి ముక్తి లభించగలదు.🙏🙏🙏   

No comments:

Post a Comment