Saturday, October 25, 2025

 259 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 47

న ముక్తికారికాన్ దత్తే నిశ్శంకో యుక్త మానసః|
పశ్శన్సృణ్వన్స్పృశన్ జిఘ్రన్నశ్నన్నాస్తే యధా సుఖం||

సందేహరహితుడై తన్నుతాను ఆత్మగా నిశ్చయంగా తెలుసుకున్న వ్యక్తి ముక్తి కోసము మనఃసంయమ రూపమైన ధ్యానం చేయాలని అనుకోడు. చూస్తూ వింటూ స్పృశిస్తూ వాసన చూస్తూ తింటూ ఆనందంగా జీవిస్తాడు. 

తాను ఆత్మననే ధృడ జ్ఞానము కలిగిన వ్యక్తి జీవన్ముక్తుడే. అతనిలో అహంకారముతో తాదాత్మ్యం చెందిన వ్యక్తిత్వం ఉండదు. కర్త అనుకునే అహంకారం కోరికలు లేకుండా అతనిచే చేయబడిన కర్మలు కొత్తగా అతనికి ఫలితాలను సంపాదించి పెట్టవు కొత్త వాసనలు సృష్టింపబడవు.

జీవన్ముక్తుని ఇంద్రియాలు వినడం చూడటం మొదలైన పనులను చేస్తున్న అవేవీ అతనికి చెందవు.ఆ కర్మలన్నీ ఆయా ఇంద్రియాలుకు చెందినవి మాత్రమే .జడమైన ఇంద్రియాలు చైతన్యం సన్నిధిలో చలిస్తూ ఉంటాయి .ఆ చైతన్యమే తానుగా తెలుసుకున్న జ్ఞానిని ఈ కర్మలేవి బంధించజాలవు.సూర్యుని వేడిమితో నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ మేఘాలు నీటిని వర్షిస్తాయి. ఆ నీరు సూర్యుని తడపగలదా? సూర్యుడు వర్షాన్ని కురిపించాడు అని అనగలమా? అయినా సూర్యుడు లేకుండా వర్షం పడజాలదు .ఇదేవిధంగా జీవన్ముక్తుని సన్నిధిలో శరీరం పనిచేస్తున్న ఆ కర్మలేవి అతనిని స్పృశించలేవు. అతడు శరీరంలో లేడు శరీరమే అతనిలో( చైతన్యంలో )ఉంది.🙏🙏🙏

No comments:

Post a Comment