విశాలాక్షి మాసపత్రిక (అక్టోబర్ 25)లో నా సాహిత్య వ్యాసం.....కొత్వాలు అమరేంద్ర
###################
అక్షరాల్లో ఆమని
ప్రకృతికి ఎన్నెన్నో సౌందర్యాలను తొడుగుతూ మానవప్రకృతికీ అండగా వుండి మనిషి జీవితాన్ని సేదదీర్చే ఒక ఆశాపవనం ఆమని. అతని బతుకుకు భరోసా కల్పించే ఒక ఆలంబన చైత్రం. ఎందుకంటే ఎన్నెన్ని శిశిరాలు, హేమంతాలు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్నా బాధలపగుళ్లతో మోడువారిన అతని జీవితానికి మళ్లీమళ్లీ ఆశలచిగుళ్లను తొడుగుతూనేవుంటుంది వసంతం. ఎన్నెన్నో ఆశల్నీ, ఆశయాల్నీ నింపుకున్న దరహసంతో అలరించే ఆహ్లాద రుతువు అది. ప్రకృతిపాలిట ఆనందక్రతువు. అందుకే ఆ రుతువు అందాన్నీ, ఆనందాన్నీ తనలో వొంపుకునే అక్షరం ఆమని కవిత్వమై పరవశింపజేస్తుంది. వసుధైక పూలరుతువు ఆగమనం కోసం సౌభ్రాతృత్వపు మేఘాలరాగాలై పరవళ్లు తొక్కుతూ గుండెగుండెకూ ప్రపహించాలని ఆ కవిత్వం తపిస్తుంది. మన హృదయాలనిండా చిగురించే సామరస్యపు పచ్చదనం జీవనోద్యాలనిండా విస్తరించాలని అది ఉవ్విళ్లూరుతుంది.
సౌందర్యప్రవాహమై....
ఒక సౌందర్యప్రవాహం ఆమని... శిశిరవేదనల భారంతో నిండిపోతున్న జీవితం చెట్టులో ఆశాసుమాల్ని విరబూయించే సంకల్పం ఆమని. అందుకే అది తన కోసం మనిషి నిరీక్షణాభారాన్ని పెంచుతూనేవుంటుంది. ఆమని, దానికి తోడు కోయిల... ఈ రెండూ కవితావైభవాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి. అక్షరం ఈ రెండింటీకీ పెద్దపీట వేసింది. ఉగాది వస్తేచాలు ఆమని కవిత్వం జాతరై ప్రవహిస్తుంది. మనుషుల మధ్య ఆత్మీయతావారధుల్ని నిర్మిస్తుంది. సమ్మేళనాలు అక్షరాల పండుగ చేసుకుంటాయి. ఆ కవిత్వం ప్రకృతి దృశ్యాల్నీ, మనిషి ఆనంద భావోద్వేగాల్నీ విభిన్న పార్శ్వాల్లో దర్శింపజేస్తుంటుంది. అందుకే వాసంతసమీరం స్పర్శ కోసం మనిషి తహతహలాడిపోతాడు. ‘ఈ వసంతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాను. భూమిమీద వెలిగించిన పచ్చని నిప్పుల ఈ మంట..పెరుగుతున్న ఈ జ్వాల... ఈ వసంతదహనంలో నా ఆత్మ జ్వాలలగుంపులో కొట్టుకుపొయిన నీడలా, తప్పిపోయిన నీడలా ఎగిరిపోతోంది’ అంటూ పాశ్చ్యాత్య కవి డి.హెచ్. లారెన్స్ వసంతసౌందర్యపు ఉధృతిని నిప్పుతో పోలుస్తాడు. ఆ నిప్పులో తన మనసు ఎలా ఉబ్బితబ్బిబ్బవుతోందో వర్ణిస్తాడు. ‘వసంతకాలంలో ఒక కాంతి వుంటుంది. సంవత్సరంలో లేదు. మరే ఇతరకాలంలో నైనా’ అంటూ ఎమిలీ డికెన్సన్ వసంతరుతువు ప్రత్యేకతను వివరిస్తాడు. ‘మీరు వెళ్లాలన్న చోటుకే వెళ్లాలని దయచేసి పట్టుబట్టకండి/వసంతం దగ్గరికి వెళ్లే మార్గం గురించి మాత్రం/ఇక్కడ విరబూసిన గుండెల్ని అడగండి అంటూ వసంతానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో చెబుతూ వసంతానికి విప్పారే మనసుల గురించి ప్రస్తావిస్తాడు జలాలుద్దీన్ మహమ్మద్ రూమీ. పదికాలాలపాటు అజరామరమయ్యేది మంచికవిత్వం. అలాంటి కవిత్వాన్ని వసంతంతో పోలుస్తాడు విశ్వకవి రవీంద్రనాథఠాగుర్. ఒక కవి రాసిన కవిత్వం పట్ల వందసంవత్సరాల తరువాత పాఠకుడి అనుభూతి ఎలావుండాలో ఆ అనుభూతిని వసంతకాలంతో అనుసంధానిస్తూ ఠాగూర్ 1893లో రాసిన కవిత సాగుతుందిలా... ‘వంద సంవత్సరాల తర్వాత/మీ చుట్టూ పాటలై వినిపించే/ఆ సుకవి ఎవ్వరో/ఆ కవికి నా ఈ వసంతపు ఆనంద అభినందనలు/నా ఈ వసంతదినపు ధ్వనులనీ/తేనెటీగల ఆటలనీ/చిగురుటాకు గుసగుసలనీ మీ హృదయంలో ప్రతిధ్వనించనీయండి’ ....ఈ వాక్యాలు కవి అజరామరత్వానికి నిదర్శనాలు. మనిషి గతకాలపు నోస్టాల్జియాలోని ఆనందపు గడియల్ని వసంతంలో సంలీనం చేస్తాడు దేవరకొండ బాలగంగాధరతిలక్. ‘నీతులు, నియమాలు, తాపత్రయాల కత్తులబోనులో/నిలిచినిలిచి తిరిగే ఎలుగుబంటి వంటి మనం/డేగలాంటి ఆ చూపుని, ఆ విసుగుని, ఆ ఎత్తుని, మబ్బులాంటి ఆ పొగరుని, వర్గసామీప్యాన్నీ/తిరిగి పొందలేమనే సంగతి నాకు తెలుసు/ కాని నేటి హేమంత శైత్యానికి గడ్డకట్టుకున్న నా వెనుక/నాటి వాసంత విహారాల జాడలున్నాయన్న/తృప్తి మిగిలి/ఒక జీవకణమైనా రగిలి/శాంతిని పొందుతుంది నా మనసు(ఆరోజులు)... మనిషి దైనందిన మానసికస్థితికి అద్దం పడుతున్నాయీ కవితావాక్యాలు. పూలు నిట్టూర్పులు విడుస్తున్న రతువుగా వసంతాన్ని అభివర్ణించిన గుంటూరు శేషేంధ్రశర్మ ‘చైత్రమాసపు గాలి వీచిందో లేదో/చెట్లన్నీ పూయడానికే నిర్ణయించుకున్నాయి/పూలు పెదవులు విప్పాయి/ పుప్పొడి రహస్యాలను వినిపించడానికి/ఇప్పుడు ప్రతిచెట్టూ ఒక దేవాలయం/ పక్షులన్నీ ఎగిరే దేవతలు/ కొమ్మకొమ్మలో పాటలపోటీలు/గడ్డిపోచలో గంధర్వలోకాలు(ఆధునిక మహాభారతం) అంటూ వసంతవైభవాన్ని కవిత్వీకరిస్తాడు.
వసంతంలో తల్లిప్రేమ
‘మావిళ్లు సిగురేసి మారాకు తొడిగె/మంచుతెమ్మెర కరిగి శిశిర వెనుకకు జరిగె/కడకు మూడేసి కాయలుగాయ/తనువొంచి పాలిచ్చుతల్లిలా చందం/కొమ్మలన్నీ వంగి అమ్మప్రేమను చాటె/రావె మా చైత్రమా అలరించే పదచిత్రమా’ అంటూ గోరేటి వెంకన్న మాండలిక పదనుడికారంతో వసంతాన్ని వర్ణిస్తూ ఆ వసంతంలో తల్లిప్రేమను దర్శిస్తాడు. ‘పన్నెండు నెలల వయసు పూర్తిచేసుకొని/నేలరాలిపోయిన ఆకులస్థానంలో/కొత్తచిగుళ్ల కోకలను సింగారించుకొని సిగ్గులొలికే చెట్ల వయ్యారం వసంతం... భుమిపైన శ్వాసించే ప్రతిజీవీ జీవనజలనిధిలో ఆనంద అలలతో పరవశించే ప్రకృతి వయ్యారాల జాతర వసంతం’(ప్రకృతి జాతర) అంటూ డాక్టర్ వి. ఆర్. రాసాని కొత్తచిగుళ్ల చీరల అందాలతో అలరించే స్త్రీ వయ్యారాన్ని చెట్టుతో సంలీనం చేస్తూ, ఆ వయ్యారాన్ని సమస్త సృష్టినే అలరించే ఆమనితో పాలుస్తాడు. ‘కొకిలమ్మ, పిచ్చుకకూ మధ్య సంభషణ/చైత్రానికీ, చిగురాకుకూ మధ్య తీయని సంగమం కవిత్వం’ అంటూ అరుణ నారదభట్ల కవిత్వాన్ని చైత్రంతో పోలుస్తుంది. ‘నా మనసే ఓ వసంతం/అది విరబూస్తుంది ప్రతినిత్యం/నిరంతరపూలపరిమళాలను ఆఘ్రాణిస్తూ సాగిపోతుందలా/కొత్త చిగుళ్లను తొడుగుతూ... ఇక్కడ అంతా సృజనాత్మకమే/శిశిరాలకు తావులేదిక్కడ/శిథిలవ్యథల తలపులకు చేటే లేదు’ అంటూ పెద్దాడ సత్యప్రసాద్ అనంతమైన ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని నిత్యవసంతం చేసుకోవాలంటాడు. ‘ఇక నువ్వు వచ్చేస్తున్నావనగానే/గూడు కట్టేందుకు/గడ్డిపరకను వెతికే పిచ్చుకలా/లోపలా బయటా హడావిడి అంతానాదే... కానీ బయట కొమ్మకు పొటమరిస్తున్న చిగురును/చూడగానే తెలుస్తుంది/నీరాక నాకన్నా దానికే బాగా తెలుసునని’(వసంతం) అంటూ కోగంటి విజయ్ వసంతాగమనం నాటి తన భావోద్వేగాన్ని పొటమరించే ఆశలాంటి చిగురుతో అనుసంధానం చేస్తాడు. ‘వసంతమంటే చిగురుకరవాలమెత్తి/శిశిరపు శిరస్సుని నరికినట్టు/ వనం మేనంతా హరితవస్త్రం కప్పినట్టు’ అంటూ వీరవెంకటరాజా వసంతానికి వీరత్వాన్ని ఆపాదిస్తాడు.
పద్యంలో చైత్రం
పద్యం అధిష్టించిన రామాయణ, మహాభారత తదితర కావ్యాలు, ప్రబంధాలెన్నో వసంత వర్ణనకు ప్రాదాన్యతనిచ్చాయి. వసంతరుతువులోనే శ్రీరాముడు జన్మించినందున వాల్మీకి రామాయణం వసంతవర్ణనకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. కిష్కింధాకాండలోని మొదటి సర్గలో దాదాపు అరవైశ్లోకాల్లో వసంతవర్ణన కనిపిస్తుంది. సీతావియోగంతో, ఆమె జ్ఞాపకాలతో దుఃఖితుడయ్యే రాముడిపై ప్రపంచానికే ఆహ్లాదం కలిగించే వసంతరుతుప్రభావం కనిపించని స్థితి పద్యమైందిలా... ‘పలు విహంగముల, నదాల వనమె మెరసె/వచ్చె నవవసంతరుతువు చూడు/సీత లేకుండ నేనుంటి చింతతోడ/హృదియు నేడాయె సౌమిత్రి వ్యధలమయము’... పరిపాలనాదక్షుడిగానే కాకుండా సాహితీసార్వభౌమునిగానూ పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో చేసిన వసంత వర్ణన సాగుతుందిలా... ‘కినిసి వలరేడు దండెత్తకేతువగుట/మీనమిలతోచుటుచితంబ మేషమేమి/ పనియనగలనేల/విరహాఖ్యపాంథ్యయువతి/దాహమునకగ్గిరాగతత్తడియురాదె’... వలరేడు అయిన మన్మథుడు వసంతరుతువు వస్తే మన్మథుడు శరీరాలను, మనసులను దహనమనే విరహతాపానికి గురిచేస్తుంటాడు. అతడి జెండా గుర్తు మీనం కనుక అతడు వచ్చే రథంతోబాటు మీనమూ వస్తుంది. అగ్నిదేవుడు మేష(మేక) వాహనుడు కనుక విరహాగ్నిరూపంలో గోదాదేవిని దహించడానికి మేకపై వస్తాడు. ఇక్కడ మీనమాసం, మేషమాసం రెండూ కలిపి వసంతమాసం అవుతుందని కవిభావన.
ప్రణయానికి ప్రతీకగా...
భావకవులు వసంతాన్ని ప్రణయానికి ప్రతీక చేశారు. ఆ వసంతమొలికించే హొయల్ని పద్యాలుగా మలిచారు. ‘నా బ్రతుకు నేడు నందనచైత్రవనమౌనో/ప్రాభాతగగనపూర్వప్రాంగణమౌనో/చెరతొలగు జీవమో/మరాపు విలుతేజమో... విడని వాసనపదములు విలులెయయ్యె/ఆసనమ్ముననశ్రులే యారవయ్యె/ నిలిచినాడ నేటికి కూడ వసంత/కాలపుప్రబాత తరుణ వృక్షము కరణి’... అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ఊర్వశి’ కావ్యంలో కథానాయకుని జీవితంలోకి ఊర్వశి చైత్రంలా ప్రవేశించడాన్ని వర్ణిస్తూ అతడి ప్రణయభావనల్ని ఆమనితో అనుసంధానిస్తాడు. ప్రముఖ హిందీకవి ఫైజ్ అహ్మద్ ఫైజే జైలుగోడల మధ్య తానురాసుకున్న ప్రేమలేఖలో ప్రియురాలి తలపును వసంతంతో అనుసంధానిస్తాడిలా... ‘వో గాలీ వసంతకాలపు శుభాకాంక్షలు తెలియజేయి/నేను ఈ తోటను వదిలి పంజరానికి వెళ్లిపోతున్నాను/ఈ వసంతమాసపు గాలి/జైలులో వున్నవాళ్లని మరింతగా ఇబ్బింది పెడుతుంది/గుండెమీద కత్తి పెట్టినట్టుగా/యీరోజు గాలిలో ఏదో ఉన్మాదం వుంది/బహుశా బయటిప్రపంచం వసంతరుతువుదేమో/ఈ వసంతం ఉదాసీనతను చూసినప్పుడు/నేను నా హృదయంలో వొక తోటనే సృష్టించుకున్నాను’... ఈ కవితావాక్యాలు కవి లోపలి ప్రపంచాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
అస్తిత్వానికి ప్రతిరూపంగా....
సంక్షుభితసమాజంలో ఇప్పుడు మనిషి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం, అస్తిత్వం కోసం అన్వేషించడం ఒక ప్రధాన సమస్య అయింది. అందుకే వసంతం అస్తిత్వానికీ ప్రతీక అయింది. మయన్మార్ దేశంలో కొన్నాళ్లుగా కవుల, కళాకారుల స్వేచ్ఛను హరించేవిధంగా వారిపై సైనికదళం జరిపే దాడికి నిరసనగా, రోహ్యంగా తెగమీద కొన్ని ఆధిపత్య తెగల అమానుషత్వానికి నిరసనగా ‘శీతాకాలపు పువ్వులు మీపై కోపంగా వుంటాయి/రుతుపవనాల జలాలు మిమ్మల్ని ముంచెత్తుతాయి/న్యాయమైన కారణం కోసం/మారక్తాన్ని ధారలుగా చిందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం/ఇకపై మా వసంతాన్ని యెవర్నీ తాకనిచ్చే ప్రసక్తే లేదు’ అంటాడొక స్థానిక కవి. పురుషాహంకార సమాజం సృష్టించే హలాహలాన్ని బలవంతంగా నింపుకొని పైకి మాత్రం వాసంతసమీరంలా కనిపించే ఒక స్త్రీమూర్తి వేదనను ‘హలాహలాన్ని కుత్తుకబాటీగా నింపకొని/దావానలాన్ని గుండెల నిండుగా కుదుపుకొని/ వదనంలో వసంతాలు పూయిస్తుంది/కనులలో కారుణ్య పలికిస్తుంది(ఆమె) అని వర్ణిస్తుంది వర్తమాన కవయిత్రి సి. వేదవతి. వసంతంలో చిగుళ్ల రుచిచూస్తూ కోయిల కమ్మని రాగాల్ని ఆలపించే మధురమైన ఘట్టాన్నివిషాదంగా మార్చివేసి సామాజిక దౌష్ట్యంతో సంలీనం చేస్తూ జావేద్ మైనారిటీ స్త్రీవాద కవిత్వాన్ని వినిపిస్తాడిలా... ‘భ్రూణహత్య గావింపబడుతున్న నా పాపల్లారా/నామీద ఆగ్రహించకండి/ఇక్కడ పిట్టగానైనా పుట్టవద్దు/గాలి మిమ్మల్ని గాయం చేస్తుంది/కాకుల మధ్య కోయిలగొంతు ఎత్తవద్దు/చివుళ్లు విషం నింపుకుంటాయి/ ఎప్పటికీ పుట్టకుండా చేసుకోవడమే/నేను మీకిచ్చే కానుక... ఈ కవితావాక్యాలలో కవి మెజారిటీమత దౌష్ట్యాన్ని నిరసించడం కనిపిస్తుంది. పిట్టకు స్వేచ్ఛగా ఎగరడానికి సహకరించవలసిన గాలి దానికి ఆటంకాలు కలిగించడం గురించి చెబుతాడు.
కోయిల రాగాలతో జతకట్టి....
ఆమనితో జతకట్టి ఆటపాటలాడే కవిత్వం దానికి అనుంగు నేస్తమైన కోయిలతోనూ జతకట్టింది. కోయిల రాగాల వైభవాన్ని వినిపించింది. ‘నల్లని రెక్కల అందగాడు/కొన్ని పాటలను పట్టుకొచ్చి రికామిగా తిరిగి/ పూలగుత్తులతో నిండిన బుట్టవలెచెట్టుమీద వాలి/తొలకరి పాలు బట్టిన చన్నులై/బరువుగా మెత్తగా నేలకు వాలాయి/చెట్టు మొదలంతా తేనెరాలింది’(తేనె పట్టిన కాలం) అంటూ గుండ్ల వెంకటనారాయణ కోయిల పాటలతో చెట్టు పులకించిపోయే వైనాన్ని వర్ణిస్తాడు. ‘అది నేను దాటివచ్చిన ఏ అడవుల్లోంచో/దూసుకొచ్చిన శరం లాగా నన్ను గుచ్చుకుంటూ వున్నది/నా చిన్ననాటి స్నేహితుడెవ్వరో/మావూరునుంచి బిగ్గరగా పిలుస్తున్నట్టు నన్ను కుదిపేస్తున్నది/వేదనామయజగత్తులో ప్రార్థనలాగా వినిపిస్తున్నది దానిపలుకు’ అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు కోకిల ఆగమనాన్ని ఆధ్యాత్మికం చేస్తాడు. వేదనలో కొట్టుకులాడే మనసును సేదదీర్చే ప్రార్థనతో కోయిల కూజితాన్ని పోలుస్తాడు. కోకిల రాగాన్ని మానవజీవితానికి ఆదర్శం బోధించేదిగా పేర్కొంటూ అడిగాపుల వెంకటరత్నం ‘కోకిల రాగం ఎత్తుకుంది/రాయి కరిగింది/చెట్టు చిగురించింది/మనసు ఓలలాడింది/పొగడ్తలు ప్రశంసలు కోకిలకు పట్టవు/పాటలో ప్రయాణిస్తూ/బాటసారిలా ప్రతిధ్వనిస్తూ/డులకు సౌశీల్యమై, సందేశమై(కోకిల రాగం ఎత్తుకుంది) అంటూ కోకిల పాట ప్రత్యేకతను వివరిస్తూ నిస్వార్థంగా మనిషిని ఆహ్లాదపరుస్తూ అది మనిషికి అందించే సందేశాన్ని వినిపిస్తాడు. ఆశలరెక్కలు కట్టుకొని వెయ్యికళ్లతో చూసే ఎదురుచూపులను వసంతాలతో పోలుస్తుంది వర్తమాన కవయిత్రి స్వాతి శ్రీపాద. ‘చీకటిదే రాజ్యం కాదు/శిశిరాన్ని కాలం తాకట్టుపెట్టుకోలేదు/కాస్త ముందో వెనుకో సహనం వికసిస్తుంది/వెయ్యివసంతాలుగా ఎదురుచూపులు/ఎడారి ఎండమావులు కావు/ఏనాటికైనా పల్లవించే ఒయాసిస్సులు/వసంతానని కాలం పల్లకిలో మోసుకువచ్చే బోయీలు’(ఎదురుచూస్తూ) అంటూ బతుకుఎడారిలో ఆగమించే ఒయాసిస్సు లాంటి వసంతం కోసం నిరీక్షిస్తుంది.
వాసంత సొబగులతో అక్షరాలకు వన్నెలద్ది ప్రకృతి కవనహృదయం నుంచి ఆమని కవిత్వాన్ని ఆవిర్భవింపజేస్తుంది. లోకానికి అది ఇచ్చే అపురూపకానుక. మనిషి హృదయంలో అది అవుతూనేవుంటుంది ఆనంద వేడుక. - డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,
No comments:
Post a Comment