Saturday, October 18, 2025

 మినీ కథ
*శీర్షిక : నిర్ణయం*

రచన: దేవులపల్లి దుర్గాప్రసాద్

"నాతో వస్తావా!?"
 
"ఎంత దూరం!?" 

"నువ్వు నడవగలిగేనంత"

"సరే వస్తాను."
*******************

"అబ్బా, ఇంకెంత దూరం? నడవలేక పోతున్నాను." 

"సరే. రాలేక పోతే వెనక్కెళిపో." 

"ఇప్పుడా, తీరా ఇంతదూరం వచ్చేసిన తర్వాతా!? నడిచి వెనక్కి వెళ్ళలేను. ఆటోలు కూడా దొరికేట్టు లేవు."

"అదంతా నువ్వు నాతో రాకముందే నిర్ణయించుకోవాలి." 

"నాన్నా ఇదన్యాయం. నువ్వు నడవగలిగేనంతే అన్నారు!?"

"మార్కెటింగ్ లో పి.జి. చేసావు రమ్యా, నీకు మార్కెటింగ్ మోసాల గురించి తెలియకపోతే ఎలా!?"
అన్నాడు నవ్వుతూ.

"అది ప్రొఫెషన్. ఇది జీవితం." 

"మోసం ఎక్కడైనా జరగొచ్చు. నడక్కే కాదు. జీవితంలో కూడా. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు వెనక్కి రాలేని పరిస్థితులు రావచ్చు."

"నువ్వు చెప్తున్నది నా లవర్ రమేష్ తో నా జీవితం ముడి పడడం గురించేకదా నాన్నా!?"

"అన్నీ తెలుసునని నువ్వనుకుంటావు కదా. రమ్యా, ఇదీ అలాగే అనుకో. నీ జీవితం నీ నిర్ణయం!!"

అంటూ వెనక్కి వెళుతున్న తండ్రి వెంట వెళ్తూ ఆలోచనలో పడింది రమ్య.

No comments:

Post a Comment