7️⃣7️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*31. యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవా:l*
*శ్రద్ధావన్తోఽనసూయన్తో ముచ్యన్తో తేఽపి కర్మభి:||*
ఎటువంటి అసూయ లేకుండా, పైన చెప్పబడిన తనకు నిర్దేశింపబడిన విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల యొక్క బంధనముల నుండి విముక్తిని పొందుతారు.
పరమాత్మ పై శ్లోకాలలో మానవుడు ఏమేమి విడిచిపెట్టాలి అని చెప్పాడు. అంటే నిష్కామ కర్మ ఎలా చెయ్యాలి అని చెప్పాడు. అలా చేస్తే కలిగే ఫలితం ఇక్కడ చెప్పాడు. కర్మయోగము ద్వారానే జ్ఞానము, జ్ఞానముతో కర్మ బంధనముల నుండి విముక్తి పొందవచ్చు అని చెప్పబడింది. అనాసక్తంగా, నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా, కర్మలు చేయడం ద్వారా, కర్మల ఫలములను పరమాత్మకు అర్పించడం ద్వారా, కర్మయోగులు కూడా జ్ఞాన యోగుల మాదిరి కర్మబంధనములను తొలగించుకోగలరు అని పరమాత్మ ఉద్దేశ్యము. దాని కోసం పైన ఒక సూత్రం చెప్పాడు. దానిని మతం అని అంటున్నాడు. యే మే మతం నాయొక్క అభిప్రాయము అనగా నిష్కామ కర్మ, కర్తృత్వభావన లేని కర్మ అనే నా అభిప్రాయమును అనుసరిస్తే ముక్తిని పొందగలరు.
ఈ అనుసరించడం కూడా నిత్యమ్ అంటున్నాడు. అంటే ఏదో ఒక సారి బుద్ధిపుట్టినప్పుడు కాకుండా అను నిత్యము అనుసరించాలి. నిత్యం అనుతిష్టన్తి అంటే ప్రతిరోజూ అనుష్టానం చెయ్యాలి. అంటే ప్రతి రోజూ మనం చేసే పనులు అన్నిటినీ ఫలితం ఆశించకుండా, మమతానురాగములు లేకుండా, ఈ కర్మను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే కానీ నాకుగా నేను చెయ్యడం లేదు అని అనుకుంటూ చెయ్యాలి. ఆ చేయడం కూడా శ్రద్ధావన్తో అనసూయన్తో అంటే అత్యంత శ్రద్ధతోనూ, ఎటువంటి అసూయ లేకుండా చేయాలి. అన్ని కర్మలను శ్రద్ధతో చేస్తూ, కర్మఫలములను భగవంతునికి అర్పిస్తూ చెయ్యాలి. అటువంటప్పుడు ఆ కర్మలు మనకు అంటుకోవు. నిత్యం సుఖంగా సంతోషంగా ఉంటాము. మానవునిలో ఉండకూడని లక్షణము అసూయ. కాబట్టి ఈ శ్లోకంలో పరమాత్మ ఉండవలసిన లక్షణము శ్రద్ధ అనీ, ఉండకూడని లక్షణము అసూయ అని స్పష్టంగా చెబుతున్నాడు.
సాధారణంగా మనుషులు నాలుగు పనులు చేస్తుంటారు. ఆహారం తినడం, నిద్రపోవడం, పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషునితో సుఖం అనుభవించడం, ప్రతిదానికీ భయపడటం. ఇక్కడ మానవా అంటే స్త్రీలు పురుషులు ఇరువురు అని అర్ధం. పైన చెప్పిన నాలుగు పనులు జంతువులు చేస్తాయి మనుషులు చేస్తారు. తేడా ఏమీ లేదు. కాకపోతే ఆహార, నిద్రా, మైధునాలు జంతువులు క్రమబద్ధంగా చేస్తాయి, మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు తింటారు. తాగుతారు. అర్ధరాత్రి దాకా మేల్కొని ఎప్పుడో పడుకొని ఉదయం 9గంటలకు లేస్తాడు. కర్రకు చీర చుట్టినట్టు కనపడినా ఆబగా పరుగెడుతారు. మైధునానికి ఒక కాలము, ప్రదేశము, పద్ధతి అంటూ ఉండదు. (అందుకే నిర్ణయ చట్టం అవసరమయింది.)
జంతువులు ఆపద వచ్చినపుడు మాత్రమే భయపడితే, మనిషి లేనిది రాదేమో అనీ, ఉన్నది పోతుందేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాడు. కాబట్టి మనుషులను జంతువులతో కూడా పోల్చలేము, అందుకని ఇక్కడ మానవులు అని వాడారు. మానవుడు అంటే మానవత్వం కలవాడు. పద్ధతి ప్రకారం నడుచుకొనేవాడు. మనసును, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు. విచక్షణా బుద్ధి కలవాడు. అటువంటి వారి గురించి చెబుతున్నాడు పరమాత్మ. అటువంటి మానవులు, మే మతం ఇదం అంటే పైన చెప్పబడిన నా మతమును... అంటే నా అభిప్రాయమును నిత్యం అనుష్ఠిస్తారో.. అని అన్నాడు. ఇక్కడ నా అభిప్రాయము అంటే కృష్ణుడి స్వంత అభిప్రాయము అని కాదు. అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న పరమాత్మ అభిప్రాయము అని అర్థం చేసుకోవాలి. పరమాత్మ అభిప్రాయము వేదముల ద్వారా, శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా ప్రకటితమౌతుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అభిప్రాయం కూడా అదే.
ఆ అభిప్రాయమును ఎలా ఆచరించాలి అంటే దానికి రెండు సూత్రాలు చెప్పాడు. పరమాత్మ శ్రద్ధతో చేయాలి. అంటే చేసే పని మీద నమ్మకంతో చేయాలి. ఎటువంటి సందేహమునకు ఆస్కారం లేకుండా చేయాలి. ఏకాగ్రతతో చేయాలి. నిత్యం అంటే నిరంతరము చేయాలి. అనసూయంతో అంటే ఎటువంటి అసూయలేకుండా చేయాలి.
ఇక్కడ అసూయ అంటే తాను చేసే పనిలో తప్పులు వెదకడం తాను చేస్తున్న పని మీద నమ్మకం లేకపోవడం. కాబట్టి తాను చేస్తున్న పని మంచిది. తన శ్రేయస్సుకొరకు, సమాజ శ్రేయస్సు కొరకు చేస్తున్నాను అనే నమ్మకంతో చేయాలి కానీ ఇదేంటి 'ఇలా ఉందే ఇలా ఉంటే ఎలా అవుతుంది. ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది' అంటూ అపనమ్మకంతో మొదలు పెడితే ఆ పని ఎన్నటికీ పూర్తి కాదు. మంచి ఫలితములను ఇవ్వదు. కాబట్టి అసూయ అంటే లోపాలు వెదకకుండా, నమ్మకంతో చేయాలి. ఒక వేళ లోపాలు ఉన్నా వాటిని వదిలిపెట్టి మంచినే గ్రహించాలి కానీ లోపాలు వెదుకుతూ కూర్చోకూడదు దీనిని అనసూయ బుద్ధి అంటారు. ప్రతి మానవుడు ఇటువంటి బుద్ధి తో కర్మలు చేస్తే, కర్మబంధనముల నుండి విముక్తుడు అవుతాడు. అటువంటి వారిని మనం జీవన్ముక్తులు అని అంటాము. సూక్ష్మంగా చెప్పాలంటే నిష్కామంగా, శ్రద్ధతో, ఎటువంటి కర్తృత్వభావన, అసూయ లేకుండా చేసే కర్మల వలన చిత్తశుద్ధి. దానివలన జ్ఞానం, జ్ఞానం వలన మోక్షం లభిస్తుంది. ఈ శ్లోకంలో తన అభిప్రాయమును అనుసరిస్తే వారు కర్మబంధనముల నుండి ముక్తిని పొందుతారు అని చెప్పి, తన మతమును విశ్వసించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.
(సేకరణ)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P193
No comments:
Post a Comment