🔥అంతర్యామి 🔥
# గురుసన్నిధి...
☘️పదార్థానికీ వాస్తవానికీ, యథార్థానికీ కల్పితానికీ మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించడంలో మనిషికి సాయపడేది గురువే చీకట్లను పారదోలి మనల్ని వెలుగుదారుల్లో గమ్యస్థానానికి నడిపించేది ఆయనే. ఆనందాన్ని బయటి వస్తువుల నుంచి కోరుకునేవారికి అది దూరంగా ఉంటుంది. ఆ భ్రమలను కలిగించేది. మనసు. తొలగించేది గురు అనుగ్రహం. ఎవరైనా మనసును అధిగమించి పైకి వస్తే, అతడు తన సహజ స్థితిని గ్రహించి, పరమానందస్థితిని పొందుతాడు. అద్వైత తత్వవేత్త శంకరులు ఉద్బోధించినట్లు, జ్ఞానం ద్వారా మాత్రమే ఎవరైనా నిజమైన ఆనందం పొందగలరు.
☘️జ్ఞానాన్ని పొందేందుకు అనేక మార్గాలున్నాయి. పురాణ గ్రంథాల అధ్యయనం, ఆత్మపరిశీలన, స్వీయ అన్వేషణ... లాంటివి. అయితే గురువు అనుగ్రహం పొందడం అత్యంత ప్రభావమంతమైన మార్గం. ప్రపంచంలో దేనినైనా నిర్వచించేటప్పుడు దాంతో మన సంబంధం ఏంటో కూడా తెలుస్తుంది. గురువును ఎలా చూస్తాం అనేది ఆయనతో మన బంధంపై ప్రభావం చూపుతుంది. గురువుగా చూస్తే శిష్యులమవుతాం, ప్రవచనకర్తగా చూస్తే శ్రోతలమవుతాం. భగవంతుడిగా చూస్తే భక్తులమవుతాం. సమకాలికుడిగా చూస్తే స్నేహితులమవుతాం. మన దృష్టి మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.
☘️ఇరవైనాలుగు మంది గురువుల నుంచి జ్ఞానోదయం పొందిన దత్తాత్రేయుడి గురించి శ్రీమద్భాగవతం చెబుతుంది. ఆ గురువుల్లో చాలామంది మనుషులు కారు. సర్వజీవులూ ఉన్నాయి. వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోవాలంటే వినయంగా ఉండాలి. అణకువ, అంకితభావం ఉన్న వ్యక్తికి గురువు సరైన సమయంలో తారసపడతాడు.
☘️ఆదిశంకరుల ఆదర్శ శిష్యులలో ఒకరైన ఆనందగిరికి జ్ఞానం లేదు కానీ గురువు పట్ల అమితమైన ప్రేమ శంకరులు కర్ణాటక గుండా వెళ్తున్నప్పుడు గిరి ఆయన శరణుకోరుతూ సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శంకరులు 'స్వచ్ఛమైన భక్తి. వినయం ద్వారా వ్యక్తి జ్ఞానోదయం పొందుతాడు. నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తున్నాను' అన్నారు. గురువు సేవకు తనను తాను అంకితం చేసుకున్న గిరి ఆధ్యాత్మిక సమావేశాల్లో మౌన ప్రేక్షకుడిగా ఉండేవాడు. ఒకసారి ఓ సమావేశాన్ని ప్రారంభించకుండా ఆచార్యులు బట్టలు ఉతుకుతున్న గిరి కోసం వేచి చూస్తున్నారు. 'జీవం లేని స్తంభంలాంటి వాడు గిరి(తోటక్), పాఠం అతడికి చెప్పినా, ఆ గోడకు చెప్పినా ఒకటే అన్నాడు మరో శిష్యుడు నెమ్మదిగా.
☘️ఆదిశంకరుల వారు చూపుతోనే శిష్యుల ఆలోచన గ్రహించేవారు. ఎప్పుడూ నోరు కూడా మెదపని తోటక్ అప్పటికప్పుడు గురువును ఎంతో అందమైన, అద్భుతమైన శ్లోకాలతో స్తుతించేసరికి ఆశ్చర్యంతో ఎవరికీ నోట మాట రాలేదు. అదే తోటకాచార్య కూర్చిన ఎనిమిది శ్లోకాల 'తోటకాష్టకం'. గురువు శిష్యుణ్ని ప్రేమతో కౌగిలించుకుని, దానికి స్వయంగా వ్యాఖ్యానం రచించారు.
☘️భక్తుడు కేవలం భౌతిక అస్తిత్వం కాదు. ఆధ్యాత్మిక జీవి. ఆ మార్గంలో ముందుకెళ్లడానికి సరైన జ్ఞానం కావాలి. జగద్గురువు పాత్రను పోషిస్తూ, కృష్ణుడు 'నిజమైన జ్ఞానాన్ని పొందగల ఏకైక మార్గం-స్వయంగా జ్ఞానాన్ని గ్రహించిన గురువును సంప్రదించడం' అంటాడు.🙏
🙏- మంత్రవాది మహేశ్వర్
🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺
No comments:
Post a Comment