Wednesday, October 1, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
                   *దేహభ్రాంతి*

*ధర్మాచరణకు, దైవాన్వేషణకు శరీరమే సాధనం. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు. విజ్ఞులైనవారు మేనిని కేవలం ధర్మసాధనంగా మాత్రమే భావిస్తారు.*

*సమస్త సృష్టిలో మరే జీవికీ సాధ్యపడని ఆలోచన, వివేకం, వివేచన మానవుల సొంతం. నిరంతర సాధన, ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి. వ్యాకులత, దుఃఖం, రోగాలు.. చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే. కాబట్టి వీటిపట్ల మితిమీరిన ఆందోళన అనవసరం.* *ఈ విషయం తెలిసినా కొందరు- నా శరీరం వేరు, దైవం వేరు అనే ద్వైతభావం కలిగి ఉంటారు. దీనికి కారణం దేహభ్రాంతి. ఇది ఉన్నంతవరకు ఏకాత్మ భావం అలవడదు. ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతుండాలి.*

*అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే. నేను, నాది అనే భావన ‘నేనే’ అనే అహానికి దారితీస్తుంది. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది. విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం. కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు. అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్నవారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు. దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయట పడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు.*

*భగవాన్‌ రమణమహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు. శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అనుకున్నారు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట.. ‘ఎంతోమంది రోగులకు సాంత్వన కలిగించే మీరు వ్యాధితో బాధపడటమేమిటి స్వామీ’ అని. దానికి ఆయన ‘శరీరమే తాము అని భ్రమించేవారికి, బాధలను అధిగమించలేనివారికి ఉపశమనం అవసరం. ఆత్మస్వరూపులు ఇలాంటివాటికి చింతించరు. దేహాన్ని నేనుగా భావించడంలేదు’ అని సమాధానమిచ్చారట!*

*'తనువు తనువటంచు దపియించు జనులార! తనువులు స్థిరమని తలపరాదం’టాడు వేమన. కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటు పడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది. ‘పచ్చికుండ వంటిది మేను’ అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్థాన్ని గ్రహించలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుందంటారు పెద్దలు. దాన్ని భగవత్‌ ప్రసాదంగా స్వీకరించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలు, రాగద్వేషాలు, భోగలాలస, ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం.*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment