Thursday, October 23, 2025

 *సమస్య*

సమస్యలు తలుపు తడతాయి 
అది అర్ధరాత్రా పట్టపగలా తెల్లవారుజామునా 
అనే లెక్క లేదు 

 దరిద్రుడిది ఆకలి సమస్య 
 సంపన్నుడికి సంపాదనే సమస్య 
 దరిద్రుడికి సంపన్నుడికి మధ్య బతికే
 మధ్యతరగతి వాడికి  అన్నీ సమస్యలే   

 పేదవాడినీ ప్రేమించేవి 
 సమస్యలు మాత్రమే

సకల సమస్యలకు 
సమీప బంధువు నీవు 
సమస్యలు పిలిస్తే పలుకుతాయి 
పిలువకపోయినా పలుకుతాయి

ఎక్కడున్నావ్ అంటూ వెతుక్కుంటూ వచ్చే 
ప్రియురాలు లేకపోయినా 
నిన్ను వెతుక్కుంటూ వచ్చేదే సమస్య 

నీ అత్తారింటికి వెళ్లి 
ఎడబాటు భారంతో విరహంతో  నిన్ను పలకరించే 
ప్రియమైన శ్రీమతి లేకపోయినా
నీకు పెళ్ళే కాకపోయినా  
అయ్యే యోగం లేక పోయినా
నీవు ఎలా ఉన్నా 
ఏ చోట నిల్చున్నా 
నీ మీద నిలువెత్తు ప్రేమతో పలకరించేది సమస్య 

నీకై తపించేది 
జపించేది సమస్య
నీలో జ్వలించేది 
జనించేది సమస్య  

సమస్యలకు  
ఒక స్వరం అవుతున్నామా 
సమస్యలనే...
వరంగా పొందామా

సమస్యలనే ఆభరణంగా ధరించామా   
మరణం దాకా సమస్యలతో సహజీవనం చేస్తున్నామా 

చచ్చి కూడా సమస్యగానే మిగిలిపోతున్నామా   

సమస్యల మధ్య బతుకుతున్నామా 
సమస్యలను బతికిస్తున్నామా  

దేశానికి జాతీయ సమస్యలు ఉంటే 
మనుషులకు
జీవితకాల సమస్యలు ఉంటాయి 

జీవితమే ఒక సమస్య అయ్యి కూర్చుంటుంది 
మన పక్కనే ఆత్మీయంగా 

సమస్యకు అమావాస్యకు తేడా లేదు 
రెండూ చీకటిని సృష్టిస్తాయి 
నీ చూపును తన నలుపు గుండెలకు హత్తుకుంటాయి  
  

సమస్యలు తీరడం కూడా మనకో సమస్యగానే తోస్తుంది 
రేపటినుండి ఏ సమస్య లేకుండా ఎలా బతకాలో 
అర్థం కాదు  
అంతగా సమస్యలతో ముడిపడ్డ జీవితాలు మనవి 
అసలు సమస్యలు మనకు ఎప్పుడూ శత్రువులు కాదు
శాశ్వత మిత్రులు  

మనం లేకపోయినా సమస్యలు బతుకుతాయి
సమస్యలు లేకపోతే మనం బతకలేం 
అది మనకు సమస్యలకు మధ్య ఉన్న 
అన్యోన్య అనుబంధం

No comments:

Post a Comment