*అత్తగారు- అమెజాను*
(చిన్న కధ)
🌷🌷🌷🌷🌷🌷
ఉదయం తొమ్మిది గంటలు. చలికాలం ముఖం చాటేసింది. ఎండలు నెమ్మదిగా తమ ఉనికి చాటుతున్నాయి.
పూజగదిలో పూజలో మా మామగారు, పొద్దున్నే టీవి రిమోట్ హస్తాభరణం చేసుకున్న మా మోడ్రన్ అత్తగారు, స్కూలుకి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్న పిల్లలు, ఒకపక్క మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతూ మరో పక్క బరబరా అంట్లు తోమేసి వేరే ఇంటికెళ్ళే కంగారులో పనిమనిషి , షూష్ ఒక కాలిది మరోకాలికి వేసుకోబోయి నాలిక్కరుచుకొని మళ్ళీ వేసుకొని ఆదరాబాదరాగా హైడ్రాబాడ్ రోడ్లెక్కిన మా ఆయన అందరూ ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు.
నేనేమో అందరికి టిఫిన్లు తినిపించి, అప్పుడే రెండు ఇడ్డెన్లు పళ్ళెంలో పెట్టుకొని ఒకముక్కతునిపి నోట్లో పెట్టుకోబోతుంటే
మా కాలింగ్ బెల్ "కుహు కుహు " మని మోగింది.
ఆ కొత్తరకం కాలింగ్ బెల్ అమెజాన్ లో కొన్నాము. ఆ ఒఖ్ఖటీ ఏమిటి ఖర్మ ! మా ఇంట్లో చీపురు పుల్ల దగ్గరనుండి చీనీ చీనాంబరాల వరకు "అమెజాన్ ఆన్ గోయింగ్ ఆన్ లైన్ పర్చేజే! "దీనికి ఆద్యురాలు మా మోడ్రన్ మహిళ మా అత్తగారే!
ఇంకాచెప్పాలావిడ గురించి. మా ఫ్లాట్ల లో మా ఆయన పేరుగాని, అసలు ఓనర్ అయిన మా మామగారి పేరుగాని ఎవ్వరికీ తెలియదు. అమెజాన్ అమ్మమ్మ గారి ఇల్లంటే ఠక్కున చెప్పేస్తారు ఎవ్వరైనా! మేం అందరం కేరాఫ్ అడ్రస్ ఆవిడే మరి.
ఆవిడ టీవీలో తెలుగు సీరియల్సు చూడరు ఎప్పుడూ హిందీ సీరియల్సు స్టార్ ప్లెస్ లో వచ్చే ఎన్నో ఏళ్ళపాటు సాగతున్న "దియా ఔర్ భాటి హమ్ ", "ఏ రిస్తా క్యా కెహలాతే" లాంటి సీరియల్సు కన్నార్పకుండా చూస్తూఉంటారు.
మళ్ళీ ఈసారి భౌ భౌ మని కాలింగ్ బెల్ మోగింది . అయ్యో ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఒక్కనిమిషం ఉండండి ! మళ్ళీ వచ్చి చెప్తాను అని ఒక్క ఉదుటున లేచి తలుపు తీసింది కోడలుసుజన.
మేడమ్ ! అమెజాన్ నుంచి కొరియర్ అన్నాడు వచ్చినతను. ఎవరికి అని అడిగితే మిసెస్ విధ్యాథరి! పేరుమీద వచ్చింది అన్నాడు. ఇంకెవరు మా అత్తగార్కి! తనపేరు బయటకి వినబడగానే ఎవరే! అని మా అత్తగారు ఈ ప్రపంచం లోకి వచ్చి తను కూర్చున్న సింహాసనంలోంచి లేచారు. మీకు కొరియర్ అని నేను తప్పుకున్నాను. మాకు అమెజాన్ నుంచి ఆవిడ పేరుమీద నెలకు నాలుగైదు కొరియర్సు వస్తాయి.ఈ రోజు ఏం తెప్పించారో?
ఆంజనేయప్రసాద్ అనే ఆ ఇంటి యజమాని ఉరఫ్ మామగారు పూజ గదిలో ఉన్నాకూడ ఆయన మనస్సంతా ఆ వచ్చిన వాళ్ళెవరో అని ఆయన కంగారు పడుతున్నారు. అనుష్టానానికి భంగం కూడా కలిగిందాయనకు.
ఈ లోగా ఆయన లేచి విద్యా! ఎవరువచ్చింది.అని పూజ పూర్తయిందనిపించిన మా మామగారు అడగ్గా ఆవిడ మీ పుట్టిన రోజుకి చొక్కాతెప్పించాను అమెజాన్ ఆన్ లైన్లో ! అనగానే ఆ ! అని ఆశ్చర్యంగా నోరు తెరిచి నాకు ఎందుకు దండగ అది పట్టి ఛస్తుందో లేదో అని ఆయన అంటే , ఆవిడ చూసిన చూపుకి తత్తరపడి ! అంటే నా ఉద్దేశ్యం అని నీళ్ళు నములుతూ మా అత్తగారి నోటికి భయపడి సరే నీ ఇష్టం అని వేసుకోడానికి రెడీ అయ్యారు.
నేను రెండు ప్లేట్లో పెట్టుకున్న ఇడ్డెన్లు గబగబ తిని మా అత్తగారితో కలిసి ఆ ప్యాకెట్టు విప్పి చూస్తే నలుపు మీద తెల్ల పూలచుక్కల చొక్కా! మా మామగారి వయస్సుకి తగ్గదేనా అని నా మనసు లో అనుకోబోతోంటే గొప్ప డిస్కౌంట్ ఆఫరే! అమెజాన్ వారు ఫిఫ్టీ పర్సంట్ ఇచ్చారు అంటూ దాన్ని తీసి మామగారిమీద వేసారు.
ఆయన పసుపు బొట్టు పెట్టుకుని వేసుకుంటే అది "స్లిమ్ ఫిట్" తో ఇరుకు ఇరుకు గాఉండి చాలా అనీజిగా ఫీల్ అయ్యి మా అత్తగారి నోటికి భయపడి నవ్వలేక నవ్వలేక "బావుందే న్యూ మోడల్ షర్టు" అనుకుని గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే! మా అత్తగారికి అమెజాన్ ఆన్ లైన్ పర్చేజ్ అంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఒకసారి "అమాందస్తా "
దొరుకుతుందేమో అని మనవణ్ణి సెర్చ్ చేయమన్నారు. అబ్బ "బామ్మ ! అలాంటివేమి అమెజాన్ లో అమ్మరు అని వాళ్ళు నెత్తి బాదుకుంటే ఆవిడ నమ్మరుకదా!
ఒకసారి మామిడికాయ సీజన్లో మాగాయ పెట్టడానికి మామిడికాయ ముక్కలు తురమడానికి "ఆలుచిప్పలు" కావాలని మనవణ్ణి "ఒరేయ్! అమెజాన్ లో దొరుకుతాయేమో చూడు" అని అనగానే "ఆలూ చిప్స్" ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా!
"ఓరి భడవా ! పొటేటోచిప్సు కాదురా" అని నవ్వి " ఆలుచిప్పలు అంటే సీలో దొరుకుతాయిరా ! "మాగాయి ఊరగాయి పెట్టుకోవడానికి మామిడికాయలు ఆలుచిప్పలతో తరిగితే ముక్కలు సన్నగా వస్తాయిరా "
"ఈ పీలర్లు ఎందుకు పనికి రావు" అంటే , "బామ్మ! ఆలుచిప్పల ని ఇంగ్లీషు లో ఏమంటారు ? అంటే గూగులైట్ చేయండి అని ఆవిడంటే నా పిల్లలు ఆశ్చర్యపోయి బామ్మ నీకు అన్నీ తెలుసే ! అంటే అన్నిటికి అదేమిట్రా అలా ఆశ్చర్య పోతారు ఆ గూగుల్ వాడు అన్ని మనదగ్గరనుంచి
సేకరించే కదా వాటిల్లో పెడతాడు అని , అలాగే మనం వాడే మాటలే ప్రపంచ స్థాయి దాటిపోయాయి రా ! మన హిందీ మాటల్ని కూడా ఆక్స్ఫర్డ్ డిక్ళనరీ లో కొత్త పదాలుగా ఏడ్ చేయడం లేదూ . అందుకని ఆలుచిప్పల కు కూడా ఉండే ఉంటాయి అని గొప్పగా వాదించారు.
"ఒకవేళ అమెజాన్ వారు అమ్మకానికి పెట్టకపోతే మనమే ఆ బిజినెస్ ఐడియా ఇద్దాం ! వేసవికాలం ఆవకాయ మాగాయి కాలాల్లో వాడికి నాలుగు డబ్బులొస్తాయని ఉపన్యాసం ఇచ్చేరు మా బహుముఖ ప్రజ్ఞాశాలైన అత్తగారు.
ఈ లోపు నా పుత్రుడు ఇంగ్లీషులో ఊస్టర్స్ ( OYSTER) అంటారుట! అంటే గుల్లలని వచ్చిందన్నాడు. ఒరేయి గుల్లలు అంటే వాడు ఏం "మల్లగుల్లలు" పడతాడో కొనద్దు! అని వాళ్ళకి బిజినెస్ చేయడం రాదని చాలా ఫీలయ్యారు.
ఆ రోజు పొద్దున్నే మా కాలింగ్ బెల్ మోగింది. ఈ సారి మ్యావ్ మ్యావ్ మంటూ కొత్త పిలుపుతో!
తలుపుతీసి చూడగా మా పక్కఫ్లాట్ లో ఉండే మనోజ్ఞ గారు వచ్చి వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందని స్వీట్ బాక్సు ఇచ్చారు.
మా అత్తగారు కళ్ళజోడు సర్దుకుంటూ వచ్చి దేంట్లో ఉద్యోగం అని అడిగితే ఆమె అమెజాన్లో అంటే మా అత్తగారి మొహం అమెరికా సంయుక్తరాష్ట్రా
లంతయ్యింది. తర్వాత సంగతి చెప్పక్కర్లేదు, ఆ అబ్బాయి ఎక్కడ కనబడితే అక్కడ " ఏమోయ్ మీ కంపెనీ వాళ్ళకి చెప్పు ఇంకా కొత్త కొత్త వస్తువులు పెట్టమను, ఆవకాయజాడీలు, అమాందస్తాలు, ఆలుచిప్పలు, మరకత్తిపీటలు, ఇంకా వీలైతే ఒక పెళ్ళి చేయడానికి కావలసిన సామాన్లు గుత్తగా పాకేజీ పెట్టమను. బోల్డు డబ్బులొస్తాయి "
అంటూ ఊదరగొడితే అతను బిత్తరపోయి నేను సాఫ్టువేరు వైపు ఉంటాను మామ్మగారు ! నాకు మార్కెటింగ్ విషయాలు తెలియవు అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు. అయినా మా అత్తగారు ఊరుకుంటేనా! అబ్బాయి మీ వాళ్ళకు చెప్పు నా దగ్గర గొప్ప గొప్ప బోలెడు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి.
కాలానికి తగ్గట్టుగా మీవాళ్ళు మారాలబ్బాయి ఈ రోజులలో ఎవ్వరికి ఖాళీలు ఉండడం లేదు అందుకనే ఎంచక్క ఇంట్లో కూర్చొని అన్నీ తెప్పించుకోవచ్చు అంటూ ఇంకా చెప్పబోతుంటే అతను కంగారుగా నాకు ఆఫీసుకి టైం అవుతోంది అమ్మమ్మ గారు అని ఉద్యోగానికి పరిగెత్తాడు.
మా అత్తగారు ఉసూరుమంటూ లోపలికి వచ్చి వాట్సాప్ గ్రూపుల్లో చొరబడ్డారు. ఆవిడ పాతిక గ్రూపుల్లో మెంబర్.
ఆవిడ చిన్ననాటి స్నేహితుల గ్రూపు, స్కూలు ఫ్రెండ్సు గ్రూపు, కాలేజి ఫ్రెండ్సు గ్రూపు, వాకింగ్ ఫ్ర్ండ్సు, మరొకటి ఫ్లాట్సులో పరిచయస్తుల సమూహం .
అదికాక ఆవిడ వయస్సు అత్తగార్ల గ్రూపు.
అలా లెఖ్ఖలేనన్ని! ఆవిడ చాలా బిజీ వాటితో! కాలం చాలా స్పీడుగా ప్రవహించే అమెజాన్లా పరుగెడుతోంది.
ఈ లోగా ఆవిడా ఇంకాస్త ముందుకు దూకి మనవణ్ణి కొడుకుని పోరుపెట్టి తన బిజినెస్ ఐడియాల చిట్టా అమెజాన్ వాళ్ళకి మెయిల్ పంపింది. ఆ రోజు ఆదివారం. మా మేనల్లుడి పెళ్ళికి వెళ్ళాము అందరం. అక్కడ కూడా మా అత్తగారి ప్రాభవం అంతా ఇంతా కాదు. చాలామంది వాట్సపు గ్రూపు వాళ్ళు ఆమె చుట్టూ చేరి కబుర్లు.
వంటలో చిట్కాలు , విశేషాలతో ఆవిడకి తీరిక లేదు.కొంతమందైతే మా విద్యత్త కాచిన పప్పుచారు సువాసన నాలుగు వీథులు వరకు పాకేదని అందరు చెప్పడం పొగడడం విని ఆవిడకి వంటలో కూడా విశేష ప్రావీణ్యం ఉందని నేను తెలుసుకున్నాను.
మరి మాకెప్పుడూ ఆ రుచి చూపించలేదే? అని అనుకున్నాను. కాని అడగడానికి థైర్యం ఏది?
ఈ రోజు మా ఇంట్లో గొప్ప ఆనందకరమైన సంఘటన జరిగింది దానికి కూడా మా అత్తగారే కారణం.
మా వారు ఆఫీసునుంచి ఫోన్ చేసి అమ్మకి ఫోను ఇయ్యి ఒకసారి అని అడిగారు. వెంటనే ఇచ్చాను. నాన్న ! ఏంటిరా ? అని అడిగారు. ఆవిడ మొహం "అమెజాన్ ఆన్ లైన్లో " కొన్న చార్జిలైట్ లా వెలిగిపోవడం గమనించాను.
ఆ ఆనంద సంఘటన ఏమిటంటే మా అత్తగారు పంపిన ఐడియా చిట్కాలకి అమెజాను వారు అబ్బురపడిపోయి, అయ్యో ఇంతకాలం తమ అమ్మకాల ఆన్ లైన్లో పెట్టలేక పోయామని చింతిస్తూ ఇహనైనా తమ బిజినెస్సు ఐటమ్సులో మా అత్తగారు చెప్పిన ఐటమ్సుని చేరుస్తామని మేడమ్ ఇచ్చిన ఐడియాలకి ప్రతిఫలంగా ఆవిడకి , మామగార్ల జంటకి బహుమతిగా అమెరికా యాత్రకి ఫ్రీగా తిరగడానికి టిక్కెట్లు మరియు లక్ష రూపాయిల నగదు ప్రకటించారుట.
మేమందరం ఆవిడకి అభినందనలు తెలియజేస్తుంటే ఆవిడ అప్పుడే ఇంక కొత్త ఐడియాలు ఏమివ్వచ్చా అని గర్వంగా తలెత్తుకొని ఆలోచిస్తున్నారు.
నేను అందరికి పంచడానికి స్వీట్లు తయారు చేయడానికి సిధ్ధం అయ్యాను.
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
No comments:
Post a Comment