*నేటి ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ స్టోరీ*
💖 *మన తెలుగు.. భలె తియ్యని పలుకు* ✍️
*తెలుగెందుకు తియ్యన? ఎంత చక్కన? Italian of the East అని టక్కున అనేస్తున్నాం కానీ* *ఆ తీపి రుచి ఎరగకపోతే ఎలా? తెలియాలి. రుచి చూడాలి. అప్పుడు అర్థమవుతుంది అసలు సొగసు. ఇది చదవండి.*
మత్తగిల్లు సత్తు గిత్త తత్తడినెక్కి
మిత్తి మొత్తి
సత్తి నత్తి
బత్తి పత్తిరిడిన
బుత్తిముత్తులు రెండును
ఒత్తి గుత్తకట్టుచుండు రేడు
'నీలాసుందరి పరిణయం' అనే కావ్యాన్ని శివుడికి అంకితమిస్తూ కూచిమచి తిమ్మకవి రాసిన పద్యం ఇది. ప్రతి అక్షరం తెలుగే! ఒక్కటంటే ఒక్క సంస్కృత పదం కూడా లేదు. ఆ పదాల అర్థాలు చూడండి. (మత్తగిల్లు - బాగా మధించిన, సత్తు గిత్త - సత్తువు కలిగిన ఎద్దు, తత్తడి - గుర్రం/వాహనం, ఎక్కి, మిత్తి - మృత్యువు, మొత్తి - నశింపచేసి, సత్తి - శక్తి/పార్వతిదేవి, నత్తి - హత్తుకొని, బత్తి - భక్తితో, పత్తిరిడిన - పత్తినిగాని ఇస్తే, బుత్తిముత్తి - భుక్తి, ముక్తులు రెండును, ఒత్తి
గుత్తకట్టుచుండు రేడు - ప్రేమగా అందించే దేవుడు)
'సత్తువ కలిగిన ఎద్దునెక్కి, మృత్యువును నశింపచేసి పార్వతిదేవిని హత్తుకొన్న దేవుడికి.. కాసింత పత్తిని ఇస్తే భుక్తి, ముక్తులను మనకు ప్రేమగా అందించే దేవుడైన ఈశ్వరుడికి నా కావ్యం అంకితం' అని పద్యం భావం. ఇదంతా మనదే! ఇంత తెలుగు మనదే!
అన్నమయ్య గుర్తొస్తున్నారు. ఎన్ని సంకీర్తనలు! ఎంత చక్కటి తెలుగు! ఈ కీర్తన చూడండి..
కలికి నీయెదుట నివె కానుకలు వట్టీని
యెలమి నేడిక నీకు నింపవునో కావో
కప్పురములో పిసరు కాంతనవ్వుల కొసరు
చిప్పిలు దేనెల వెగటు చెమట సొగటు
ముప్పిరి బన్నీటి జాలు మొదల వలచిన మేలు
యిప్పుడు నీకివియెల్ల నితవౌనో కావో
పొగరు వెన్నెలవేడి పొలతి చూపులవాడి
చిగురు గుత్తుల మినుకు చేతిచెనకు
వొగరు వీడెపు మదము వుబ్బరి చిత్తపుమదము
బిగియ నేఁటికి నీకు బ్రియమౌనో కాదో
అబ్బా! ఏం మాటలవి? కప్పురములో పిసరు.. కాంత నవ్వుల కొసరు, చిప్పిలు తేనెల వెగటు.. చెమట సొగటు, ముప్పిరి పన్నీటి జాలు.. మొదల వలచిన మేలు, పొగరు వెన్నెల వేడి.. పొలతి చూపులవాడి, చిగురు గుత్తుల మినుకు.. చేతిచెనకు..! ఎప్పుడైనా విన్నారా ఇంత అందమైన పదాలు? మన సంపదే ఇదంతా!
వందేళ్ల నాటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మాత్రం తక్కువా? వాగ్గేయకారులకు ఏమీ తీసిపోలేదు. ఎంత భాష? ఎంత భావం? ఈ పాట చూడండి.
పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకూ
నీవలె సుకుమారములు.. నీ వలెనె సుందరములు
పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకూ
తుమ్మెద కాలూననివీ.. దుమ్ము ధూళి అంటనివీ
కమ్మగ వలచేవి.. రకరకమ్ముల వన్నెలవీ
పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకూ
ఆలసించెనా.. పూజావేళ మించిపోయెనా
ఆలయమ్ము మూసి పిలుపాలింపడు ప్రభువు
పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకూ
ఏమన్నా చెప్పాలా? జోహార్ కృష్ణశాస్త్రి. అంతే! ఈ పాట ద్వారం లక్ష్మి గారి గొంతులో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఎంతోమంది ఈ పాట పాడారు. తనికెళ్ల భరణి గారి 'మిథునం' సినిమాలో కొంత భాగం వాడారు.
తెలుగు అనగానే ముళ్ళపూడి వారు గుర్తుకొస్తారు మనకి. మరీ ముఖ్యంగా 'బుడుగు'. హాస్యమందున అరుణ.. అందె వేసిన కరుణ.. బుడుగు వెంకటరమణ.. ఓ కూనలమ్మా! అని ఆరుద్ర కితాబు కూడా ఇచ్చారు. బుడుగు మాటలు కొన్ని చూడండి.
"బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళోకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. కడుపునెప్పి మంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకు పెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి."
"ఒక మేష్టారేమో చెవి కుడివైపుకు మెలిపెడతాడు. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు కదా? వాడేమో ఎడమవైపుకి మెలిపెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకని ఎటేపు మెలెట్టాలో కొత్తమేష్టరు ముందుగా పాతమేష్టరును కనుక్కుని రావాలి."
ఎంత అల్లరి చూడండి బుడుగుది! అంతా ఎంచఖ్ఖా భాషలోనే ఇమిడిపోయింది. ఇందర్ని చెప్పుకున్నాక శంకరమంచి సత్యం గారి 'అమరావతి కథలు' గుర్తు చేసుకోకపోతే ఎలా? అందులో ఒక్క కథ ఎంచి చెప్పడం పాపం. అన్నీ ముత్యాలే! 'రెండు గంగలు' కథ చాలామందికి ఇష్టం. అందులో వాన గురించి ఆయన రాసిన మాటలు వింటుంటే మనమూ వర్షంలో తడుస్తాం.
"కృష్ణంతా చినుకులు. కృష్ణంతా పులకరింతలు. ఇసక మీద చినుకులు. రేణు రేణువుకీ చినుకులు. విసవిస, సరసర చినుకులు. రివ్వుమని, రయ్యిమని చినుకులు, ఊపులా చినుకులు. తాపులా చినుకులు. ఛళ్లుమని, ఫెళ్లుమని, దభిల్లుమని, పెఠిల్లుమని చినుకులు - చినుకులు - కృష్ణనిండా, నేలనిండా - చినుకులు చినుకులు - రెండు గంగలు కలిసిపోయినట్టు, నింగీ నేలా ఒకటే అన్నట్టు.
ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు, అన్నిటికీ నీళ్లే ఆధారమన్నట్టు వాన, వర్షం, గంగమ్మ, కిష్టమ్మ, సంద్రం - అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో."
మాటలా ఇవి? రత్నాల మూటలు. తెలుగు వెలుగులు నింపుకున్న రత్నాల మూటలు. ఇంత భాష మనది. అచ్చంగా మనదే! తెలుగు చచ్చిపోతోంది.. చచ్చిపోతోంది అంటారు కానీ చావనిచ్చేలా రాశారా మనవాళ్లు? భాషకు చేవనిచ్చేలా రాశారు. తెలుగుకు అమృతం తాగించారు. దాన్ని సంజీవని చేసి మనకోసం భద్రం చేశారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు 🙏🙏.
No comments:
Post a Comment