ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒకసారి ఆశ్రమంలో ఒక భక్తురాలు, మహర్షి కలిసి పొట్లకాయ కూరని నూనెలో వేయిస్తున్నారు. మహర్షి దృష్టిలో ఏది వృథా కాకూడదు కాబట్టి పొట్లకాయలోని నీళ్ళు పిండకూడదు. పైగా ఆశ్రమానికి వచ్చింది ఏదీ వృధా కాకూడదు. పొట్లకాయల్ని తరిగి అట్లానే బాణలిలో వేసి నీరు పోయిందాకా వేయించాలి. అది చాలా పెద్ద బాణలి.
పొయ్యకి ఒకవైపు మహర్షి ఇంకొకవైపు ఆ భక్తురాలు కూర్చుని పెద్ద గరిటలతో కూరని మాడకుండా తిప్పుతున్నారు. చాలా వరకు కూర వేగింది.
ఆ సమయంలో మహర్షి ఎందుకో చప్పున గరిటను అట్లానే వదిలి చలనం లేకుండా ఆగిపోయారు. తలెత్తి మహర్షిని, చలనంలేని మహర్షి చూపుల్ని చూసి ఆ భక్తురాలికి కూడా తన ప్రయత్నం లేకుండానే మనస్సు ఆగిపోయింది. చుట్టూ ఏమీ కనబడలేదు.
కొంచెం సేపట్లో కూరలోంచి శబ్దం ఆగిపోయింది. 'కూరలో పొడి వెయ్యడానికి ఇదే సమయం' అని సెలవిచ్చారు మహర్షి. పొడి అంటే కూరపైన చల్లడానికి సిద్ధంగా కొట్టి వుంచుకున్న కూరపొడి.
అదేవిధముగా "మనసులోని శబ్దం (ఆలోచనలు) ఆగి నిశ్చలమైన స్థితి మనిషికి వచ్చినపుడు గురువు ఉపదేశం చెయ్యవలసిన సమయం" అని సెలవిచ్చారు మహర్షి.
No comments:
Post a Comment