Tuesday, October 21, 2025

 🔥అంతర్యామి 🔥
# దీపావళి...

☘️దీపావళి పండుగకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తిక శుద్ధ విదియ వరకూ పర్వకాలంగా పరిగణిస్తారు. తమ పూర్వీకుల సద్గతికోసం పితృ తర్పణాలు, శ్రాద్ధం కొందరు విధిగా పాటిస్తారు. కొరవులు మండించి ఆకాశం వైపు చూపించడం, దీపాలు వెలిగించడం ద్వారా పితరులకు ఉత్తమ లోకప్రాప్తి కలగాలని కోరుకోవడం సంప్రదాయం. ఈ దీపపర్వం అటు పితృదేవతలకీ, ఇటు దేవతలకీ కూడా సంబంధించింది. ప్రాతఃకాలంలో అభ్యంగం, మధ్యాహ్నం పితృతర్పణాలు, సాయంకాలం దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవిని పూజించడం ఈ పండుగ విధులుగా ధార్మికగ్రంథాలు వివరించాయి.

☘️దీపావళి వేడుకలను యముడికి సంబంధించినవిగా కొన్ని శాస్త్రాలు వర్ణించాయి. జీవుల ధర్మాధర్మాలకు తగిన ఫలాలను ప్రసాదించే విశ్వనియామకశక్తియే 'యమ' అని చెప్పాయి. నియంత్రించి, నిగ్రహించి, నియమించే దేవత అని 'యమ' శబ్దానికి అర్ధం.

☘️పాపఫలంగా కలిగే దుఃఖమే నరకం. పవిత్ర కర్మలతో ఆరాధించేవారిని అనుగ్రహించే ఈశ్వరశక్తి స్వరూపాన్నే యముడిగా కొలిచి, యమనామాలతో తర్పణాలను ఇస్తారు. యమ, వైవస్వత, ధర్మరాజు, కాలస్వరూప... మొదలైన యమనామాల స్మరణ అకాల మృత్యువు, దుఃఖాల నుంచి విముక్తి కలిగిస్తుందని శాస్త్రోక్తి. నరకచతుర్దశి రాత్రిని 'కాళరాత్రి'గా, దీపావళి అమావాస్య నాటి రాత్రిని 'మహారాత్రి'గా శాక్తేయశాస్త్రాలు అభివర్ణించాయి. కొన్ని ప్రాంతాలలో కాళిని ఆరాధిస్తారు. ఈ రోజు ఏ మనోభావాలతో ఉంటారో రానున్న సంవత్సరమంతా అలాగే ఉంటారని కొందరి నమ్మకం. అందుకే ప్రయత్నపూర్వకంగానైనా సంతోషంగా, పరస్పర స్నేహభావాలతో పండుగ జరుపుకొంటారు. దక్షిణ దిక్పాలకుడైన యముడి ఆరాధన తరవాత, దీపావళి రాత్రి ప్రారంభంలో దీపలక్ష్మినీ, ధనలక్ష్మినీ పూజించి, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుణ్ని ఆరాధించడం కొన్నిచోట్ల పద్ధతి. బహుళ (ధన) త్రయోదశి నుండి దీన్ని ధనసంబంధ పర్వంగా పేర్కొంటారు.

☘️దేవతలు కాంతిశరీరులు. 'దేవ' శబ్దానికి 'ప్రకాశించువారు' అని కూడా అర్థం. అందుకే దీపాల ద్వారా దివ్యశక్తులను ఆహ్వానించి, ఆవహింపజేస్తారు. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని తొలగించడానికి సంకేతంగా బాణసంచా కాలుస్తారు. దీపకాంతితో ఒక దివ్యభావం, పూర్వీకులతో అనుబంధం, దేవతల ప్రసన్నత, బంధుమిత్రాదులతో సామాజికోత్సాహం... ఈ పండుగలో కనబడే మంచి విషయాలు.

☘️దీపావళికి 'బలి రాజ్యం' అని కూడా పేరుంది.
సంపదనంతటినీ గ్రహించడానికి నారాయణుడే
వామనుడై వచ్చాడని తెలిసి కూడా, మాట తప్పని దానశీలి, విష్ణుభక్తుడు బలిచక్రవర్తి, సత్యానికి, నిబద్దతకి, భక్తికి భగవానుడి దయ ఉంటుందని భాగవతాదులు చెబుతున్నాయి.

☘️పరిశుభ్రమైన ఇళ్లలో దేవతలు నెలకొని
అనుగ్రహిస్తారనే భావనతో దీపావళి జరుపుకోవాలి.
వీధిగుమ్మాన్ని పసుపుకుంకుమలతో, మామిడితోరణాలతో మంగళకరంగా తీర్చిదిద్ది- దానికి సమీపంలో దీపాలను వెలిగించాలి. దీపం జ్ఞానానికీ, ఆనందానికీ, దివ్యత్వానికి సంకేతం. జ్ఞానానందాల దివ్యత్వాన్ని ఉపాసించి, ఆ దివ్యశక్తి కృపను పొందే అవకాశమే దీపావళి పండుగ.🙏

✍️-సామవేదం షణ్ముఖశర్మ

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺

No comments:

Post a Comment