ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మొదటి నుండి మహర్షి వద్దకు వచ్చిపోవు భక్తులకు ఏ విధమైన కట్టుబాట్లు ఉండేవికావు. తర్వాత కాలములో మహర్షికి కొంచెం విశ్రాంతి అవసరమని కొన్ని మార్పులు చేయబడినవి. ఈ మార్పు ఏర్పడిన క్రొత్తల్లో బయటి ఊళ్ళనుండి వచ్చు భక్తులకు ఇది తెలియదు.
ప్రక్క ఊరి నుండి ప్రతీ ఆదివారం ఒక భక్తుడు ఆశ్రమమునకు వచ్చు చుండెడివారు. వచ్చినప్పుడెల్లా మహర్షి కొరకు ఏదో ఒక పిండి వంటను తీసుకొచ్చేవారు.
ఒక ఆశ్రమ సేవకురాలు "భగవాన్! ఏదో ఒక పిండి వంటను చేస్తాను" అని అన్నది. అందుకు మహర్షి "ఈ రోజు ఆదివారం కదా! ఆ భక్తుడు తప్పకుండా ఏదైనా ఒక ఫలహారం తెస్తారు! వేరుగా మీరు ఎందుకు చేయటం?" అని సెలవిచ్చారు.
ఆ భక్తుడు ఎప్పటివలె మహర్షి దర్శనము కొరకు తమ చేతిలో ఫలహారము తీసుకొని హాలుకు వచ్చుచుండిరి. వారు వచ్చుటను మహర్షి కిటికీ గుండా చూచుచుండిరి. అయితే వారు ఎంత సేపటికిని లోపలికి రాలేదు. మహర్షికి కారణము తెలియలేదు.
అపుడు సుమారు పగలు ఒంటిగంట అయి ఉండును. ఒక సేవకుడు ఆ భక్తుడిని ముందుకు వెళ్ళనీయక ఆపి, మహర్షి విశ్రాంతి తీసికుంటున్నారు. అందువల్ల ఇప్పుడు వెళ్ళవద్దని, రెండుగంటలైన తరువాత వచ్చి మహర్షి దర్శనము చేసుకోండి అని చెప్పి వారిని పంపివేసెను. ఆ భక్తుడు కూడా సరేనని వెళ్ళిపోయి తిరిగి మూడు గంటలకు మహర్షిని దర్శించుటకు వచ్చిరి.
అప్పుడు మహర్షి "మీరు ఒంటిగంటకు ఇక్కడకు రావడం నేను కిటికీ గుండా చూసాను! మీరు లోపలికి రాలేదా! అట్లే వెళ్ళిపోయారా!" అని అన్నారు.
అందుకు ఆ భక్తుడు "అవును భగవాన్! అలాగే వెళ్ళి పోయాను. ఈ రోజు రైలు చాలా ఆలస్యముగ వచ్చినందున నేను ఇక్కడకు వచ్చుటకు సమయం ఒంటిగంట అయ్యింది. వచ్చి-రావడంతోనే మహర్షిని దర్శించి పోదామని ఇక్కడకే నేరుగా వచ్చాను. మహర్షికి ఇప్పుడు విశ్రాంతి అని మరలా రమ్మని చెప్పిరి" అని అన్నాడు.
మహర్షి :
అట్లాగా! సరే! సరే!! అని, అతని యోగ క్షేమములు విచారించి, అతను తీసుకొచ్చిన వాము కారప్పూసని అడిగి తీసుకొని తినిరి.
భక్తుడు :
రాత్రి భోజనమైన తరువాత ఊరికి పోవుటకై మహర్షి వద్దకు వచ్చి సెలవడిగారు.
మహర్షి :
సరే! సరే!! పోయిరండి.
మరుసటి రోజు ఎప్పటివలె మహర్షి మధ్యాహ్నం భోజనము తర్వాత హాలుకు వచ్చిరి. అపుడు పన్నెండు గంటలు అయి ఉండును. బయట విపరీతమైన ఎండ కాస్తున్నది. మహర్షి సోఫాను వదలి బయటవున్న తిన్నె మీదకు వచ్చి కూర్చొనిరి. వెంటనున్న సేవకులకు ఏమీ అర్థము కాలేదు. మహర్షిని అడుగుటకు ధైర్యము లేదు. ఏమి చేయుటకు తోచక నెమ్మదిగా మహర్షి వద్దకు పోయి , భగవాన్! ఎండ తీవ్రముగా ఉన్నది. రెండు గంటల వరకు లోపల ఉండి ఎండతగ్గిన తరువాత రావచ్చును' అని అనిరి.
మహర్షి :
ఓహో! అట్లాగా! రెండు గంటల వరకు ఎవరూ నన్ను చూచుటకు లోపలికి రాకూడదని చట్టం తీసుకొని వచ్చినారా! భక్తులు ఎవ్వరూ లోపలికి రాకూడదని చెప్పి, త్రిప్పి పంపివేసితిరి. నేను కూడ రెండు గంటల వరకు బయటికి రాకూడదని ఏదైనా చట్టము తీసుకొచ్చారా! వాళ్ళైతే లోపలికి రాకూడదు. నేను బయటకు రావచ్చును కదా! పాపం! ఎండ కూడా లెక్క చేయకుండా తమకు దొరికిన సమయములో వచ్చి మహర్షిని దర్శించి పోవుదమని, వచ్చినవారిని మహర్షి విశ్రాంతి తీసుకుంటున్నారనీ, తరువాత రమ్మని చెప్పి పంపివేస్తే వారందరికి ఎంత బాధగా ఉంటుంది? లోపల సోఫాలో సుఖముగా కూర్చున్న నాకు ఎండట ఎండ! బయట ఊళ్ళ నుంచి మండే ఎండలో వచ్చువారికి మాత్రము ఎండలేదు కాబోలు! మీరు చాలా బుద్ధి మంతులు.
No comments:
Post a Comment