Tuesday, January 28, 2020

స్నేహం

స్నేహం

👬🏻 సృష్టిలో తియ్యనిది, అపురూపమైనది స్నేహం. ఇరుహృదయాల మధ్య ఆత్మీయ అనుభూతులకు నెలవుగా, అనుబంధ, అనుభవాల కొలువుగా విరాజిల్లేది స్నేహం.
రక్తసంబంధాలను దేవుడు సృష్టిస్తే , స్నేహమనే బంధాన్ని వ్యక్తులు సృష్టించుకోవాలి.

‘పాలు నీళ్లలో క్షీరాన్ని హంస త్రాగినట్టు’ నిశితంగా పరిశీలించి చేసే స్నేహం వలన మంచి స్నేహితులు లభిస్తారు.
‘ స్నేహం కలకాలం నిలుపుకోవాలన్న ’ సత్యాన్ని గుర్తించడంతో బాటు ‘ సగర్వంగా రాజాస్థానానికి వెళుతున్నప్పుడే కాదు, విషాదంతో స్మశానానికి వెళుతున్నప్పుడూ వెంట వచ్చేవాడే నిజమైన స్నేహితుడన్న’ చాణక్యుడి మాటలోని యదార్ధాన్ని గుర్తించి స్నేహం కొనసాగించాలి. ఆర్ధిక బంధాలకు అతీతంగా మెలుగుతూ దాపరికాలు లేని స్వచ్ఛమైన , పారదర్శకమైన స్నేహాన్ని అనుభూతించినప్పుడే సంతోషం కలుగుతుంది. అభిప్రాయలు, అభిరుచులు, రహస్యాలను స్వేచ్ఛగా పంచుకుని ఊరట పొందే బంగారు అవకాశం స్నేహితుల దగ్గర మాత్రమే దక్కుతుంది.

బాల్యస్నేహాలు కడదాకా కొనసాగిన ఉదంతాలను పురాణాలు వివరించాయి. కృష్ణ కుచేలుల మధ్య చిగురించిన స్నేహ పుష్పం పేదగొప్పలకు అతీతంగా వికసించి, స్నేహ పరిమళాలు వెదజల్లినట్టు, కుచేలుని పాదాలను కడిగి సింహాసనంపై కూర్చుండబెట్టి ఆత్మీయతను, అఖండ ధన సంపదను కృష్ణుడు ప్రసాదించినట్టు భాగవతం తెలిపింది.

స్నేహితుడి కోడలైన సీతమ్మను రక్షించేందుకు రావణునితో పోరాడి రెక్కలు కోల్పోయి కొనవూపిరితో రాముడికి సమాచార మందించిన జటాయువు వృత్తాంతాన్ని రామాయణం, ఆత్మగౌరవం నిలబెట్టిన దుర్యోధనుడితో ఏర్పడిన స్నేహానుభూతుల్ని నిత్యం శ్వాసిస్తూ కడదాకా విడువని కర్ణుడి కథను భారతం వివరించాయి.


కొన్ని స్నేహాలు బంధుత్వానికి మించి ఆప్యాయతలను పంచుతాయని రామసుగ్రీవులు, కృష్ణార్జునులు నిరూపించగా, స్నేహితులు శత్రువులుగా మారిన ఉదంతాలలో ద్రోణ ద్రుపదులు ముందుంటారు. సహాయార్ధియై వెళ్ళగా అవమానించిన గురుకుల స్నేహితుడు ద్రుపదుణ్ణి బంధింపజేసి ప్రతీకారం తీర్చుకున్న ద్రోణుడి వృత్తాంతాన్ని భారతం తెలిపింది.

‘విజయం వరించినప్పుడు వెన్ను తట్టి కరచాలనంతో కౌగిలించుకునేది , పరాజయం వెక్కిరించినప్పుడు గుండెలకు హత్తుకుని ఓదార్చేది, మంచి స్నేహితుడే’ అయినప్పటికీ స్నేహితుల మధ్య పొరపొచ్చాలు రావడం సహజం. ‘స్నేహితుడి వలన కలిగిన కష్టాలను ఇసుక మీద రాసుకుంటూ, పొందిన ప్రయోజనాలను రాతి ఫలకం మీద చెక్కుకుంటూ , ఇచ్చింది మర్చిపోయి, పుచ్చుకున్నది జ్ఞప్తి చేసుకోవడమే” స్నేహం నిలుపుకునే ఉత్తమ మార్గం.

మారుతున్న కాలంతోబాటు కల్తీ వస్తువులు పెరిగినట్టే స్నేహాల్లో కూడా స్వార్ధ ప్రయోజనాలు ఆశించే స్నేహాలు ఇటీవల పెరిగాయి. మనోనేత్రంతో యోచించి దుష్టస్నేహాల బారిన పడకుండా జాగరూకులై మెలిగినప్పుడే స్నేహం కలకాలం నిలుస్తుంది. చిక్కులూ తప్పుతాయి.👍

No comments:

Post a Comment