Saturday, April 25, 2020

బాబాయ్ ..మనం చాలా అద్రుష్టవంతులం...

బాబాయ్ ..మనం చాలా అద్రుష్టవంతులం.

పగలు రేయి తేడా లేకుండా ఎవడు వైరస్ తో వస్తాడో ఏ జబ్బు తగిలిస్తాడో తెలియని ఒత్తిడిలో ఏ ఫోన్ కాల్ ఎంత అపరాత్రి వచ్చినా పని చేయాల్సిన డాక్టర్ వృత్తిలో మనం లేం .....

మాడు పగిలిపోయే ఎండలో అడ్డదిడ్డంగా రోడ్ల మీదకొచ్చే జనాన్ని క్రమశిక్షణలో పెడుతూ, పై అధికారుల ఆజ్ఞలను పాటిస్తూ నిర్మానుషమైన రహదారుల మీద గస్తీ కాసే పోలీస్ డ్యూటీ దేవుడు మనకు ఇవ్వలేదు .....

జబ్బులు, డబ్బులు రెండూ సమానంగా మోసుకొచ్చే కస్టమర్లలో ఎవడికి కరోనా ఉందో లేక మరొకటి ఉందో అర్థం కాకుండా వాళ్ళిచ్చే చీటీలకు బిక్కుబిక్కుమంటూ మందులిచ్చే దుకాణంలో మనం పని చేయడం లేదు ......

ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమెల్యేల దాకా అందరికి కావాల్సిన సమాచారం ఇస్తూ జిల్లాలో అన్ని నియోజవర్గాల బాధ్యతను నెత్తిమీద వేసుకుని ప్రతిఒక్కరికి జవాబుదారిగా నిలవాల్సిన కలెక్టర్ జాబు మనది కాదు .....

వేళాపాళా లేకుండా పైవాళ్ళు చెప్పిన ప్రతి చోటికి వెళ్లి నోళ్ళ దగ్గర మైకులు పట్టుకుని కేవలం ఒక మాస్కు మన ఆరోగ్యాన్ని కాపాడుతుందన్న ధీమాతో తిరిగే మీడియా వాళ్ళం కాదు......

రెడ్ జోన్ లేదు, హై అలెర్ట్ లేదు వీధి వీధి తిరుగుతూ చెత్తను శుభ్రం చేస్తూ, బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ అందరూ వద్దనుకునే పని చేసే పారిశుధ్య కార్మికులుగా మనం లేం ......

రోజు కూలి మీద కాయకష్టంతో బ్రతుకుతూ ఇప్పుడు ఉపాధి లేక దాతల దయాగుణంతో వాళ్ళు పెట్టే తిండి కోసం ఎదురు చూస్తూ ప్రతి నిమిషం నరకంగా మారిన బడుగులం కాము....

ఊరు కానీ ఊరులో, రాష్ట్రం కాని రాష్ట్రంలో స్వంత చోటుకి వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో లాక్ డౌన్ ఎత్తేసే రోజు కోసం క్యాలెండర్ వంక దీనంగా ఎదురుచూసే దుస్థితి దక్కలేదు.......

బ్రతికేదెవరో చచ్చేదెవరో తెలియని సంకట స్థితిలో ప్రతి రోగిని సమానంగా చూస్తూ వాళ్లకు కావాల్సిన సేవలు చేస్తూ సేవే పరమావధిగా భావించే నర్సు, వార్డు బాయ్ జాబులు మనకు రాలేదు ......

130 కోట్ల దేశప్రజల రక్షణని నెత్తినేసుకున్న ప్రధాని కాము,
పదుల కోట్లలో జనాభా ఉండే రాష్ట్రాలకు సిఎంలము కాము,
నియోజకవర్గం మొత్తాన్ని కాపు కాచే ఎమ్మెల్యేలం కాము,
బడ్జెట్ లెక్కలు చూసుకునే మంత్రులం కాము,

అసలు మనము పైవేవీ కాము.

దర్జాగా ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ,
గేమ్స్ ఆడుకుంటూ,
పొద్దు పోకపోతే లాన్ లో నడుచుకుంటూ ఇళయరాజా పాటలు వింటూ,
బోర్ కొడితే ప్రైమ్ లోనో నెట్ ఫ్లిక్స్ లోనూ సినిమాలు చూస్తూ,
పిల్లలతో కావాల్సిన ఆటలు ఆడుకుంటూ,
వేడి వేడి టీ కాఫీలు తాగుతూ వర్క్ ఫ్రొం హోమ్ చేసుకుంటూ,
కావాల్సిన తిండిని చేయించుకుని శుభ్రంగా తింటూ,
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ,

దేవుడు ఇంత మహార్జాతకాన్ని ఇస్తే అనుభవించకుండా ఎప్పుడు బయటికి వెళదాం, ఎక్కడ తిరిగొద్దాం లాంటి ఆలోచనలు ఎందుకు బాబాయ్.

అందుకే అన్నది మనం చాలా అదృష్టవంతులం, దాన్ని అరిష్టంగా మార్చుకోకూడదంటే ఇంట్లోనే ఉండి దేశాన్ని కాపాడుకుందాం చాలు...👏

No comments:

Post a Comment