Sunday, May 3, 2020

వైతాళిక గీతం...

వైతాళిక గీతం..
మహమ్మారి నేర్పుతున్న పాఠం..

కాలం చీలిపోతోంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం మాదిరి- కరోనాకు ముందు, కరోనాకు తరవాతగా కాలం తన కొలతను మార్చు కోబోతోంది. ఇది యుగసంధి. ఆర్థిక పారిశ్రామిక సామాజికాది వివిధ రంగాల్లో పెను మార్పులకు, మలుపులకు ఈ యుగసంధి బీజప్రాయమై నిలుస్తోంది. ఆ విత్తనంలోంచి ఆవిర్భవించే కాలతరువు ఏ తరహా ఫలాలను అందిస్తుందో పసిగట్టడానికి వివిధ రంగాల నిపుణులు ఇప్పటికే తమ మేధకు పదును పెడుతున్నారు. తమతమ రంగాల్లో భవిష్యత్తును అంచనా కడుతున్నారు. ఉదాహరణకు ఔషధాల తయారీ, మరికొన్ని పారిశ్రామిక ఉత్పత్తుల కోసం ప్రపంచం చైనాను కాదని, మనదేశం వైపు మొగ్గుచూపే అవకాశాలను నిపుణులు లెక్కలు కడుతున్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో మనదేశం బలీయమైన శక్తిగా ఆవిర్భవించే సూచనలను గమనిస్తున్నారు. అవసరాలే సరికొత్త ఆవిష్కరణలకు తల్లివేళ్లనే ఆంగ్ల సూక్తిని గుర్తు చేసుకొంటున్నారు. ఈ అంచనాలు, వాటికి తగిన మార్గదర్శకాలు, దిశానిర్దేశాలు ఆయా నిపుణుల పని.
ప్రకృతికి విముక్తి
ఈ యుగసంధిలో సామాజిక జీవన వ్యవస్థలోనూ పెను కుదుపు సంభవించింది. మనిషిని కట్టిపడేసి, ప్రకృతి అతడి ధృతరాష్ట్ర కౌగిలినుంచి తాను విముక్తం కావడానికి సమాయత్తమైంది. తనను తాను స్వయంగా శుద్ధి చేసుకొనే పనిలో పడింది. అయితే ప్రకృతి దయామయి. తల్లి మనసు తనది. ఆ స్వభావానికి అనుగుణంగానే సంజె జారిపోతూ వేకువకు హామీ ఇస్తుంది. విత్తు చీలిపోతూ చిగురుకు జీవం పోస్తుంది. మబ్బు తేలిపోతూ చినుకును జారవిడుస్తుంది. ఆ వేకువను లేత చిగురును వానచినుకును ముందుగానే గుర్తుపట్టి సుప్రభాత స్వాగత గీతాలను ఆలపించే బాధ్యత వైతాళికులది. అలాగే కాలం కడుపున దాగిన మార్పులను అవగాహన చేసుకొంటూ, మారుతున్న తరాన్ని, దాని విలక్షణ స్వరాన్ని పసిగట్టే పని దార్శనికులది. ఆ విషయమై సామాన్య ప్రజానీకానికి తగు సూచనలను అందించవలసిన పని మేధావులది. ఇప్పుడు ప్రసార మాధ్యమాల ప్రధాన బాధ్యత సరిగ్గా అదే! ‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ... ఉదయించి అలానే ఉండాలనుకోవడం దురాశ’ అని కాళోజీ చెప్పిన మాటలను స్మరించుకొంటూ జాతికి నిజమైన ఆశను పరిచయం చేయాలి. జనాన్ని వాస్తవంలో నిలబడేలా చేయాలి. సాంకేతిక చక్షువుల సాయంతో వారికి వెలుగుబాటలు చూపించాలి. మాధ్యమాలు మనిషిని ముందుకు నడిపించాలి.
కరోనా వ్యాధి పీడితులు తప్ప తదితర రోగులు కనపడక ఆస్పత్రులు బోసిపోవడాన్ని సమీక్షిస్తూ ఒక ప్రముఖ వైద్యుడు ‘జనం రోగాలను ‘కొని’ తెచ్చుకోవడం మానేశారు... మాకు పనిలేకుండా పోయింది’ అని వ్యాఖ్యానించారు. జనం తిళ్లు తిరుగుళ్లు తాగుళ్లు అలవాట్లు ఆచారాల్లో ఒక్కసారిగా వచ్చిన బలమైన మార్పును ఆ వ్యాఖ్యానం ప్రతిబింబిస్తోంది. ఇంటిపట్టున ఉంటూ, శుచి శుభ్రతలు పాటిస్తూ స్వయంగా వండుకు తింటూ పచ్చిగాలి పీలుస్తూ ఇన్ని రోజులు గడిపాం మనం. ఉరుకులు పరుగుల నుంచి బయటపడ్డాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన తాత ముత్తాతలు ఎలా బతికారో మనం అలా బతుకుతున్నాం. కాబట్టే ఆరోగ్యంగా ఉన్నాం. తోచకో, ఇష్టపడో మనలో కొందరు ఆసనాలు వ్యాయామాలు ప్రాణాయామాలు ఆరంభించారు. ఊపిరితిత్తుల దమ్ము పెరిగింది. దేహంలో రోగ నిరోధక శక్తి పుంజుకొంది. జనమంతా ఇలా మారిపోతే ఇక మాతో ఏం పని పడుతుందని ఆ వైద్య ప్రముఖుడి ప్రశ్న. ఇందులో నిజం ఉంది. ఇదే వేసవిలో గత పది పదిహేనేళ్లుగా మనం అనుభవించిన ఉడుకునుంచి ఉక్కబోత నుంచి ఈ ఏడాది కొద్దిగా ఉపశమనం పొందాం. ప్రకృతి అనుకూలించడంతోపాటు మనలో తట్టుకొనే శక్తి కొంత పెరగడం కూడా దీనికి కారణం అంటున్నారు వైద్యులు. అంతెందుకు, ఎండలో పడి తిరిగొచ్చి వెంటనే ఫ్రిజ్జుల్లోంచి చల్లని నీళ్లు తీసుకొని తాగేసే అలవాటు మనకు తప్పిందా లేదా!
సాధారణంగా ఇలాంటి మంచి అలవాట్లు వరసగా 21రోజులపాటు పాటిస్తే శరీరం దానికి అలవాటుపడి పోతుందని పెద్దలు చెబుతారు. చెడు వ్యసనాలను వదుల్చుకోవాలంటే 40రోజులు పడుతుందన్నారు. ఆ రెండు కాల వ్యవధులూ పూర్తయి, నిర్బంధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మొహాలు తేటపడ్డాయి. కనుక నిర్బంధాలు, సడలింపుల విషయం మరిచిపోయి- శుచి శుభ్రతలూ శారీరక వ్యాయామాలను నిత్యజీవితంలో భాగంగా మార్చుకొంటే ఈ ‘మండల దీక్ష’లకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఆయుర్దాయాలు పెరుగుతాయి.
సిసలైన పౌరులుగా...
తేటపడిన నదులు అమృత జలాలను హామీ ఇస్తున్నాయి. శుభ్రపడిన మబ్బులు ఆనందాన్ని వర్షిస్తామంటున్నాయి. తేలికపడ్డ గాలులు ఆరోగ్యానికి బీమాగా నిలుస్తున్నాయి. తేరుకున్న ప్రకృతి మనిషిలో ధీమాకు కారణమవుతోంది. మనం బాగుండాలంటే మన చుట్టుపక్కలవాళ్లూ బాగుండాలన్న ఎరుక బలంగా నాటుకొని, అందరికోసం ఆలోచించే మంచి బుద్ధి మనిషిలో అంకురించింది. ‘సర్వేజనాః సుఖినో భవన్తు’ అనే ఆర్ష ఆశంసకు అది ప్రతిరూపమై మనిషి విశ్వనరుడిగా మార్పు చెందుతున్నాడు. అంటే ‘నేను నా వాళ్లు, నా కోడి నా కుంపటి...’ స్థాయినుంచి మనిషి మనుగడ మలుపు తిరిగి ఒకప్పటి మహర్షులు మహాత్ములు తీర్చిదిద్దిన భారతదేశపు అసలు సిసలు పౌరులుగా మారుతున్నాం మనం. వారికి సరైన వారసులం అవుతున్నాం. నిజమైన భారతీయులం అవుతున్నాం మనం. ఇలాంటి భారతదేశం కోసమే ప్రపంచం ఎదురుచూస్తోంది. మనం ఆలపించే వైతాళిక గీతాల కోసం ఈ యుగసంధి వేచి ఉంది. ఈ మలుపులను మార్పులను సద్వినియోగం చేసుకుంటామని ఆశగా మనకేసి చూస్తోంది.

No comments:

Post a Comment