Tuesday, June 9, 2020

హిందూరణభేరి - మనం ఎవరం? ఎందుకిలా అయ్యాం?

#everyoneshouldbe_know

కాస్త పెద్ద పోస్టే అయినా దయచేసి నిదానంగా తప్పకుండ చదవగలరు.
ఎలా వామపక్ష మెకాలే ప్రభావంలో నిజాలు మరుగున పరచారు
మనకి తెలియాలి. తెలిసి తీరాలి.
హిందూరణభేరి. ..........................
మనం ఎవరం? ఎందుకిలా అయ్యాం?
(ఎం.వి.ఆర్. శాస్త్రి)

మొత్తం భారత జాతి ఇవాళ ఒక విమూఢ, అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. దీని వెనక చాలామంది గ్రహించని, లేక సరిగా పోల్చుకోలేని పెద్దకుట్ర ఉన్నది. ఇది ఈనాటిది కాదు. ఇంగ్లిషువాళ్లు ఏ దుర్ముహూర్తాన మన పుణ్యభూమిలో అడుగుపెట్టి, కుట్రలూ కూహకాలతో మెల్లిమెల్లిగా దేశాన్ని ఆక్రమించారో - అప్పటినుంచే మనమీద అబద్ధాల దండయాత్ర మొదలైంది.
ఒకప్పుడు యావత్ప్రపంచంలో జేగీయమానంగా వెలుగొందింది ఒకే ఒక ఆర్యజాతి. దేశదేశాల్లో ఖండఖండాంతరాల్లో విలసిల్లింది ఒకే ఒక ఆర్యనాగరికత. అలనాడు భూమండలం సమస్తం ఆర్యావర్తమే. ఇందుకు రుజువుల కోసం ఏ గ్రంథాలనూ తిరగేయనక్కర్లేదు. ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు. ఆసియా నుంచి యూరప్ దాకా, ఆఫ్రికా నుంచి అమెరికా దాకా అనేక ఖండాల్లో... కాలక్రమాన క్రైస్తవానికో, ఇస్లాంకో, మరో మతానికో, ‘ఇజా’నికో లొంగిపోయిన మలేషియా, ఇండోనేసియా, కంబోడియా, వియత్నాం, లావోస్, చైనా, జపాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, ఇరాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, రష్యా, ఇటలీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, మెక్సికో, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో తవ్వకాల్లో బయల్పడిన శిల్పాలను, కట్టడాలను ఒక్కసారి గమనిస్తే చాలు. అంతటా విలసిల్లినది ఆర్య నాగరికతే కాకపోతే ఆ నాగరికతకు ఆనవాళ్లయిన హవనకుండాలు, యజ్ఞశాలలు, వైదిక పూజా సామగ్రి అనేకానేక దేవతామూర్తులు, అసంఖ్యాక దేవాలయాలు, అతిప్రాచీన కట్టడాలు ఆయా దేశాల్లో ఇటీవలి దశాబ్దాల్లో ఎలా బయటపడ్డాయి?
విశ్వమంతటా విస్తరించిన ఆర్య నాగరికత క్రైస్తవ, మహమ్మదీయ మతాలు పుట్టుకొచ్చాక అనేక దేశాల్లో దారుణమైన దాడికి గురైంది. భయంకరమైన విధ్వంసాల మూలంగా, లక్షల కోట్ల సంఖ్యలో సామాన్య ప్రజల ఊచకోతల కారణంగా అనేక దేశాల్లో నిలవనీడ లేకుండా కనుమరుగైంది. దాని ఉనికి భారత ఉపఖండంలోనే మిగిలింది. ఆ స్థితిలో దేశాన్ని కబళించిన ఇంగ్లిషు వారు మనల్ని మన మూలాల నుంచి వేరు చేయడం కోసం పథకం ప్రకారం కుట్ర పన్నారు.
ఆర్యులు బయటివారని, ఇంగ్లీషువాళ్లలాగే వేరేదేశంనుంచి వచ్చి మన దేశంమీద దాడిచేసి, ఇక్కడి ఆదివాసి ద్రావిడ నాగరికతను నాశనంచేసి, దేశాన్ని ఆక్రమించారని ఆంగ్లేయులు తప్పుడు సిద్ధాంతం లేవదీశారు. మాక్స్‌ముల్లర్‌లాంటి మాయదారి క్రైస్తవ మిషనరీలు బ్రిటిషు సామ్రాజ్యవాద ప్రయోజనాలకు తగ్గట్టు తిమ్మిని బమ్మిగా చూపెట్టి కల్లబొల్లి చరిత్రలు సృష్టించారు. ఆ పచ్చి అబద్ధాలను పాఠ్యపుస్తకాలకెక్కించి మెకాలే విద్యావిధానంలో విద్యార్థుల బుర్రలు ఖరాబుచేసిన కారణంగా కొన్ని తరాలు గడిచేసరికి అవే అక్షరసత్యాలైనట్టు మన విద్యావంతుల మనసుల్లో ముద్రపడిపోయింది.
దానివల్ల ఎంత అనర్థం జరిగిందో నేను మీకు చెప్పక్కర్లేదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన, మొత్తం మానవాళికి విద్య, విజ్ఞానం ప్రసాదించిన వైదిక ఆర్య సంస్కృతికి వారసులమైనందుకు గర్వించవలసిందిపోయి సిగ్గుపడే దౌర్భాగ్య పరిస్థితిని మెకాలే మార్కు ఇంగ్లీషు చదువులు తెచ్చిపెట్టాయి. మనకు తెలిసిన పదివేల సంవత్సరాల భారత చరిత్రలో అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఆర్య వారసత్వబంధం ఇంగ్లిషువారి అబద్ధాల మాయాజాలం మూలంగా బలహీనపడింది. విజ్ఞానఖనులైన తమ పూర్వులను అనాగరికులుగా, మూర్ఖులుగా భావించి తెల్లవారు వచ్చాకే మనకు విద్య, వైజ్ఞానిక సంస్కారం అబ్బాయన్న బానిస మనస్తత్వం చదువుకున్న వారిలో గూడు కట్టింది.
పోనీ- ఇంగ్లిషువారు జండా పీక్కొనిపోయి, దేశానికి స్వాతంత్య్రమనబడేది వచ్చాకైనా ఈ దురవస్థ పోయిం దా?తమ చరిత్రను, సాంస్కృతిక మూలాలను, ప్రాచీన వారసత్వాన్ని వెతికి పట్టుకుని, నిజమైన జాతీయ పునరుజ్జీవనం సాధించేందుకు స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాల్లోవలె హిందుస్తాన్‌లో కనీసం ప్రయత్నమైనా జరిగిందా? లేదు. ఇంగ్లిషు బడిలో బుద్ధిశుద్ధి జరిగిన మెకాలే మానసపుత్రులే స్వతంత్ర భారతానికీ భాగ్యవిధాతలయ్యారు. గతమంతా అంధకారబంధురమైనట్టూ, అజ్ఞానానికి, మూఢ విశ్వాసాలకు నెలవైనట్టూ, ఇంగ్లిషువారి దయవల్ల విద్యావంతులైన తమవంటివారు పాశ్చాత్య నాగరికత ప్రభావంతో నడిపిన జాతీయోద్యమంవల్లే స్వాతంత్య్రం వచ్చినట్టూ వారు నిజంగానే నమ్మారు. తమకు స్ఫూర్తినిచ్చిన ఆంగ్లేయులు వదిలివెళ్లిన వారసత్వానే్న వారు నిష్ఠగా కొనసాగించారు.
కఠోర వాస్తవం ఏమిటంటే మనకు అసలైన స్వాతంత్య్రం ఇప్పటికీ రాలేదు. 1947 ఆగస్టు 15న జరిగింది అధికారం మార్పిడి మాత్రమే. బ్రిటిషువారినుంచి వారి అభిమానుల చేతిలోకి రాజ్యాధికారం మారింది. తమ సామ్రాజ్య అవసరాల నిమిత్తం తెల్లవారు తెచ్చి రుద్దిన వంకర విద్యావిధానమే అష్టవంకరలతో ఈనాటికీ కొనసాగుతున్నది. బిటిషువారు మనలని అణగదొక్కడానికి పెట్టిన ఇండియన్ పీనల్‌కోడే, వారు తెచ్చిన పోలీసు చట్టమే, ఎవిడెన్సు యాక్టుల్లాంటి కాలం చెల్లిన శాసనాలే నేటికీ కొనసాగుతున్నాయి. భారతదేశ వైజ్ఞానిక ఘనతను, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మొత్తం ప్రపంచం గుర్తించినా బుద్ధిలేని మన బుద్ధిజీవులకు మాత్రం వాటిని అంగీకరించటానికి మనసొప్పటం లేదు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం (Aryan Invasion Theory) శుద్ధ తప్పు; ఆర్యులు ఎక్కడినుంచో ఇక్కడికి రావటం కాదు; ఇక్కడినుంచే ప్రపంచమంతటికీ విస్తరించారు; వైదిక సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు- అని ఇవాళ సమస్త భూమండలం గుర్తించినా మనం మాత్రం ఆర్యుల దండయాత్ర గురించే ఇంకా పాఠాల్లో బోధిస్తున్నాం.
కొంతకాలం కింద 2వేల సంవత్సరాల పూర్వపు చక్రవర్తి సమాధి చైనాలో బయటపడింది. 1400 ఏళ్ల కిందటి విష్ణు విగ్రహం రష్యాలో దొరికింది. తమ పూర్వచరిత్రకు సంబంధించి గొప్ప ఆధారాలు లభించాయని, ఆ రెండు దేశాల వారు మురిసిపోయారు.
మరి మన దేశంలోనో? శ్రీకృష్ణ భగవానుడి ద్వారకానగరం సరిగ్గా పురాణాలు వర్ణించిన రీతిలోనే సముద్రగర్భంలో బయటపడినా... శ్రీరామచంద్రుడు నిర్మించిన సేతువును యథాతధంగా అమెరికన్ ‘నాసా’ కనుగొన్నప్పటికీ జాతీయ వీరులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కనీసం చారిత్రక వ్యక్తులని అంగీకరించటానికే మన చరిత్ర విదాతలకు మనసొప్పదు. మన జాతికి గర్వించదగిన ఘనచరిత్ర ఉందని ఒప్పుకోడానికి మనవాళ్లే ససేమిరా ఇష్టపడరు.
సీతామాత రామచంద్రుడిని ‘ఆర్యపుత్రా’ అని పిలిచినట్టే రావణాసురుడిని మండోదరికూడా ‘ఆర్యపుత్రా’ అనే పిలిచింది. అయినా శ్రీరాముడు ఆర్యుడు; రావణుడు ద్రావిడుడు; ద్రావిడులకు ఆర్యులు శత్రువులు అని మొండిగా వాదించే మూర్ఖులే ఇవాళ మహామేధావులుగా చలామణి అవుతున్నారు. శత సహస్రాబ్దాల చరిత్రగల అఖండ వైదిక సంస్కృతి గురించి, ఆర్యావర్త చరిత్ర గురించి తమతమ మిడిమిడి జ్ఞానంతో తీర్పులు చెబుతున్నారు. చరిత్ర గ్రంథాలు రాసేది, పాఠాలు బోధించేది ఇలాంటి వారే కాబట్టి ఇలాంటి సాంస్కృతిక దుష్ప్రచార కాలుష్యాల మూలంగా తమ జాతి పూర్వ ఔన్నత్యం, దాని పూర్వీకుల గొప్పతనం, వేద వేదాంగాల వైశిష్ట్యం, గర్వించదగ్గ ఆర్యవారసత్వం ఈ కాలపు వారికి తెలియకుండా పోయాయి.
భారతదేశానికి మతమూ, ఆధ్యాత్మికతలే మూలాధారాలని స్వామి వివేకానంద అన్నారు. జాతి జీవితానికి పునాదుల్లాంటి ఆ రెండే నేటి అభారతీయ సూడో సెక్యులర్ విష సంస్కృతిలో ఈ కాలపు వారికి సిగ్గుపడదగ్గ విషయాలు అయిపోయాయి. తమ ఆధ్యాత్మిక మూలాలనుంచి ఇప్పటితరాలు వేరుపడటంవల్లే జాతీయ జీవనంలో రకరకాల వైకల్యాలు చోటు చేసుకుంటున్నాయి. సనాతన ధర్మం తన దేశంలో తానే పరాయిది అయిపోతున్నది. క్రైస్తవ, మహమ్మదీయ మతాంతరీకరణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. ధర్మాన్ని నమ్ముకున్న హిందూ సమాజంమీద దాడులు నిరంతరంగా సాగుతున్నాయి.
ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా, ఎన్ని వందల సంవత్సరాలు పరాయిమతాల దాష్టీకంలో మగ్గినా దేశంలో నూటికి 80 మంది ఇంకా హిందువులుగానే మిగిలారు. మెజారిటీ ప్రజలు ఏ మతానికి చెందినవారయితే ఆ మతానికి అన్ని జీవనరంగాల్లో అత్యం త గౌరవస్థానం దక్కటం ప్రపంచమంతటా ఉన్నదే. పెద్దమతానికి ప్రాధాన్యం ఇస్తూనే ఇతర మతాలనుకూడా ఆదరించి, స్వేచ్ఛగా బతకనివ్వడమే అన్ని నాగరిక దేశాల్లో జరుగుతున్నది. కాని ఇండియా దటీజ్ భారత్‌లో మాత్రం మెజారిటీ మతాన్ని అణగదొక్కి మైనారిటీ మతాలను నెత్తిన పెట్టుకోవడమే సెక్యులరిజం వ్రతంగా చలామణి అవుతున్నది. మైనారిటీలకు ఉన్న పాటి సదుపా యాలకు, ప్రత్యేక గౌరవాలకు కూడా మెజారిటీ మతం నోచుకోవడం లేదు.
ముస్లింల, క్రైస్తవుల ప్రార్థనా స్థలాల నిర్వ హణలో ప్రభుత్వం జోక్యం ఉండదు. కాని హిందువుల ఆలయాల మీద, దేవుళ్లకు భక్తు లిచ్చే కానుకల మీద సర్కారు ఇష్టారాజ్యం గా కర్ర పెత్తనం చేస్తున్నది. ముస్లింల హజ్‌యాత్ర లకు ప్రజల సొమ్ముతో సబ్సిడీలు దోచిపెట్టేవా రు. హిందువుల అమర్‌నాథ్ యాత్రకు, మానస సరోవర్ యాత్రకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వరు. పైగా పుష్కరాలు, కుంభమేళాల వంటి సీజన్లలో ప్రయాణికుల మీద ఎలాంటి సర్చార్జీలు, అద నపు రుసుములు మోపాలా అని దారులు వెతుకుతుంటారు. దేశమంతటికీ వర్తించే సివిల్ కోడుకు మహమ్మదీయులు అతీతులు. ముస్లిం లు ఎన్ని పెళ్లిళ్లయనా చేసుకోవచ్చు. ఎందరు పిల్లలనైనా కనవచ్చు. పిల్లల ఉత్పత్తి ద్వారా తమ జనాభాను ధారాళంగా పెంచుకుంటూ పోవచ్చు. చట్టాల కట్టుబాట్లు, కట్టడులు అన్నీ హిందువుల మీదే. రంజాన్ మాసంలో రూమీ టోపీలు పెట్టి ప్రజల సొమ్ముతో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే నేతాశ్రీలు దసరా, శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనమంటే మాత్రం తమ సెక్యులరిజం మైల పడినట్టు గింజుకుంటారు. అలాగే హిందువులు తమ డబ్బుతో తాము స్థాపించే ధార్మిక ట్రస్టులకు ‘హిందూ’ పదాన్ని సూచించే పేరు పెట్టుకుంటే ఇన్‌కంటాక్సు మినహాయంపులు ఇవ్వరు. విదేశాల నుంచి క్రైస్తవ మతాంతరీ కరణలకు వచ్చే వేల కోట్ల రూపాయలకు మాత్రం అజాపజా ఉండదు.
అనాదిగా గోవు మనకు దేవత. మతభేదాలు ఎన్ని ఉన్నా, సంప్రదాయాలు వేరు అయినా గోవును పూజించే విషయంలో అందరిదీ ఒకటే మాట, ఒకటే మతం. అటువంటి మన దేశంలో ఇవాళ గోవధ, గోమాంస భక్షణ విచ్చలవిడిగా, నిరాఘాటంగా జరిగిపోతున్నాయి. గోవధ నిషేధాన్ని రాజ్యాంగం ఆదేశక సూత్రాల్లో చేర్చితేనేమి? గోసంతతిని వధిస్తే తప్ప వాటి నాణ్యమైన చర్మాలను ఎగుమతిచేసి, లాభాలు పొందడం కుదరదు కాబట్టి... ఉన్న గోవులన్నిటినీ మేపడానికి దేశంలోని గడ్డి సరిపోదు కాబట్టి గోవధలను అనుతించాల్సిందే అని జవాహర్ లాల్ నెహ్రుగారు ప్రధానిగా ఉన్న స్వతంత్ర భారత తొలి ప్రభుత్వమే పాపభీతి లేకుండా ఆదేశాలు జారీచేసిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. అనేక రాష్ట్రా ల్లో గోవధ నిషేధం చట్టరీత్యా అమల్లో ఉంటే మాత్రమేమి? తనకు గోమాంసం తినాలని నోరూరుతోందని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ మధ్య బహిరంగంగా వదిరాడు. సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలలోనే ‘బీఫ్ ఫెస్టివల్స్’ బరితెగించి సాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో గోవధ చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని హైకోర్టే ఇటీవల స్పష్టం చేసింది. కానీ అదే రాష్ట్రంలోని చట్టసభలో సభ్యులైనవారే గోమాంసంతో బహిరంగంగా విందులు చేసుకోగలుగుతున్నారంటే మనం స్వతంత్ర హిందుస్తాన్‌లో ఉన్నట్టా? మొగలారుూల పాలనలో ఉన్నట్టా? ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఊళ్లో ఆవుదూడను దొంగిలించి కోసుకుతిన్న ఒక మహమ్మదీయుడిని స్థానికులు కొట్టిచంపిన ఒక అభ్యంతరకరమైన, దురదృష్టకరమైన ఘటనను ఆసరా చేసుకుని, దేశమంతటా మేధావులు మిడతల దండులా విరుచుకుపడుతూ ప్రధాని నరేంద్రమోదీయే, మొత్తం హిందూ సమాజమే ఆ హత్యను దగ్గరుండి చేయించినట్టు గగ్గోలు పెడుతున్నారంటే ఏమనాలి?
విద్యావంతులకే విజ్ఞత కొరవడి, జాతి జీవితం సంక్షుభితమైన ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవలసింది ఋషి దయానంద్‌జీ ప్రతిష్ఠించిన ఆదర్శాన్ని. 1857 ప్రథమ స్వాతం త్య్ర సంగ్రామం దురదృష్టవశాత్తూ విఫలమై, తెల్లవారి ఆగడాలకు అడ్డులేకుండా పోయి, జాతీయశక్తులు దిక్కుతోచక డీలాపడిన స్థితిలో పూజ్య దయానంద సరస్వతి మహాస్వామి గోరక్షణ ఉద్యమంతో యావద్భారతంలో అపూర్వ చైతన్యం తెచ్చారు. 1880లో ఆయన ఆరంభించిన గౌసంరక్షిణి మహాసభ ఆయన నిర్యాణం తరవాత కూడా 1894 దాకా పధ్నాలుగేళ్ల పాటు అద్భుతంగా పనిచేసింది. ఋషి దయానంద్‌జీ గొప్పతనం ఏమిటంటే ఆయన ప్రబోధానికి ప్రభావితులై ఎందరో మహమ్మదీయులుకూడా గోరక్షణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఏ ఊళ్లో అయినా ఎవరైనా గోవధకు పాల్పడుతున్నట్టు తెలిస్తే మహ్మదీయులు సహా ఊరివారందరూ కలిసివెళ్లి ధర్నాచేసి ఆ ప్రయత్నాన్ని ఆపించిన ఉదంతాలను ధర్మపాల్‌జీ తన Bristish Origins of Cow Slaughter In India గ్రంథంలో ఉటంకించారు.
చూశారా? హిందువులు ముస్లిములు కలిసి గోవధను వ్యతిరేకించిన ఆ కాలంనుంచి... గోమాంసం తింటే తప్పేమిటని హిందువులమని చెప్పుకునేవారే బహిరంగంగా వాదులాడే ఈ కాలానికి మనం ఎంతగా దిగజారామో!
ఈ ధార్మిక పతనం ఇంకా తీవ్రమై, మనజాతి సర్వభ్రష్టం కాకముందే మనందరం జాగరూకులం కావాలి. గోవు, వేదం పదిలంగా ఉన్నప్పుడే భారతదేశంలో భారతీయత వర్ధిల్లుతుంది. జాతిని కాటువేయజూస్తున్న విదేశీయ మత, సామ్రాజ్యవాదశక్తులు, వాటికి తొత్తులైన సూడో సెక్యులరిస్టులు, మతి చెడిన మేధావులు, రకరకాల దుష్ట రాజకీయ, కార్పొరేట్ శక్తులు ఏకమైన అపవిత్ర కలయిక (unholy alliance) ను ఎదుర్కొనటం తేలిక కాదు. చిరకాలంగా ఈ దేశ ప్రజలు పడుతున్న తపన ఫలితంగా, ఎందరో మహాత్ముల తప్ఫఃలం కారణంగా, దేశవ్యాప్తంగా పెల్లుబికిన అపూర్వ చైతన్యం మూలంగా ఇనే్నళ్ల తరవాత ఎట్టకేలకు ధర్మానికి అనుకూలమైన, ఉజ్వల జాతీయ వారసత్వంపట్ల అభిమానం, నిబద్ధత కలిగిన ప్రభుత్వమనేది నరేంద్రమోదీ నాయకత్వంలో సుస్థిర మెజారిటీతో ఏర్పడింది. దాన్నిచూసి ఓర్వలేక, నిర్ణీతకాలంకూడా దాన్ని అధికారంలో కొనసాగనివ్వకుండా, అభివృద్ధి మీద, ధర్మబద్ధపాలనపై మీద దృష్టిసారించే సావకాశం ఇవ్వకుండా అడ్డుపడి, అకారణ వివాదాలను రేకెత్తించడంద్వారా ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో భ్రష్టుపట్టించి మళ్ళీ ఇటలీ రాణి రిమోట్ కంట్రోలు పరిపాలనను తెచ్చిపెట్టటానికి భయంకరమైన పన్నాగం జరుగుతున్నది.
దీన్ని ఎదుర్కోవడం కేవలం నరేంద్రమోదీకీ, భారతీయ జనతా పార్టీకీ మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. ప్రమాదం ఆసన్నమైంది మొత్తం భారతీయ సంస్కృతికి. యావత్ హిం దూ సమాజానికి. కాబట్టి ఆ సంస్కృతిని, సనాతన ధర్మ ఘన వారసత్వాన్ని గౌరవించే ఆధ్యాత్మిక, స్వచ్ఛంద, మత, మతేతర సంస్థలుకూడా ఈ ధార్మిక కురుక్షేత్ర యుద్ధంలో క్రియాశీల పాత్ర వహించడం చారిత్రక అవసరం. సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి మీదా దుర్మార్గపు దాడుల నుంచి ధర్మాన్ని రక్షించుకోవడానికి కార్యోన్ముఖం కావలసిన బాధ్యత ఉంది. మనకేమి పట్టిందని ఎవరికి వారు ఊరకుంటే చివరికి భారతదేశంలో ధర్మానికి నిలవనీడ లేకుండా పోవచ్చు. ధర్మమే అంతరించినప్పుడు మనం ఉండీ ఒకటే - లేకా ఒకటే.
ఈ సందర్భంలో ముఖ్యంగా ఆర్య సమాజ్ చేయవలసింది, చేయగలిగింది ఎంతో ఉంది. ఈ మహాసంస్థ దివ్య చరిత్రను ఆవలోకిస్తే నాబోటి వారికి అర్థమయ్యేదేమిటంటే దేశానికి, సమాజానికి ఎప్పుడు ఆపదవచ్చినా ముందుం డి పోరాడటంలో ఆర్యసమాజ్ ఎప్పుడూ వెనకాడలేదు,. మహర్షి దయానంద్‌జీ నడిపించిన 1880లనాటి గోరక్షణ ఉద్యమంనుంచి... స్వామి శ్రద్ధానంద్‌జీ అద్భుతంగా సాగించి, కడకు ఆత్మబలిదానం కావించిన 1920ల దశకపు ‘శుద్ధి’, ‘సంఘటన’ ఉద్యమాల వరకూ... హైదరాబాద్ స్టేట్‌లో నిజాంను గడగడలాడించి, హిందూ సమాజానికి రక్షగా నిలిచిన 1930ల దశకపు సత్యాగ్రహాలు మొదలుకుని, భగత్‌సింగ్‌లాంటి ఎందరో విప్లవ వీరులకు ప్రేరణ నిచ్చిన పంజాబ్ పోరాటాల వరకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు.
సగర్వంగా చెప్పుకోదగ్గ అంతటి పోరాట చరిత్ర కలిగిన ఆర్యసమాజ్... స్వామి శ్రద్ధానంద, లజపత్‌రాయ్, భా య పరమానంద్, నరేంద్రజీ, ఆచార్య ఉదయవీర్ శాస్ర్తీ వంటి మహామహుల తరం అంతరించాక ఎందువల్లో తన పరిధిని కుంచించుకున్నది. వేదాధ్యయనానికి, వైదిక కర్మకాండకు ఇస్తున్న ప్రాముఖ్యాన్ని... సాంఘిక దురాచారాలను, మతపరమైన మూర్ఖత్వాలను ఎదుర్కోవడంలో కనపరుస్తున్న శ్రద్ధను సమకాలీన సమస్యలను, అధార్మిక శక్తుల విజృంభణను, సాంస్కృతిక, సామాజిక రాజకీయ వికృతులను ఎదుర్కోవటం మీద అంతగా కనపరచటంలేదు.
ఇప్పటికి నూరేళ్ల కింద ఉపేంద్రనాథ్ ముఖర్జీ అనే పెద్దమనిషి The Dying Race అనే ఛిన్న పుస్తకం రాసి దేశంలో పెద్ద సంచలనం తెచ్చా డు. హిందువుల జనాభా పెరుగుదల క్రమేణా తగ్గుతూ ముసల్మాన్ల జనాభా అంతకంతకూ పెరుగుతున్న ధోరణి కొనసాగితే నాలుగువం దల సంవత్సరాల్లో దేశంలో హిందూజాతి పూర్తిగా అం తరించిపోతుందని గణాంక వివరాలతో ఆయన హెచ్చరించాడు. నూరేళ్ల కిందటి కంటే ఆ హెచ్చరిక ఇవాళ అక్షరాలా యధార్థం. దేశంలో ఇప్పటికీ నూటికి 79 మంది హిందువులని 2011 జనాభా లెక్కలు చెబుతు న్నాయిగాని ఆ గణాంకాలు పచ్చి అబద్ధం. క్రైస్తవ మతంలోకి లాగబడ్డ దళిత కులస్థులు రిజర్వేషన్ల లాభం కోసం తమను తాము హిందువులుగానే నమోదు చేసుకోవటం వల్ల... ప్రలోభాలకు లోబడి ఆ మతం పుచ్చుకున్న ఇతర కులస్థులు కూడా ఆ విషయం దాచి పుచ్చి రికార్డుల్లోకి హిందువు లుగానే ఎక్కడంవల్ల మనకు యధార్థస్థితి తెలియడం లేదు. ఈశాన్య రాష్ట్రాలు మనవి కాకుండా పోయి పూర్తిగా క్రైస్తవ ప్రాబల్యం లోకి వెళ్లాయి. ఇతర రాష్ట్రాల్లోనూ మతాం తరీకరణలు లక్షల కోట్ల రూపాయల విదేశీ నిధులతో ఉద్ధృతంగా సాగుతున్నాయ. మనలను మభ్యపెట్టే మాయ తెరలను ఏదో ఒకనాడు తొలగించి, హిందూ స్తాన్‌లో హిందువులు మైనారిటీ అయిపో యారన్న భయంకర వార్తను మన చెవిన వేయ రన్న గ్యారంటీ ఏమీ లేదు. అటువంటి దుర్దినం రాకుండా మనం ఇప్పుడే మేలుకోవాలి.
ఇంతకాలమూ వేద విజ్ఞానాన్ని, వైదిక సంప్రదాయాన్ని నిష్ఠగా కాపాడుకొస్తూ... ధర్మ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న ఆర్య సమాజ్ వంటి మహా సంస్థలు సనాతన ధర్మ పునరుత్థానానికి ఇకపై జరగవలసిన సమిష్టి బృహత్ యజ్ఞంలో కీలక భూమిక వహించాల న్నదే నా కోరిక.

జైహింద్
జై భారత్
జై శ్రీరామ్
--- (ఎం.వి.ఆర్. శాస్త్రి)
-
- Source: Whatsapp Sandesham 🙏🙏🚩🚩🚩🚩🚩🚩

No comments:

Post a Comment