Thursday, November 19, 2020

జ్ఞాన దీపం

🌸జ్ఞాన దీపం🌸

తెల్లవారే ముందు ప్రతి రోజూ ఆకాశం రాగరంజితంగా, మనోహరంగా మనల్ని అలరిస్తుంది. కళాదృష్టితో చూసేవారికి ప్రతి ఉషోదయం ఒక మహోజ్జ్వల దృశ్యకావ్యంగా కళ్లకు కడుతుంది. గతంలో ఎన్నో ఉషోదయాలు వచ్చి వెళ్లిపోయాయి. ఇకముందు కూడా ఎన్నెన్నో రాబోతున్నాయి. అవి మన గతానికి, భవితకు సంకేతాలు. మన జీవితాలకు అర్థం, పరమార్థం ఉన్నాయని ఆకాశ పుత్రిక ఉష గుర్తు చేస్తుంది. పైన ఆకాశం, కింద భూమి... మధ్యన మనం ఉన్నాం. అటు దివ్యత్వం, ఇటు భౌతికత్వం... రెండూ మనకు కావలసినవే. ఇహపర సాధన ద్వారా అమరత్వాన్ని పొందవచ్ఛు మనలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తేవచ్చు అంటారు శ్రీ అరవిందులు.
ఆలోచనాపరుడైన మానవుడికి నిత్య జీవితంలో అయిదు ప్రశ్నలు ఎదురవుతాయి. దైవం అంటే ఏమిటి? అందుకు కావలసిన పూర్ణత్వం ఎలా సాధించాలి? సత్యం అంటే ఏమిటి? ఆనందం ఎక్కడుంది? అమృతత్వం పొందడమెలా? శరీరం ఒక కర్మాగారం, మనసు యంత్రం. యంత్రాన్ని నడిపిస్తే గాని కర్మాగారం పనిచేయదు. యంత్రానికి అమర్చిన ఒక చిన్న మీటపైన ఆధారపడి కర్మాగారం నడిచే విధంగా, దివ్యచైతన్యం సూక్ష్మ రూపంలో మన లోపలే ఉంది. సూక్ష్మంలోనే మోక్షం ఉందంటారు. శరీరం, మనసు, ఆత్మ మధ్య అవినాభావ సంబంధం ఉంది.
శరీరం అనే కర్మా గారాన్ని, మనసు అనే మరను శుభ్రంగా ఉంచుకోకపోతే అవి తుప్పు పట్టి పనికి రాకుండా పోతాయి. పరమార్థం గురించి ఆలోచించకుండా పోతే బతుకు బండబారి, ఒక జీవిత కాలం వృథా అయిపోతుంది. యంత్రాంగాలను కందెన పూసి పనికి సిద్ధం చేసినట్లు- కొత్త ఆలోచనలతో, ప్రయోగాలతో, మనసును అప్రమత్తం చేయకపోతే ఉపాయాలకు బదులు అపాయాలు ఎదురవుతాయి. ప్రగతి బాటలు మూసుకుపోయి, సుగతి ఆకాశ సుమంగా మిగిలిపోతుంది. మనిషి మనీషిగా ఎదగడానికి ప్రయత్నం కావాలి. మానవ ప్రయత్నానికి దైవ సహాయం తప్పకుండా ఉంటుంది.
దివ్యత్వం మన లోపల ఉన్నదని తెలుసుకుని దాన్ని బయటికి రప్పించే ప్రయత్నమే సాధన. దైవారాధన, సత్యసంధత, పూర్ణత్వం పైన దృష్టి, ఆనందాన్వేషణ, అమృతత్త్వం కోసం తపన- అయిదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగల సాధనా మార్గాలు. మనసు మూగబోయి, జీవితం మోడుగా మారే ప్రమాదం నుంచి బయటపడటానికి అవి తగిన ఉపాయాలు. ఈ భౌతిక శరీరంలో ఆధ్యాత్మిక వెలుగు నిండినప్పుడే, దివ్యచైతన్యం రెక్కలు పరచుకుని, దివి నుంచి భువికి గరుత్మంతుడిలా దిగివచ్చి భువిని దివిగా, మనల్ని దివ్య మానవులుగా మారుస్తుంది.
ఇహం అంటే స్వారాజ్యం; పరం అంటే సామ్రాజ్యం. ఇహపర సాధన అంటే మనం ఉన్న చోటునుంచి, మరో ప్రపంచం లోకి అడుగువేయడం అన్నమాట. వామనుడు త్రివిక్రముడిగా ఎదిగిన విధంగానే- మనమూ సార్వభౌమత్వం, సామంతం రెండూ సాధించి చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. సామంతం అంటే సాలోక్యం; సాధర్మ్యం అంటే సార్వభౌమత్వం. అయిదు ప్రశ్నలకు, అయిదు పరిష్కారాలకు ఆఖరిదైన అమృతత్త్వం శిరోభూషణం. అది దొరికితే మిగతావన్నీ సాధించినట్టే. అమృతత్త్వం అంటే జీవన్ముక్తి వివేకం. మనం కోరుకునే అమరత్వం కన్నా ఉన్నతమైన ఆకాంక్ష. ఎవరికైనా సరే- ఈ లోకంలోనే ఒక దివ్య దీపంగా నిలిచి, మరెన్నో ప్రాణ దీపాలు వెలిగించడం ఒక గొప్ప అనుభవం, అనుభూతి. మన ఆనందం అందరి సుఖంలోనే ఉందని తెలుసుకోవడం జీవన్ముక్తి వివేకం. జ్ఞాన దీపాన్ని తోటి మానవుల హృదయ మందిరాల్లో వెలిగించి ఆనందించడం కన్నా వేరే పర్వదినం ఏముంది?

🌹🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment