Saturday, February 6, 2021

From Telugu Yogi Blog …..మదనపల్లి మర్డర్స్ - లోకం నేర్చుకోవాల్సింది ఏమిటి? అసలెందుకు నేర్చుకోవాలి? అనుకోకండి.

From Telugu Yogi Blog …..మదనపల్లి మర్డర్స్ - లోకం నేర్చుకోవాల్సింది ఏమిటి?
అసలెందుకు నేర్చుకోవాలి? అనుకోకండి. నేటి సమాజంలో, పొద్దున్న లేచిన దగ్గరనుండి, వారికిష్టమున్నా లేకున్నా, పిల్లలు పెద్దలు అనేక ప్రభావాలకు లోనైపోతున్నారు. ఈరోజున వీరికిలా జరిగింది. రేపు ఇంకోచోట ఇంకొకరికి ఇంకొకలా జరగొచ్చు. కనుక వీటినుంచి నేర్చుకోవాలి. జాగ్రత్తపడాలి.


ఈ క్రింది విషయాలను గమనించండి.


1. టీవీలలో, యూట్యూబులలో చూచి, పుస్తకాలు చదివి. ఎవరిని బడితే వారిని గురువుగా నమ్మకండి. స్వీకరించకండి.


2. పుస్తకాలు చదివి సాధనలు చెయ్యకండి. అవి నెర్వస్ సిస్టం ను దెబ్బతీస్తాయి. సరియైన గురువు పర్యవేక్షణ లేకుండా ప్రాణాయామాలు, ధ్యానాలు చేస్తే పిచ్చెక్కుతుందని పదేళ్లనుంచీ నేను చెబుతున్నాను.


3. డబ్బులు గుంజే జ్యోతిష్కులను, పూజారులను నమ్మకండి. హోమాలు చేయిస్తామని, పనులు అవుతాయని చెప్పేవారిని ఆమడదూరం ఉంచండి.


4. యూట్యూబు చూచి సమస్యలకు పరిష్కారాలు వెదకకండి. మాకు తెలిసిన ఒకమ్మాయి ఇలా చేసింది. భర్త ఉరిపోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే, వాళ్ళనీ వీళ్ళనీ పిలిచి ముందు సీలింగ్ నుంచి అతన్ని దించాల్సింది పోయి, తీరిగ్గా యూట్యూబ్ ఓపెన్ చేసి 'How to save a hanging person?' అని వెదికింది.


ఇంకొంతమంది how to meditate, how to rise Kundalini, మొదలైన సెర్చ్ లు చేసి అక్కడ కనిపించిన వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైన పనులని తెలుసుకోండి. ఆ అభ్యాసాల వల్ల నెర్వస్ సిస్టం డామేజ్ అవుతుంది. పిచ్చెక్కుతుంది. తర్వాత ఏమనుకున్నా ఉపయోగం ఉండదు.


5. ఒక శుద్ధమైన గురువును ఎంచుకుని అతన్ని త్రికరణశుద్ధిగా అనుసరించండి. అంతేగాని, అనేక పడవలమీద ఒకేసారి ప్రయాణం చెయ్యకండి. అన్నిటికీ చెడిపోతారు.


6. నిజమైన ఆధ్యాత్మికతనేది మనిషిని హింసకు దూరంగా తీసుకుపోతుంది. మూఢనమ్మకాలకు దూరంగా తీసుకుపోతుంది. ద్వేషానికి దూరం చేస్తుంది. అలాకాకుండా, హింస, ద్వేషం, అహంభావం, మూఢనమ్మకాలు ఒకమనిషిలో ఎక్కువౌతుంటే అది అసలైన ఆధ్యాత్మికత కాదని తెలుసుకోండి.


7. మతాలు మారమని చేసే ప్రచారాలకు లోబడకండి. ఎవరూ ఏ మతమూ మారక్కరలేదు. ఉన్నదాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని ఆచరిస్తే చాలు.


8. పూజలలో, తంతులలో, ప్రార్థనలలో ఆధ్యాత్మికత ఉంది. కానీ అది ఎల్కేజీ లెవల్ ఆధ్యాత్మికత మాత్రమే. అంతకంటే గొప్పది నిత్యజీవితంలో ఆధ్యాత్మికత. అది నీ జీవితంలో అనుక్షణం ప్రతిఫలించాలి. నీ కుటుంబంతో, స్నేహితులతో, నీ చుట్టూ ఉన్నవారితో నువ్వు ప్రవర్తించే తీరులో అది కనిపించాలి గాని ఉత్త పూజామందిరానికే పరిమితం కాకూడదు.


9. వర్చువల్ వరల్డ్ నుంచి బయటకొచ్చి రియల్ వరల్డ్ ఎలా ఉందో చూడండి. ఎంతసేపూ మొబైల్, కంప్యూటర్, టీవీ ఇవే జీవితం కాదు. అదొక పెద్ద భ్రమ. వాటి అవసరం ఎంతవరకో అంతవరకే. వాటికి బానిసలు కాకండి.


10. పిల్లలు ఏం చేస్తున్నారో, ఎటు పోతున్నారో గమనిస్తూ ఉండండి. ఏదైనా చెడుదారి పడుతుంటే, మొదట్లోనే దారిమళ్లించండి. లేకపోతే కొంతకాలం తర్వాత అది అసాధ్యం కావచ్చు.


11. మీలోగాని మీ పిల్లలలో గాని మీ కుటుంబసభ్యులతో గాని - 'మేం చాలా గొప్పవాళ్ళం, ఉన్నతులం, ఆధ్యాత్మికులం, మిగతా అందరూ అజ్ఞానులు,ఏమీ తెలియనివాళ్ళు, వాళ్లకు మనం చెబుదాం, నేర్పిద్దాం, ఉద్ధరిద్దాం' - ఇలాంటి పోకడలు కన్పిస్తుంటే, వెంటనే మానసికవైద్యులను కలసి మందులు వాడండి. ఇది పిచ్చిలో ఒక రకమైన 'రెలిజియస్ మానియా' అని గ్రహించండి.


12. ఆత్మలు, పునర్జన్మలు, శక్తులు, మంత్రాలు, తాయెత్తులు, హోమాలు, దయ్యాలు, భూతాలు, ప్రార్థనలతో రోగాలు తగ్గించడాలు, సైతాన్ని వదిలించడాలు మొదలైన వాటి జోలికి పోకండి. వీటివల్ల మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అలాంటివారికి, వాళ్ళు ఏమతం వారైనా సరే, దూరం ఉండండి.


పై విషయాలను పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, జీవితాలు నాశనం కాకుండా జాగ్రత్తపడవచ్చు.


కానీ, చెప్పడంవరకూ చెప్తాము. ఎవరు వింటారు? ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? లోకంలో ఎవరి ఖర్మ వారిది. మంచి చెబితే ఎవరూ వినరు. అనుభవిస్తున్నపుడు మాత్రం గొల్లుమని ఏడుస్తారు. ఈ లోకం ఇంతే !
Powered by PrintFriendly.com

Source - Whatsapp Message

No comments:

Post a Comment