Wednesday, March 10, 2021

కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తలచుకుంటారు. ప్రార్థిస్తారు. సుఖాలు వచ్చినప్పుడు లౌకిక భోగభాగ్యాల్లో మునిగిపోతారు. భగవంతుడి గురించి ఆలోచించరు.

కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తలచుకుంటారు. ప్రార్థిస్తారు. సుఖాలు వచ్చినప్పుడు లౌకిక భోగభాగ్యాల్లో మునిగిపోతారు. భగవంతుడి గురించి ఆలోచించరు. మరికొందరు సుఖాలు కలిగినప్పుడు దేవుణ్ణి స్మరిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు దూషిస్తారు. కష్టాలనూ, సుఖాలనూ దేవుడు ఇచ్చిన బహుమతులుగా స్వీకరించేవారు కోటానుకోట్లమందిలో ఏ ఒక్కరో ఉంటారు. అలాంటి సూఫీ గురువు కథ ఇది.

ఆ గురువు ప్రతిరోజూ ప్రార్థన చేసేటప్పుడు ‘‘ఓ భగవంతుడా! ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నన్ను నువ్వు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటావో ఏమో! ఎంతో కరుణతో నాకు కావలసినవన్నీ ఈ రోజు సమకూర్చి పెట్టావు. నా తల్లికన్నా ఎక్కువ శ్రద్ధతో, జాగ్రత్తతో నన్ను కనిపెట్టి ఉన్నావు. నా కృతజ్ఞతలు ఎలా తెలపాలో, ఏ మాటలు అందుకు సరిపోతాయో నాకు తెలియడం లేదు ప్రభూ’’ అంటూ కన్నీరు కార్చేవాడు.

ఒకసారి ఆయన తన శిష్యులతో కలిసి పొరుగు ఊరుకు వెళ్ళాడు. ఆ ఊరివారెవరూ వాళ్ళను పట్టించుకోలేదు. ఆహారం పెట్టలేదు. దీంతో వాళ్ళందరూ నిరాహారంగానే పడుకున్నారు. ఆ రోజు కూడా సూఫీ గురువు రాత్రి నిద్రపోయే ముందు ఎప్పుడూ చేసే ప్రార్థనే చేశాడు. శిష్యులు ఈ సంగతి గమనించారు. వారంతా ఆ రాత్రంతా ఖాళీ కడుపులతోనే ఉండాల్సి వచ్చింది. రెండో రోజు, మూడో రోజు కూడా ఇలాగే జరిగింది. తినడానికి ఏదీ లేక, ఆకలితో కడుపులు కాలుతూ ఉంటే నిద్ర రాక... ఆ శిష్యులంతా తమ గురువు పక్కనే అసహనంగా దొర్లుతున్నారు.

గురువు ఎప్పటిలానే ‘‘ఓ నా తండ్రీ! కరుణామయుడా! నా మీద నీకు ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ! లోకంలోని ఇన్ని కోటానుకోట్లమందిలో నన్ను గుర్తు పెట్టుకొని, నా మీద అపారమైన నీ దయావృష్టిని కురిపించి కాపాడుతున్నావు.

నాకు ఏది అవసరమో కనిపెట్టి, సమయానికి సరిగ్గా సమకూరుస్తున్నావు. తండ్రీ! నీ ఋణాన్ని నేను ఎలా తీర్చుకోగలను’’ అంటూ ఏడ్చాడు.

తాము ఆకలి మంటల్లో కాలిపోతూ ఉంటే గురువు ఈ విధంగా ప్రార్థించడం విన్న శిష్యులకు ఆగ్రహం వచ్చింది. వారిలో ఒకరు కోపం ఆపుకోలేక -

‘‘మహాశయా! అర్థం పర్థం లేని ఆ మాటల్ని ఆపండి. మూడు రోజులుగా తినడానికి తిండీ, నిద్రపోవడానికి వసతీ లేక... ఈ నిర్జన ప్రదేశంలో చెట్లకింద, ఇన్ని నీళ్ళు తాగి పడుకుంటున్నాం. మీరేమో దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థిస్తున్నారు. ఇంతకన్నా పిచ్చి, వెర్రి, అవివేకం ఇంకేం ఉంటుంది?’’ అని ఆవేశంగా అన్నాడు.

ఆ గురువు ప్రశాంత వదనంతో, ‘‘నాయనా! ఎన్నో ఏళ్ళుగా నేను తెలుసుకోలేని ఆ ప్రభువు ఘనతనూ, మహిమనూ ఈ మూడురోజుల ఆకలి, అవమానం, ఆపదల ద్వారా గ్రహించగలిగాను. అవి నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరం కాబట్టే ఆ దయామయుడు వాటిని నాకు సమకూర్చాడు. తిండి లేకపోయినా, గూడు లేకపోయినా, ఎన్నెన్నో ఆపదలు చుట్టు ముట్టినా... ఆ భగవంతుడి దయ ఉంటే బతికి ఉండగలమనే పాఠాన్ని గ్రహించాం కదా! నా భగవంతుడు కరుణాసముద్రుడనడానికి ఇంతకన్నా మంచి నిరూపణ ఉంటుందా’’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా కన్నీరు కార్చాడు.

లోకంలో అందరూ భగవంతుడు తమకు ఎంత ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా... అవి సరిపోలేదనీ, ఇంకా కావాలనీ ఏడ్చేవాళ్ళే! ‘జీవించడానికి అత్యవసరమైన ఆహారం ఇవ్వకపోయినా... అంతకన్నా విలువైన జీవితాన్ని ఇచ్చావు’ అంటూ, భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేవారు ఎందరుంటారు?

🕉️🌞🌎🏵️🌼🌈

Source - Whatsapp Message

No comments:

Post a Comment