Sunday, December 5, 2021

నేటి జీవిత సత్యం. 💥వివేకం-విచక్షణ💎*

నేటి జీవిత సత్యం.
💥వివేకం-విచక్షణ💎


ఏ విషయంలోనైనా సరే నిజం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మనది పోయేదేముందని ఎలాపడితే అలా మాట్లాడకూడదు. చిక్కులు కొనితెచ్చుకోకూడదు. అందుకు వివేకం ఎంతో అవసరం. వివేకం పుస్తక పాండిత్యం కాదు. అది దైవదత్త వరం. మనిషిని ఆపదల్లో చిక్కుకోకుండా తెలివితేటలతో బయటికి చేరుకొనేలా చేసి చక్కటి దారిచూపే దిక్సూచి.
అవివేకం మూర్ఖతకు నెలవు. ఆపదలకు నిలయం. వివేకం- అవివేకం బద్ధశత్రువులు. అవివేకానికి వివేకం అంటే ససేమిరా పడదు. ఒకటి ఉప్పు. మరొకటి నిప్పు. మనిషికి వివేకం తోడైననాడు ఎంతటి కష్టతర కార్యమైనా నిరాటంకంగా ముందుకు సాగిపోతుంది. నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వివేకం లోపిస్తే పండితులు సైతం పరమశుంఠలుగా ప్రవర్తించే అవకాశం ఉంది. వివేకం వివేచనకు అంకురం. బుద్ధి కుశలతతో చేపట్టిన ప్రతికార్యంలో తెలివి పనిచేయడం ప్రారంభమవుతుంది.
పరీక్షించి చూసేవరకు పరులను నమ్మవద్దని చెబుతుంది వివేకం. అపనమ్మకాన్ని ఆమడదూరాన ఉంచమంటుంది. ఒంటె కష్టాన్ని, వేడిని, ఆకలిని, దాహాన్ని ఓర్చుకొని ఇసుక ఎడారుల్లో బరువులను మోసుకుపోతూ ఉంటుంది. అలాగే వివేకం కష్టాల కడలిని సులభంగా దాటిస్తుంది.అవివేకం మనిషిని వెర్రివాణ్ని చేసి అపహాస్యంపాలు చేస్తుంది. వివేకం ఆశాభావాన్ని రేకెత్తించి భుజం తట్టి వ్యక్తిని కార్యోన్ముఖుణ్ని చేస్తుంది. అతడికున్న చాపల్యాన్ని అరికడుతుంది. అవివేకి దానికి వశుడై నష్టపోతాడు.
అతిని మితం గావించుకునే వివేకం మనిషికి నిరంతరం అవసరమే. లక్ష్యాలు, ఆశయాలు దీనితోనే సాకారం అవుతాయి. సాధారణ మనిషిని సైతం ఓ ఉన్నతస్థానంలో కూచుండబెట్టేందుకు వివేకం ఎంతగానో ఉపకరిస్తుంది.
లంకాధిపతి రావణుడు అహంకారంతో సీతను అపహరించుకొని వచ్చాడు. నిద్రనుంచి మేల్కొన్న కుంభకర్ణుడికి విషయం తెలిసింది. ‘అన్నా అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడి సతీమణిని అపహరించుకొని రావడంతో నీ అవివేకాన్ని నిరూపించుకొన్నట్లయింది. మళ్లీ ఆమెను రామచంద్రుడి వద్దకు చేర్చి క్షమాపణ కోరుకో. నీకు మేలు జరుగుతుంది’ అంటూ హితవచనం చెప్పాడు. రావణుడు తమ్ముడి మాటల్ని తోసిపుచ్చాడు. చివరికి రాముడి చేతిలోనే హతమయ్యాడు.
అవివేకం వల్ల తొందరపాటుతనం అధికమవుతుంది
ఆపదల్ని కొనితెచ్చుకొన్నట్లవుతుంది అనే హితవచనం చెబుతాడు మహాకవి భారవి తన కిరాతార్జునీయ కావ్యంలో. కర్తవ్యం అనే విత్తనాలను వివేకం అనే నీటితో తడిపి చల్లినట్లయితే ఆ క్రియ శరత్కాలపంటలా సత్ఫలితాలను సంపాదించి పెడుతుంది. వివేకం కలిగించే విచక్షణే దీనిక్కారణం. వివేకవంతుడు సన్నిహితుల మాటల్లోని మంచి చెడులను, మాయమర్మాలను తనకు తానుగా తెలుసుకుంటాడు. సరైన నిర్ణయం తీసుకొంటాడు. ప్రతీది పరిశీలనాత్మకంగా చూసుకొంటూ జాగ్రత్తగా ముందుకెళ్లేవాడి భవిష్యత్తు బంగారుమయమే. కుతంత్రపు పరీక్షలకు లొంగిపోయి చేసే ఆలోచనలతో వివేకం ఉద్భవించదు. వ్యక్తిలో వివేకం ఉదయిస్తే కలతలు, కలహాలకు చోటుండదు. మనసును, హృదయాన్ని భారంగా కుంగదీసే మౌఢ్యాలను, మూర్ఖతలను వదిలిపెట్టి మనిషి ముందుకెళ్లాలి. వివేకంతో జీవితం మకరందమయం అవుతుంది.*

- యం.సి.శివశంకరశాస్త్రి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment