Saturday, December 4, 2021

ఆనందం ఎక్కడ?


Vittal Babu asked a question .
21 November at 10:31 · Facebook for Android ·
🙏🕉ఆనందం ఎక్కడ?🕉🙏
మనకు లెక్కలేని కోరికలు. ఎంతో శ్రమపడి ఎన్నో వస్తువులను సంపాదించి ఇవన్నీ నావి అని భ్రమలో పడుతూ వుంటాము. ఒక రోజు వీటినన్నింటినీ విడచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్లిపోతే మాత్రమేమి? మరొకజన్మ మనకు సిద్ధంగా కాచుకొని వుంటుంది. ఇంకోజన్మ కూడదంటే మనకున్న కోరికలకంతా రాజీనామా ఇచ్చి, ఏ కోరికా లేకుండా పరమాత్మతో కలసిపోవాలి.
సృష్టిలో వున్న జీవరాశులలోకెల్లా, మనిషికి జ్ఞానమెక్కువ అని మనం గర్వపడుతూ వుంటాము. కానీ తక్కిన జీవరాశులకంటే మనమే విధంగా గొప్ప? నక్క, కుక్క, ఏనుగు, ఎలుక, చీమ, దోమ ఇవన్నీ ఆహారం కోసం ప్రయత్నంచేస్తూ ఉంటాయి. తమ సంతతిని వృద్ధిచేస్తాయి. అవీ నిద్రపోతాయి. కాలం తీరిపోతే ఒక రోజు అనే దీర్ఘ నిద్రలో కలసిపోతాయి. వీనికంటే మనం ఏ విధంగా గొప్ప? వీనితో పోల్చుకొంటే వీనికంటే విశిష్ఠమైన జ్ఞానాన్నీ, వివేకాన్నీ మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ వివేకాన్ని ఉపయోగించి, నిత్యానందానుభూతికి మనం ప్రయత్నించకపోతే అంతకంటే గర్హనీయమైనదేముంటుంది?
మనం యోచించి చూచామంటే, జ్ఞానం, ఆనందం, మనము - ఇవన్నీ ఒక్కటే. మనమెవరము? దీర్ఘంగా విచారిస్తే, మనము జ్ఞాన స్వరూపులము, చిన్మయులము, ఆనంద బ్రహ్మములని తెలుసుకొంటాం.
మనకు బాహ్యంగా వున్న వస్తువులనుంచి మనకెన్నడూ ఆనందం రాదు. ఆనందమనేది మనలోనే ఉద్భవిస్తుంది. అజ్ఞానం చేత బాహ్యవస్తువులు మనవనీ, మనమనీ భ్రమపడటంవల్ల, ఆనందం లోపిస్తున్నది. ఒక ఉదాహరణ చెపుతాను.
ఒకనికి స్వంతంగా కొంత సాగు భూమి ఉన్నది. ప్రతి సంవత్సరమూ, దానిని దున్ని పండించి సంతోషపడేవాడు.
కాలక్రమేణా ఆ భూమిలోపంట తగ్గటం ప్రారంభించింది. దానిని మరొకనికి అమ్మివేసినాడు. ఆ భూమిని కొన్న క్రొత్త యజమాని సేద్యం ప్రారంభించేసరికి, ఆ భూమిలో నాలుగింతలు ధాన్యం పండసాగింది. అంతటితో ఆ భూమిని అమ్మిన పెద్దమనిషికి ఎక్కడలేని అశాంతి పుట్టుకొని వచ్చింది. ఆ భూమి తనదైనపుడు, అది పండినపుడంతా సంతోషించినవాడు, నేడు దుఃఖసముద్రంలో మునిగిపోయాడు. ఇపుడు భూమి తనది కాదు, వేరొక్కనిది. ఈ మమకారం అనేది ఎన్ని కష్టాలు తెచ్చి పెడుతుంది? మమకారం అనేది దుఃఖానికి మరొకరూపం అనాలి.
మరొక్క ఉదాహరణ. ఒక పెద్దమనిషి నా వద్దకు అప్పుడప్పుడూ వచ్చేవాడు. ద్వితీయ వివాహం చేసుకొన్నాడు. మొదటి భార్యకు ఒక పుత్రుడున్నాడు. ఆ పుత్రునికీ, సవతి తల్లికీ కలహాలు ఏర్పడినవి. మొదటిభార్య పుత్రుడు సవతి తల్లిని ఉద్దేశించి ఏవో అభిచార ప్రయోగాలు చేశాడట. ఆ ప్రయోగాలు ఎదురు తిరిగి అతనినే బాధించ సాగినవట. ఈ తండ్రికి - పరిపూర్ణంగా రెండవ భార్యపక్షంలో చేరిపోయిన పెద్దమనిషికి - ఒక్కటే ఆనందం! ఆ పిల్లవాడు తన మొదటి భార్యకు పుట్టిన స్వంత కుమారుడన్న విషయాన్ని పూర్తిగా విస్మరించాడు! ఆ పిల్లవాడు పరాయివాడైపోయాడు. అతనికి హానికలిగిందంటే ఈయన దుఃఖించడానికి బదులు సంతోషిస్తున్నాడు. ఇదీ లోకరీతి.
మాయలో చిక్కుకొన్న మనకే అపుడపుడూ ఆనందం కలుగుతూ వుందంటే, అన్నీ వదలిపెట్టి, ''నేను'' ను విస్మరిస్తే - ఎంత ఆనందం? కొంచెం చేదుగా వున్న కూరలో బెల్లం కలిపితే చేదు తగ్గి తీపి ఔతుంది. పూర్తిగా బెల్లమే ఐతే? మనం మాయ అను ఘటంలో వున్నాం. ఈ కుండను, ఈ ఘటాన్ని మనం పగలకొట్టాలి. ఈ కుండ పగిలిపోతే దానితో బాటు భేద దృష్టీ పోతుంది. ఆనందమే మిగులుతుంది.
ఆశలనే పంజరంలో మనం బంధితులమై వున్నాం. ఆ పంజరంలో నుంచి బయటపడ్డామంటే, 'మాయ'మాయమౌతుంది. మనస్సు ఉన్నంత వఱకు ఆశలు వుంటాయి. ఆశలు పోవాలంటే, మనస్సు పోవాలి. ఉన్న మనస్సుపోతే మనం జడులము కామా? అని భాధపడనవసరం లేదు. చిత్తవృత్తులు క్షీణం కానుకాను, మనస్సుకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రమైన మనస్సుకు ఎన్నో శక్తులు వస్తాయి. దీనికి ఉదాహరణం మన ఋషులే. ఋషులు నిగ్రహానుగ్రహ సమర్థులు. త్రికాల జ్ఞానసంపన్నులు. దూరదృష్టి, దూరశ్రవణంలాంటి శక్తిసంపన్నులు. అట్టి శక్తిచేతనే వారు మంత్రద్రష్టలయ్యారు. అన్ని ధర్మాలకు మూలం వేదం. వేదవిహిత కర్మలవలన, నిరీహులమై ఆత్మ సంయమన పరులమౌతాం. అట్టి రమణీయాచరణచేత ఆనందమయులమై పోగలం.

సేకరణ

No comments:

Post a Comment