Tuesday, December 14, 2021

️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో "చేసిన మంచి పని ఎప్పుడూ తిరిగి వస్తుంది"

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో
♥️ కథ-42 ♥️
అనుభూతి - ప్రతి ఒక్కరి నుండి పొందిన సహాయానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.
మాస్టర్ గారి స్కూటర్

ప్రవీణ్ భారతి అనే టీచర్ ఉండేవాడు, ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధించేవాడు, అతని పాఠశాల గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాఠశాల పరిసర ప్రాంతాలు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండేవి.
తన గ్రామం నుండి పాఠశాలకు చేరుకోవడానికి రవాణా మార్గాలు చాలా అరుదుగా అందుబాటులో ఉండడంతో, అతను తరచుగా లిఫ్ట్ కోసం అడిగేవాడు. ఇక లిఫ్ట్ దొరకని రోజుల్లో “భగవంతుడు నాకు రెండు కాళ్లు ఇచ్చాడు, అవి ఇంక దేనికి ఉపయోగపడతాయి” అని అనుకుంటూ స్కూల్ కి నడిచి వెళ్ళేవాడు.
ప్రవీణ్ ప్రతిరోజూ లిఫ్ట్ అడగడానికి నిలబడినప్పుడు ఇలా అనుకొనేవాడు, "ప్రభుత్వం ఈ నిర్మానుష్యమైన, నిర్జన ఎడారిలాంటి ప్రదేశంలో పాఠశాల ఎందుకు తెరిచింది, దీనికన్నా నేను గ్రామంలో ఒక కిరాణా దుకాణం తెరుచుకుని ఉంటే బాగుండేది."
రోజువారీ కష్టాల నుండి బయటపడటానికి, ప్రవీణ్ కొద్దికొద్దిగా డబ్బును సేకరించి, చేతక్ కంపెనీ వారి కొత్తగా మెరుస్తున్న స్కూటర్ కొనుకున్నాడు. వాహనం లేకుండా తాను చాలా ఇబ్బందులు పడ్డానని, ఎవరైనా లిఫ్ట్ కోసం అడిగేవారినెవర్నీ తిరస్కరించకూడదని ప్రవీణ్ ఒట్టుపెట్టుకున్నాడు.
ఎందుకంటే, ఎవరైనా లిఫ్ట్ నిరాకరించినప్పుడు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అతనికి తెలుసు. ఇప్పుడు ప్రవీణ్ తన మెరిసే స్కూటర్ పై ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేవాడు, దారిలో ఎవరోఒకరు లిఫ్ట్ అడిగి అతనితో వెళ్ళేవారు. తిరిగి వచ్చేటప్పడు, మరొకరు అతనితో వచ్చేవారు.

ఒక రోజు, ప్రవీణ్ పాఠశాల నుండి తిరిగి వస్తున్నప్పుడు, దారిలో ఒక వ్యక్తి, లిఫ్ట్ చాలా అవసరమన్నట్లుగా చేయి ఊపుతూ కనిపించాడు. అలవాటు ప్రకారం ప్రవీణ్ స్కూటర్ ఆపగా, ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా స్కూటర్ వెనుక ఎక్కి కూర్చున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే, ఆ వ్యక్తి ఒక కత్తి తీసి ప్రవీణ్ వీపుపై పెట్టి, " మర్యాదగా నీవద్ద ఉన్న డబ్బు, ఈ స్కూటర్ నాకు ఇచ్చేయి" అన్నాడు.
ఈ బెదిరింపు విన్న ప్రవీణ్ చాలా భయపడ్డాడు, వెంటనే స్కూటర్ ని ఆపాడు.
అంత డబ్బు అతని వద్ద లేదు, కానీ అతను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే స్కూటర్ ఉంది.
స్కూటర్ తాళం ఇస్తూ ప్రవీణ్ "ఒక చిన్న విన్నపం " అని అన్నాడు.
"ఏమిటది ?" ఆ వ్యక్తి కోపంగా బదులిచ్చాడు.
" నువ్వు ఈ స్కూటర్ ని ఎక్కడ నుండి ఎలా దొంగిలించావో ఎవరికీ చెప్పకు, నేను కూడా ఎవరికీ ఫిర్యాదు చేయను, దయచేసి నన్ను నమ్ము" అని ప్రవీణ్ వేడుకున్నాడు.
ఆ వ్యక్తి ఆశ్చర్యంగా, "ఎందుకు?" అని అడిగాడు.
గుండెలో భయం, ముఖంలో విచారంతో ప్రవీణ్ ఇలా అన్నాడు: "ఈ రహదారి పూర్తిగా నిర్జనంగా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదు. ఈ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు జరగడం ప్రారంభమైతే, ఇచ్చే ఆ కొద్దిమంది కూడా లిఫ్ట్ ఇవ్వడం మానేస్తారు."
ఈ ఉద్వేగభరితమైన మాటలు విన్న ఆ వ్యక్తి హృదయం ద్రవించి పోయింది. ప్రవీణ్ చాలా మంచి మనిషి అని అనుకున్నాడు, కానీ అతను కూడా తనని తాను పోషించుకోవాల్సి ఉంది కనుక, ‘సరే’ అని స్కూటర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు ఉదయం వార్తాపత్రిక తీయడానికి ప్రవీణ్ వీధి తలుపు తెరిచిన వెంటనే, స్కూటర్ గుమ్మం ముందు ఆపి ఉండడం చూసాడు! అతని ఆనందానికి అవధులు లేవు. తన బిడ్డను చూసినట్లుగా స్కూటర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, ప్రేమగా చెయ్యి వేసి, మెల్లగా నిమరడం మొదలుపెట్టాడు. స్కూటర్ కి అతికించిఉన్న కాగితం చూశాడు.
దాని మీద ఇలా వ్రాసి ఉంది:
"మసాబ్(మాస్టర్ /టీచర్), నీ మాటలు విని నా హృదయం ద్రవించిపోయిందని అనుకోవద్దు.

నిన్న పాత ఇనపకొట్టు వ్యాపారికి నీ స్కూటర్ అమ్ముదామనుకుని తీసుకెళ్లాను. స్కూటర్ చూడగానే, నేను ఒక్క మాట కూడా మాట్లాడకముందే, "ఏయ్ ఇది మసాబ్ స్కూటర్ కదా!" అని అన్నాడు.

నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో, అతనితో: "అవును! మసాబ్ నన్ను ఒక పని మీద మార్కెట్ కి పంపాడు", అని చెప్పాను.
కానీ ఆ వ్యక్తికి నా మీద అనుమానం వచ్చిందేమో అనిపించింది.
అక్కడి నుంచి తప్పించుకుని ఓ మిఠాయి దుకాణానికి వెళ్లాను. నాకు చాలా ఆకలిగా వేయడంవలన ఏదైనా తిందామని అనుకున్నాను.
మిఠాయి వ్యాపారి కళ్ళు స్కూటర్ మీద పడగానే, అతను వెంటనే అన్నాడు: "ఏయ్ ఇది మసాబ్ స్కూటర్ కదా!" అన్నాడు.
ఇది విని, నేను భయాందోళనకు గురయ్యి, "అవును, నేను అతని కోసమే ఈ వస్తువులను కొందామని వచ్చాను,అతని ఇంటికి అతిథులు వచ్చారు" అని, ఎలాగోలా అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాను.
అప్పుడు ఈఊరి నుంచి వెళ్లి వేరే చోట అమ్మేద్దామా అనుకున్నాను.
ఊరి కూడలి వద్ద ఒక పోలీసు నన్ను పట్టుకుని ఆపి, కోపంగా "ఎక్కడికి వెళ్తున్నావు?
మసాబ్ స్కూటర్ నీ దగ్గరకు ఎలా వచ్చింది?"అని అడగడం ప్రారంభించాడు.
ఏదో సాకు చెప్పి, ఎలాగోలా అతడిని కూడా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాను.
పరుగెత్తి పరిగెత్తి నేను అలసిపోయాను!
మసాబ్, ఇది మీ స్కూటరా లేక అమితాబ్ బచ్చనా?
దీనిని అందరూ గుర్తుపడుతున్నారు. నేను మీ వస్తువును తిరిగి మీకు అప్పగిస్తున్నాను. దాన్ని అమ్మే శక్తి, ధైర్యం రెండూ నాకు లేవు. మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఆ ఇబ్బందికి ప్రతిఫలంగా స్కూటర్ ట్యాంక్ ను పెట్రోల్ తో నింపిఇస్తున్నాను."

ఈ ఉత్తరం చదివిన ప్రవీణ్ చిరునవ్వు నవ్వి,
"చేసిన మంచి పని ఎప్పుడూ తిరిగి వస్తుంది" అనుకున్నాడు.

♾️

మీరు ఉదాత్త హృదయంతో ఉంటే, మీ చుట్టూ ఉన్నవారు తప్పకుండా ఆనందాన్ని అనుభవిస్తారు. 🌼
లాలాజీ


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

No comments:

Post a Comment