Thursday, January 27, 2022

ఏవి చదవాలి.

ఏవి చదవాలి.

మంచినీళ్ళు త్రాగుతారా అనకూడదు, పుచ్చుకుంటారా అనాలి” వంటి మన తెలుగువారి భాష, అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా, ఓ అచ్చతెలుగు రచయిత జీవితాన్ని చూడాలన్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా... శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆత్మకథ… “అనుభవాలూ - జ్ఞాపకాలూనూ” చదవాలి.

ఆత్మకథ చదువుతూ రసానుభూతి పొందాలన్నా, “త్వరగా చదివితే అయిపోతుందేమో!” అని భయం కలిగించేంత ఆనందం కలగాలన్నా తిరుమల రామచంద్రగారి “హంపీ నుంచి హరప్పా దాకా” చదవాలి.

వకీలు అయ్యుండి కోర్టు హాలులో మాట్లాడలేక నాలుక పిడచకట్టుకుపోతుంటే, చుట్టూ ఉన్నవారు నవ్వుతుంటే తల దించుకున్న ఒక సాధారణ మనిషి, ఆ తరువాత కాలంలో ఆయన నోటి వెంట మాట రావడమే ఆలస్యం 30 కోట్లమంది మారుమాట్లాడక ఆ మాటను అనుసరించే స్థాయికి చేరుకున్నాడు. ఆ గాంధీ మహాత్ముని జీవితంలో మూడొంతులు భాగం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ “సత్యశోధన” చదవాలి.

“తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి”, “ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది”, “డామిట్ కథ అడ్డం తిరిగింది” ఇలా తెలుగువారి నోళ్ళలో నానే ఎన్నో నానుడులకు వెనకనున్న కథాకమామిషులను, గిరీశం లెక్చర్లు, మధురవాణి నవ్వు, రామప్ప పంతులు కోతలు, ఆడవేషంలో చుట్టకాల్చే శిష్యుడు, చీపిరికట్ట తిరగేసి కొట్టే పూటకూళ్ళమ్మ, సజ్జనుడైన సౌజన్యారావు పంతులు గారు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష ” అనే అగ్నిహోత్రావధాన్లు ఇలా అందరినీ, అన్నిటినీ ఒక చుట్టు చుట్టి రావాలంటే “కన్యాశుల్కం” నాటకాన్ని చదవాలి.

ఒక చిన్న తండా నాయకుని కొడుకు జగజ్జేతగా మారిన వైనాన్నీ, ఆ జగజ్జేత జీవితాన్నీ, మనస్సుని తెలుసుకోవాలంటే తెన్నేటి సూరి గారి “చెంఘీజ్ ఖాన్” నవల చదవాలి.

తెలుగువారి మహాభారతంగా కీర్తించబడేది, కవిసమ్రాట్ విశ్వనాథ వారి మహోన్నత సృష్టి, అరుంధతీ ధర్మారావుల జీవితం చుట్టూ అల్లిన మనిషి చరిత్ర, ముళ్ళపూడి వెంకటరమణ గారు “నా తల్లీ, తండ్రీ గురువు దైవం ఈ పుస్తకమే” అని చెప్పుకున్న “వేయిపడగలు”ను తెలుగు వచ్చినవారంతా చదవాలి.

ఎక్కడికో మండుటెండలో వెళ్ళాల్సిన పనిబడితే, బస్సు ప్రయాణానికి డబ్బుల్లేక, ఆ ఎండ బాధ తెలియకుండా ఉండటానికి పుస్తకం చదువుకుంటూ నడిచిన ఘట్టాన్ని... ”నాకు అలవాటైన 11వ నెంబరు బస్సెక్కాను”, “ఎర్రని ఎండలో 58 పేజీలు నడిచాను” అంటూ సరదా మాటలతో నడిపించిన వారు ముళ్ళపూడి వారు. విషాదకరమైన విషయం చెబుతున్నా, చదివేవారిని బాధపడనివ్వకుండా దానికి హాస్యపు ముసుగు కప్పేస్తాడాయన. కొన్ని వందల సరదా సంగతులు విసురుతూ, ఆయన బాపూ గారితో కలిసి ఆడిన “కోతికొమ్మచ్చు”లు మూడు భాగాలనూ చదవాలి.

“కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి

పంజరాన గట్టు వడను నేను

నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు

తరుగు లేదు విశ్వనరుడను నేను” అన్న కవికోకిలా జాషువ గారి కవితా విశ్వరూపం చూడాలంటే వారి సర్వలభ్యరచనలు ఒక్క పుస్తకంలో దొరికే సంకలనాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కోవాలి.

“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల…” అంటూ ఉమర్ ఖయ్యాం రుబాయితులను తేనెతో కలిపి తెలుగువారితో త్రాగించిన మరో కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు. వారి “పానశాల”లో పద్యాలను మనం కూడా తాగి మత్తెక్కిపోవాలి.

“ఖడ్గసృష్టి” రాసినవాడు, “మహాప్రస్థానం” చేసినవాడు అయిన శ్రీశ్రీ పుస్తకాలలో ఈ రెండూ చదవకపోతే, తప్పక కొని చదవాలి. ఒకవేళ ఇప్పటికే చదివేస్తే కనుక, సరదాగా సిరిసిరి మువ్వలతోను, ప్రాసక్రీడలతోను, లిమరుక్కులతోను కాసేపు ఆటలాడడానికి “సిప్రాలి” కొనుక్కోవాలి.

హిందూమతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా అవన్నీ పటాపంచలు అయిపోవడానికీ, ఇక ఇంతకుమించిన ప్రామాణికమైన బోధలు లేవని పూర్తి విశ్వాసం కలిగించగల కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాముల వారి “జగద్గురు బోధలు” పది పుస్తకాల సెట్టును పట్టుకునే ఇంటికి వెళ్ళాలి,

ఒక ఆంగ్లేయుడు సత్యాన్వేషణ కోసం చేసిన పయనాన్ని, చివరికి తన గమ్యమైన అరుణాచలాన్ని చేరుకున్న వైనాన్నీ తెలుసుకోవాలంటే పాల్ బ్రంటన్ రచనకు తెలుగుసేత అయిన “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ”ను తప్పక చదవాలి.

సంఘజీవన విధానం మీద, మన అలవాట్ల మీద సెటైర్ ఎలా వెయ్యాలో తెలుసుకోవాలన్నా, సరదా కథనంతో వెళుతూనే చెంపలు ఛెళ్ళుమనిపించే చమక్కులు కురిపించాలన్నా, ఆ జంఘాలశాస్త్రిని పుట్టించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి “సాక్షి” వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి.

రెండేళ్ళుగా వర్షాలు లేక తిరుమలలో నీటికి కటకట ఏర్పడితే… వరుణ యాగం చేసి కుండపోత వర్షం కురిపించిన పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి గురించీ, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ఓ IAS అధికారి పట్టాలెక్కించిన విధానం గురించీ, అపర చాణక్యుడిగా పేరుగాంచిన పి.వి. నరసింహారావు మనస్తత్వం గురించీ, తెలుగు వారి ఆరాధ్య కథా, ప్రజా నాయకుడు ఎన్టీయార్ పరిపాలనా విధానాల గురించీ, ఇలా ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే ఇంకెన్నో విషయాలున్న పి.వి.ఆర్.కె ప్రసాద్ గారి “నాహం కర్తా, హరిః కర్తా”, “అసలేం జరిగిందంటే” పుస్తకాలు కనబడగానే కొనేసుకోవాలి.

ఇంకా…

ఆది శంకరుల నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకూ ఉన్న భారతీయ తత్వవేత్తల గురించి, కార్ల్‌మార్క్, ఫ్రెడరిక్ నీషే, ఆర్ధర్ షోపనార్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల గురించి, వాళ్ళ తత్వసారాల గురించి సులభంగా తెలుసుకోవాలంటే త్రిపురనేని గోపీచంద్ “తత్వవేత్తలు” పుస్తకాన్ని చదవాలి.

భగవద్గీత చదవాలి అనుకునే వారికి అమృత తుల్యమయినది, ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యలతో కూడినది అయిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారి “గీతామకరంద” గ్రంథాన్ని పారాయణ చేయాలి.

కృష్ణలో మునకలేస్తూ, కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త ఆనందంతో అమరావతి పట్నంలో తిరుగుతున్న అనుభూతి కావాలంటే, సత్యం శంకరమంచి గారి “అమరావతి కథలు”ను తోడు తీసుకెళ్ళాలి,

ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారెవరికైనా సరే, ఉన్నత స్థాయి ఆనందాన్ని కలిగించే ఉత్తమ స్థాయి పుస్తకం... పరమహంస యోగానంద గారి “ఒక యోగి ఆత్మకథ”.

కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు, కథ రాయడానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతుల వివరాలు గ్రహించాలనుకునేవాళ్ళు కచ్చితంగా చదవవలసిన పుస్తకం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి “కథాశిల్పం”

ఇంకా తెలుగు కథ ఘనతను అంతెత్తుకు తీసుకువెళ్ళిన మల్లాది రామకృష్ణశాస్త్రి గారి, వేలూరి శివరామశాస్త్రి గారి కథా సంపుటాలు, హాయిని కలిగించే భానుమతి గారి “అత్తగారి కథలు”, రామాయణం 24 వేల శ్లోకాలూ టీకా తాత్పర్యాలతో కావాలనుకునేవాళ్ళకు పుల్లెలవారి రామాయణం, టి.టి.డి వాళ్ళు ప్రచురించిన ఆంధ్రమహాభారతం, పోతన భాగవతం, రామకృష్ణమఠం వారు సులభశైలిలో అర్థమయ్యేలా ప్రచురించిన ఉపనిషత్తుల పుస్తకాలు ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment