Monday, March 21, 2022

కవిత: ఏదీ...ఓసారి!

 

ఏదీ...ఓసారి!
----------------------
మాట్లాడొచ్చుగా మరోసారి
ఈ నిశ్శబ్దం ఘనీభవించిన నిశీధులను వెన్నెల చేస్తూ
ఈ విషాదం ద్రవీభవించిన అశ్రువులను
ఆహుతి చేస్తూ
మాట్లాడొచ్చుగా మరోసారి!
క్షణాలు పరిమళభరితం అయ్యేవి
యుగాలు క్షణాలుగా గడిచేవి
నీ సన్నిధిలో!
మాట్లాడొచ్చుగా మరోసారి!
మనం చేల గట్లపై,
మనం సరుగుడు తోపుల్లో,
మనం ఏకాంత సమీరాన్ని ఆస్వాదిస్తూ,
మనం లోకాన్నే ధిక్కరిస్తూ,
మనం మనంగా జీవించిన క్షణాల్ని తలపోస్తూ,
మాట్లాడొచ్చుగా మరోసారి!
ఒకరికొకరం ఎన్ని లేఖలు రాసుకునేవాళ్ళం,
ఒకరికొకరం ఎన్ని వేకువల్లో కలుసుకునేవాళ్ళం,
ఒకరికొకరం ఒకరికొకరుగా ఎన్ని అనుభూతుల్ని పంచుకునేవాళ్ళం,
మాట్లాడొచ్చుగా మరోసారి!
ఈ హృదయంలో భారం ఇక తగ్గదంటూ,
ఈ శిశిరంలో విపినం ఇక జాగు వలదంటూ,
ఈ నయనంలో మేఘం ఇక కురియక తప్పదంటూ,
ఎందుకిలా మారిపోయావు?
ప్రశ్నలకు సముద్రమంత లోతుగా నిశ్వసిస్తావు!
మౌనాన్ని నాకు శాపంగా బహూకరిస్తావు!
సరే,
మాట్లాడొచ్చుగా మరోసారి!
ఈ ఖర్మను నేను జయించేలోగా,
ఈ జన్మను నేను ముగించేలోగా,
మాట్లాడొచ్చుగా మరోసారి!!

---- దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

No comments:

Post a Comment